పచ్చడి మెతుకులూ.. ‘ఖరీదే’

ABN , First Publish Date - 2022-05-15T06:54:35+05:30 IST

గోదావరి జిల్లాల్లో ఆవకాయ లేకుండా ఎవరికైనా ముద్ద దిగుతుందా చెప్పండి. కష్టంకదా..! నిజమే, పప్పుంటే ఆవకాయ ఉండాలి. అసలు ఏమీ లేకపోయినా పచ్చడి ఉంటేచాలు భోజనం తినేస్తాం.

పచ్చడి మెతుకులూ.. ‘ఖరీదే’

మండపేట : గోదావరి జిల్లాల్లో ఆవకాయ లేకుండా ఎవరికైనా ముద్ద దిగుతుందా చెప్పండి. కష్టంకదా..!  

నిజమే, పప్పుంటే ఆవకాయ ఉండాలి. అసలు ఏమీ లేకపోయినా పచ్చడి ఉంటేచాలు భోజనం తినేస్తాం. పూటగడవని కుటుంబాలు, నాలుగురోజులు వానలొస్తే ఉపాధిపోయిన కూలీలు సైతం పచ్చడి మెతుకులతో రోజులు గడిపేస్తారు. వాస్తవానికి ఇది పచ్చళ్ల సీజన్‌. ఏ ఇంట్లో చూసినా నిల్వ పచ్చళ్ల హడావుడే కనిపించేది. ఇప్పుడు ఆ సందడి లేదు. పచ్చడి పట్టేశారా వదినా.. అని ఒకామె అడిగితే, కొబ్బరిమామిడి కాయల కోసం చూస్తున్నామనో, కారం సిద్ధం చేస్తున్నామనో మరొకామె చెప్పేది. ఇప్పుడిలాంటి చర్చలే లేవు. ఎవరూ పచ్చడి మాటెత్తడం లేదు. పచ్చడి పట్టడం అంటే చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. మామిడి కాయల దగ్గర నుంచి పచ్చడి పట్టేందుకు అవసరమైన అన్ని రకాల సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ఎవరూ పచ్చడి పట్టడానికి సాహసించడం లేదు. సామాన్య, మధ్యతరగతి వర్గాల ఇళ్లలోనైతే పచ్చడి ఊసే లేదు. ఒక్క ఆవ కాయ, మాగాయ పచ్చళ్లే కాకుండా ఉసిరి, నిమ్మ, టమోటా వంటి నిల్వ పచ్చళ్ల దగ్గరికీ ఎవరూ వెళ్లడం లేదు. ఆవకాయకు సన్‌ఫ్లవర్‌గాని, నువ్వులనూనెగాని వినియోగిస్తారు. గతేడాది సన్‌ఫ్లవర్‌ కిలో ధర రూ.90 ఉంటే ఇప్పుడు కిలో రూ.198కి చేరింది. అలాగే నువ్వుల నూనె కిలో రూ.350కు విక్రయిస్తున్నారు. నాణ్యతను బట్టి కిలో ఆరేడు వందల వరకు కూడా ఉంది. ఆవకాయలో ప్రధానమైన కారం కోసం అయ్యే ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. ఆవకాయ మిరపకాయలు కిలో రూ.650కి చేరింది. అదేవిధంగా పచ్చడిలో వాడే వెల్లుల్లి, ఆవాలు, ఉప్పుల ధరలు కూడా పెరిగాయి. ఇక ఆవకాయ ముట్టుకోకుండానే ఘాటెక్కిపోయింది. ఆవకాయ మామిడి వంద కాయల ధర రూ.3 వేలకు చేరింది. చివరికి ఈ మామిడికాయలు కోసేందుకు వంద కాయలకు రూ.200 వరకు కూలీలు తీసుకుంటున్నారు. కనీసం టమోటా పచ్చడి చేసుకుందామనుకుంటే టమోటా ధర కిలో రూ.50 పైనే ఉంది. నిజానికి ఈ టమోటా ప్రస్తుత సీజన్‌లో ఎక్కువగా రావడంతోపాటు చవకగా దొరికేది. దాంతో నిల్వ పచ్చడి పట్టేవారు. నూనె, కారం ధరలు పెరుగుదల చూశాక సామాన్యులు పచ్చడి ఆశలు వదులుకున్నారు. కొందరు అప్పటికప్పుడు పట్టుకునే తునకావకాయతో కాలక్షేపం చేస్తున్నారు. ఏటా కొందరు నిమ్మకాయ నిల్వ      పచ్చడి పట్టుకుంటారు. ఈసారి నిమ్మకాయల ధరలు పెరిగిపోవడంతో అదీ మానేశారు. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోవడంతో పచ్చళ్ల కోసం అదనపు ఖర్చు చేయడానికి చాలామంది సిద్ధంగా లేరు. కిలో రూ.50 ఉండే కందిపప్పు రూ.100కి చేరింది. వంటగ్యాస్‌ రూ.650 నుంచి రూ.1050కి చేరింది. పెట్రోలు గతేడాది రూ.80 ఉంటే ఇప్పుడు రూ.120కి చేరింది. కరెంట్‌ బిల్లు గతేడాది రూ.300 వస్తే ఇప్పుడు రూ.700కి చేరింది. రోజూ వాడుకునే మంచినీళ్ల టిన్‌ కూడా రూ.10 నుంచి రూ.20కి పెంచేశారు. అటు చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్‌ బిల్లుల బాదుడు తెలిసిందే. ఇన్ని కష్టాల మధ్య పచ్చడి జోలికి ఎలా వెళ్లగలమన్నది సామాన్యుల ప్రశ్న.

Updated Date - 2022-05-15T06:54:35+05:30 IST