వీఆర్వోలు లేక పెండింగ్‌లో దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-09-23T06:39:53+05:30 IST

ప్రభుత్వం ఇటీవలే వీఆర్వోలను తొలగించడంతో విచారణ చేయాల్సిన దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్‌లో

వీఆర్వోలు లేక పెండింగ్‌లో దరఖాస్తులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 22 : ప్రభుత్వం ఇటీవలే వీఆర్వోలను తొలగించడంతో విచారణ చేయాల్సిన దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించిన కుల, ఆదాయం వంటి వివిధ సర్టిఫికేట్ల కోసం మీ సేవ కేంద్రాల ద్వారా వేల సంఖ్యలో దరఖాస్తులు తహసీల్దార్‌ కార్యాలయాలకు వచ్చాయి. ఆయా సర్టిఫికేట్లను జారీ చేయాలంటే తొలుత క్షేత్రస్థాయిలో వీఆర్వోలు విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.


ఆ నివేదికను రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లు పరిశీలించి, సంతకం చేస్తేనే తహసీల్దార్‌ ఆయా సర్టిఫికెట్లను జారీ చేస్తారు. అయితే ఉన్నట్టుండి వీఆర్వోలను తొలగించిన ప్రభుత్వం వారి బాధ్యతలను ఇతరులెవరికీ అప్పగించలేదు. దాంతో ఆయా సర్టిఫికెట్ల జారీ పరిశీలన జరగకపోవడంతో మీ-సేవ ద్వారా వచ్చిన వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని 27 మండాలలో కలిపితే 6,940 కుల సర్టిఫికేట్లకు, 6,270 ఆదాయం, 4,500 రెసిడెన్స్‌, 1,145 ఈబీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూడీ, 1,820 కుటుంబ వారసత్వ, 910 క్రిమిలేయర్‌ సర్టిఫికేట్ల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి.


కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పరిస్థితీ అంతే..

ఇలా ఉండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ మంజూరు పరిస్థితి అలాగే తయారైంది. వీటి కోసం చేసుకున్న దరఖాస్తులను కూడా వీఆర్వోలు విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులు సుమారు 450 వరకు ఉంటాయని అధికారవర్గాలు తెలిపాయి. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి, తమకు సంబంధించిన సర్టిఫికేట్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులను త్వరిగతిన పరిశీలింపజేసి, అందజేసేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Updated Date - 2020-09-23T06:39:53+05:30 IST