ఆహ్లాదం.. ఆనందం

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం
ప్రకృతి వనంలో ఏపుగా పెరిగిన పండ్లు, పూల మొక్కలు

  • ఇన్ముల్‌నర్వ పల్లె ప్రకృతివనం చూతం రారండి
  • వాకింగ్‌ ట్రాక్‌, కుర్చీల ఏర్పాటు
  • ఆకర్షణీయంగా పూలు, పండ్ల మొక్కలు
  • గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం గ్రామస్థులకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతోంది.

కొత్తూర్‌: కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనంలో 18 రకాల పూలు, పండ్ల మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరిగి ఫలాల తో పాటు వివిధ రకాలు పూలను అందిస్తున్నాయి. ఈ ప్రకృతి వనంలో వాకింగ్‌ ట్రాక్‌తో పాటు, ఆకర్షణీయమై కుర్చీలను సైతం ఏర్పాటు చేశారు. యువతీ, యువకులతో పాటు చిన్నారులు ఈ వనంలో ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేస్తూ ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పొందుతున్నారు. ఇటీవల పలె ్లప్రకృతి వనాన్ని సందర్శించిన షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ వనం ఎంతో చూడముచ్చటగా ఉందని సర్పంచ్‌ అజయ్‌మిట్టునాయక్‌ను ప్రత్యేకంగా  అభినందించారు. ఇన్ముల్‌నర్వ పల్లె ప్రకృతివనం ఆదర్శంగా నిలువడంలో సందేహం లేదన్న రీతిలో తీర్చిదిద్దుతున్నారు. 

పది శాతం భూమిలో...

ఇన్ముల్‌నర్వ గ్రామశివారులో ఓరియల్‌వెంచర్‌ వదిలిన 10శాతం భూమి (ఎకరాస్థలం)లో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. సంవత్సరం క్రితం ప్రభుత్వ నర్సరీల నుంచి తెచ్చిన 18రకాల పండ్లు, పూల మొక్కలను నాటారు. వన సేవకులు ఈ వనాన్ని తీర్చిదిద్దుతున్నారు.

రూ. 8.5 లక్షలతో ప్రకృతివనం ఏర్పాటు

 ఉపాధి హామీ పథకం ద్వారా పల్లె ప్రకృతివనాన్ని పెంచుతున్నారు. ఈ పథకం కింద 6లక్షల రుపాయల ఖర్చు కాగా, అదనంగా 2.50లక్షల గ్రామపంచాయతీ నిధులు వెచ్చించి వాకింగ్‌ ట్రాక్‌తో పాటు ఇక్కడికి వచ్చినవారు కూర్చోడానికి కుర్చీలు ఏర్పాటు చేశారు. 

గ్రామస్థులకు ఎంతో ఉపయోగకరం

పల్లె ప్రకృతి వనానికి వచ్చేవారికి వాకింగ్‌ట్రాక్‌తో పాటు ఆకర్షణీయంగా కుర్చీలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. యువతీ, యువకులు వాకింగ్‌ చేస్తూ, సేదతీరుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండ్లు, పూలమొక్కల సంరక్షణకు వన సేవకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. జిల్లాలోనే ఉత్తమ ప్రకృతి వనంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.

- అజయ్‌మిట్టునాయక్‌, సర్పంచ్‌, ఇన్ముల్‌నర్వ

ప్రకృతివనాలను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు

మండల పరిధిలోని 12 గ్రామపంచాయతీల్లో ఉపాధి పథకం కింద పల్లె ప్రకృతి వనాలు తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధి హామీ అధికారులతో కలిసి ప్రకృతి వనాలను పరిశీలిస్తూ సర్పంచులతో పాటు వన సేవకులకు ప్రత్యేక సూచనలు  చేస్తున్నాం. అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఆకర్షణీయంగా  తీర్చిదిద్దాం.  

- జనుంపల్లి జ్యోతి, ఎంపీడీవో, కొత్తూర్‌

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST