‘డబ్బు’ మొక్కలు

ABN , First Publish Date - 2022-06-29T06:48:07+05:30 IST

మొక్కల పేరుతో మెక్కేయడానికి కాకినాడ కార్పొరేషన్‌లో రంగం సిద్ధమవుతోంది. అవసరం లేకపోయినా భారీ ఎత్తున వీటిని కొనుగోలు చేసి ఆనక కమీషన్లు కొట్టేయ డానికి తెరవెనుక మంత్రాంగం మొదలైంది.

‘డబ్బు’ మొక్కలు

 కాకినాడ కార్పొరేషన్‌లో మొక్కల పేరుతో మేతకు సన్నాహాలు
  ఏకంగా రూ.68 లక్షలతో పూలు, పండ్ల మొక్కలు కొనుగోలుకు టెండర్లు
  ‘జగనన్న హరిత నగరాల’  పేరుతో మొక్కల కోసం లక్షలకు లక్షల వెచ్చింపు
 నగరంలో రహదారుల వెంబడి డివైడర్ల మధ్య పూలమొక్కలకు రూ.48 లక్షలు
  ప్రధాన రహదారుల వెంబడి రూ.20 లక్షలతో పండ్ల మొక్కలు నాటాలని నిర్ణయం
  కార్పొరేషన్‌ పరిధిలో గతంలో వేసిన మొక్కల పర్యవేక్షణకే దిక్కులేదు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి) మొక్కల పేరుతో మెక్కేయడానికి కాకినాడ కార్పొరేషన్‌లో రంగం సిద్ధమవుతోంది. అవసరం లేకపోయినా భారీ ఎత్తున వీటిని కొనుగోలు చేసి ఆనక కమీషన్లు కొట్టేయ డానికి తెరవెనుక మంత్రాంగం మొదలైంది. గతంలో నాటిన మొక్కల కొనుగోళ్లు,  వాటి పర్యవేక్షణ గాలికి వదిలేయడంతో లక్షలకు లక్షలు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోయాయి. మళ్లీ ఈసారి జగనన్న హరిత నగరాల సాకుతో రూ.68 లక్షలతో మొక్కల కొనుగోలుకు టెండర్లు పిలవడం విమర్శల పాలవుతోంది. కేవలం డివైడర్ల మధ్య పూల మొక్కలు నాటడం, రహదారులకు ఇరువైపులా పండ్లు, అందాన్నిచ్చే మొక్కల కోసం అంత మొత్తం వెచ్చించేందుకు ప్రయత్నిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో అనేకసార్లు ఇలా మొక్కలు నాటి ఆలనాపాలనా వదిలేశారు. దీంతో కొన్ని ఎండిపోతే, కొన్ని పశువులు తినేశాయి.  నగర సుందరీకరణ పేరుతో కాకినాడ కార్పొరేషన్‌ ఏటా కొనుగోలు చేస్తున్న మొక్కల్లో భారీగా ముడుపులు చేతులు మారుతున్నాయి. తక్కువ ధర మొక్కలు ఎక్కువకు అంటగట్టడం నుంచి, వీటిని నాటిన కాంట్రాక్టర్‌ అధికారులతో కుమ్మక్కై పర్యవేక్షణ వదిలేయడం, మొక్కలు ఎండి పోయి చచ్చిపోయాయని తెలిసినా అధికారులు బిల్లులు ఇచ్చేసి తమ జేబులు నింపేసుకోవడం పరిపాటిగా మారుతోంది. ఈ ఏడాది కూడా అదే తరహా బాగోతానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘జగనన్న హరిత నగరాలు’ కార్యక్రమాన్ని తమ రాబడికి అనువుగా మార్చుకుంటున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, కార్పొరేషన్ల పరిధిలో పచ్చదనాన్ని పెంచడానికి ‘జగనన్న హరిత నగరాలు’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అందులో కాకినాడకు చోటు కల్పించారు. దీంతో నగరంలో అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద మొక్కలు నాటడంతోపాటు డివైడర్ల మధ్య రంగురంగుల పూల మొక్కలు నాటాలని కార్పొరేషన్‌ అధికా రులు నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం రూ.68 లక్షలు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో రూ.48 లక్షలతో నగరంలో 15 కిలోమీటర్ల మేర రహదారులపైనున్న డివైడర్ల మధ్యలో పూల మొక్కలు నాటాలని నిర్ణయించి టెండర్లు పిలిచారు. ఇవన్నీ కడియం నర్సరీల్లో విరివిగా దొరుకుతాయి. అలాగే రూ.20 లక్షలతో 50వ వార్డులో పలు చోట్ల రహదారికి ఇరువైపులా పెద్దపెద్ద మొక్కలు నాటను న్నారు. వీటికీ టెండర్లు పిలిచారు. వీటికి త్వరలో కడియం నుంచి పలు నర్సరీలు టెండర్లు దాఖలు చేయనున్నాయి. అయితే ప్రతిసారి మొక్కల ధర అడ్డంగా పెంచేసి సదరు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై కొందరు అధికారులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే టెండర్ల విష యమై కొందరు నర్సరీ యజమానులతో అప్పుడే సంప్రదిం పులు మొదలుపెట్టారు. టెండర్లు వేసిన తర్వాత సరఫరాకు సంబంధించి మొక్కల ధరలు పెంచి బిల్లులు చెల్లింపులు చేసేందుకు పన్నాగం పన్నారు. ఇదంతా ఒకెత్తయితే బిల్లులు చెల్లించిన మొక్కలకు.. సరఫరా చేసిన మొక్కలకు ప్రతిసారి తీవ్రంగా వ్యత్యాసం ఉంటోంది. వీటిని ఎవరూ లెక్కించే అవకాశం లేకపోవడంతో వేలాది మొక్కలు వచ్చేశాయని బిల్లులు చెల్లించేస్తున్నారు. ఇలా మొక్కల పేరుతో బొక్కుడు లక్షల్లోనే ఉంటోంది. ఈసారి కూడా అదే తరహాలో పంపకా లకు కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు పావులు కదు పుతున్నారు. ఈనేపథ్యంలో ఈసారి కొనుగోలు చేసే మొక్కల ధరలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ ఓ కమిటీకి అప్పగించాల్సి ఉంది. అలాగే వచ్చిన మొక్కలు.. చెల్లించిన బిల్లులపైనా నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. లేదంటే మళ్లీ పాత కథే.

