మానవత్వం చాటుతున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-05-10T05:34:31+05:30 IST

కరోనా కష్టకాలంలో పోలీసులు మానవత్వాన్ని చాటుతున్నారు. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో బాధితుల ప్రాణాలను కాపాడే ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మానవత్వం చాటుతున్న పోలీసులు

సిద్దిపేట అర్బన్‌, మే 9: కరోనా కష్టకాలంలో పోలీసులు మానవత్వాన్ని చాటుతున్నారు. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో బాధితుల ప్రాణాలను కాపాడే ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకపక్క ఒత్తిడితో కూడాన ఉద్యోగ బాధ్యతలు, మరోపక్క కరోనా ఒత్తిళ్లు సతమతం చేస్తున్నా ఇతరులకు చేయూతనివ్వడంలో ముందుంటున్నారు సిద్దిపేట పోలీసులు. ఆపదలో ఉన్నవారికి ఎక్కడికైనా వెళ్లి రక్తం, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ ఇస్తున్నారు. విధి నిర్వహణలో బిజీగాఉన్నా అవసరమైనప్పుడు అధికారుల అనుమతితో రక్తదానం చేస్తున్నారు. రాయపోల్‌ పోలీ్‌సస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న దాసరి శేఖర్‌ ఇందులో ముందువరుసలో ఉన్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి స్వయంగా రక్తదానం చేయడంతోపాటు తోటి సిబ్బంది, మిత్రులను సమన్వయంచేస్తూ ఎంతోమందికి సహాయం అందేలా చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఆయన చేస్తున్న మంచిపనికి కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ కూడా స్వయంగా అభినందించారు. సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాస్మా, రక్తం అవసరమైతే స్థానికులు, అధికారులు శేఖర్‌కు ఫోన్‌చేసి సంప్రదిస్తుంటారు. ఆయన వెంటనే బాధితులకు రక్తం అందజేసే ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రాదారి శ్రీనివాస్‌, ఏఆర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జగదీశ్‌, రజాఉల్లా, ఐటీసెల్‌లో పనిచేసే రమేష్‌.. ఇలా పలువురు కానిస్టేబుళ్లు అనేకసార్లు రక్తదానం చేశారు. తమ స్నేహితులను కూడా ప్రోత్సహిస్తూ రక్తదానం చేయిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఒక యూనిట్‌ రక్తం దొరకడమే ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో పోలీసులు చూపుతున్న చొరవను ప్రజలు కొనియాడుతున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడమేకాకుండా ప్రాణాలను రక్షించడంలో ముందుంటున్నారని అభినందిస్తున్నారు.


రక్తదానంతో ప్రాణాలు నిలుస్తాయి : రాదారి శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌, సిద్దిపేట

ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి రక్తదానం చేయడంతో ప్రాణాలు నిలుస్తాయి. సిద్దిపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో బ్లూకోట్స్‌ విధులు నిర్వహిస్తూ అవసరమైనప్పుడు రక్తదానం చేస్తున్నాను. స్నేహితులను కూడా ప్రోత్సహిస్తూ అవసరమైనప్పుడు రక్తదానం చేసేలా చూస్తున్నాను. బాధితులకు సహాయం చేయడం సంతృప్తినిస్తున్నది. ఇప్పటివరకు 12సార్లు రక్తదానం, ఒకసారి ప్లేట్లెట్స్‌ ఇచ్చాను. ఇకపై కూడా అవసరమైతే రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అధికారులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. 


ఏ సమయంలోనైనా స్పందిస్తున్నాం : దాసరి శేఖర్‌, కానిస్టేబుల్‌, రాయపోల్‌

బాధితులకు రక్తం అవసరం ఉందిని తెలిస్తే ఏ సమయంలోనైనా స్పందిస్తున్నాం. స్వయంగా రక్తదానం చేయడంతో పాటు తోటి ఉద్యోగులు, మిత్రులకు సమాచారం అందిస్తూ అవసరమైనచోటికే వెళ్లి రక్తదానం చేయడానికి సమన్వయం చేస్తున్నా. సహచర కానిస్టేబుళ్లు, మిత్రులు కూడా రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. పోలీసులు, డిపార్ట్‌మెంట్‌కు ఇది మంచిపేరు తెస్తున్నది. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం సంతృప్తినిస్తున్నది. అపోహలనువీడి యువత రక్తదానం చేసేందుకు ముందుకురావాలి

Updated Date - 2021-05-10T05:34:31+05:30 IST