ఆలనాపాలనా చూడకున్నా బిల్లులు..

మొక్కలు నాటిన కాంట్రాక్టర్‌కు లక్షలకు లక్షలు చదివించడం, ఆ తర్వాత అవి చచ్చిపోయినా అధికారులు పట్టించుకోకపోవడం కార్పొరేష న్‌లో రివాజుగా మారింది. గతంలో అనేకసార్లు ఇలా నాటిన మొక్క లను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం మానేశారు. నాటిన తర్వాత 12 నెల లపాటు బతికేలా చేయడం, ట్రీగార్డులు ఏర్పాటు చేయడం, వాటరింగ్‌ చేయడం వంటివి టెండర్‌ నిబంధనల్లో ఉంటున్నా కాంట్రాక్టర్లు ఇవేవీ అమలు చేయడం లేదు. ఈ కారణంతో బిల్లులు కోయాల్సిన అధికా రులు అదేం పట్టించుకోవడం లేదు. దీంతో నాటినవన్నీ రెండు నెలల్లోనే ఎండిపోతుంటే మరికొన్ని పశువులకు ఫలహారంగా మారుతున్నాయి. కొన్నినెలల కిందట కాకినాడకు మంత్రి బొత్స వచ్చారు. అప్పట్లో ఆయన పురపాలకశాఖ మంత్రి కావడంతో కుళాయి చెరువు పార్కు చుట్టూ భారీగా మొక్కలు నాటారు. ఆ మరుసటి రోజు నుంచి నీళ్లు పోయడం కూడా మానేశారు. కొన్ని ఎండిపోతే.. కొన్నింటిని పశువులు తినేశాయి. అలాగే గతేడాది కార్పొరేషన్‌ భవనం పడగొట్టిన సమయంలో భారీ వృక్షాలను నేల కూల్చాల్సి రావడంతో దానికి బదులుగా రూ.20 లక్షల కుపైగా వెచ్చించి ట్రాన్స్‌లొకేషన్‌ చేయించారు. వేర్లతోసహా వీటిని పెకి లించి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ ఏరియాలోని రోడ్లపై నాటారు. తీరా కాంట్రాక్టర్‌ పట్టించుకోకపోవడంతో రెండు నెలల్లోనే ఎండిపోయి చచ్చిపోయాయి. ఇక నగరంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా, డివైడర్ల మధ్య నాటిన మొక్కల ఆలనాపాలనా కాంట్రాక్టర్లు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇటు కార్పొరేషన్‌ సిబ్బందీ పట్టించుకోవడం లేదు. ఇలా మొక్కల పేరు తో జరుగుతున్న నిధుల దోపిడికి అంతం ఉండడం లేదు.

Updated Date - 2022-06-29T06:48:07+05:30 IST