పేదల ఇళ్లకు బీటలు

ABN , First Publish Date - 2021-03-02T05:58:40+05:30 IST

కడియపులంకలోని దోసాలమ్మ కాలనీలో ప్రభుత్వ పనుల పేరిట కొందరు చేసిన చర్యలకు ఇద్దరి పేదల ఇళ్లకు బీటలు వారి ప్రమాదంలో పడ్డాయి.

పేదల ఇళ్లకు బీటలు
కడియపులంక దోసాలమ్మ కాలనీలో ఇళ్లను ఆనుకుని తీసిన గోతులు

  • రైతు భరోసా కేంద్రం నిర్మాణం  పేరిట మట్టి తరలింపు
  • కాంట్రాక్టర్‌ నిర్వాకంతో రెండిళ్లకు ముప్పు
  • తమను ఆదుకోవాలంటున్న బాధితులు

కడియం, మార్చి 1: కడియపులంకలోని దోసాలమ్మ కాలనీలో ప్రభుత్వ పనుల పేరిట కొందరు చేసిన చర్యలకు ఇద్దరి పేదల ఇళ్లకు బీటలు వారి ప్రమాదంలో పడ్డాయి. ఇళ్లను ఆనుకుని పెద్దఎత్తున గోతులు తీసి మట్టిని తరలించుకుపోవడంతో రెండు ఇళ్లు ప్రమాద పరిస్థితికి చేరాయి. దీనిపై స్థానికులు ఎలుగంటి మాణిక్యం, చెల్లూరి రమేష్‌, చెల్లూరి భవానీ, ఆలమూరు శ్రీను, రేలంగి వెంకటలక్ష్మి తదితరులు అక్కడి సమస్యను వివరించారు. బాధితులు ఎలుగింటి మాణిక్యం, చెల్లూరి రమేష్‌ కుటుంబాలు వారు మాట్లాడుతూ తమ ఇళ్లకు ఆనుకుని గోతులు తీయడంతో ఇళ్లు బీటలు తీసి పాడయ్యాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండూ రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు. ప్రభుత్వానికి చెందిన కేంద్రాన్ని నిర్మిస్తామంటూ పనులు చేపట్టారని, ఇళ్లను ఆనుకుని పెద్దఎత్తున గోతులు పెట్టి మట్టిని తీసుకుపోయారు. నెలలు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టకుండా వదిలేయడంతో ఇళ్లకు బీటలు తీసాయని వాపోయారు. పంచాయతీ అధికారులు తక్షణం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 

ఈ విషయంపై గ్రామ కార్యదర్శి బి.శిరీష మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రం నిర్మాణానికి పనులు ప్రారంభించిన కాంట్రాక్టరు మధ్యలో నిలిపివేశారన్నారు. మట్టిని తవ్వి పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో మెరక వేశారు. వేరే కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. త్వరలో పనులు ప్రారంభిస్తారని ఆమె చెప్పారు.

  • తహశీల్దారుకు ఫిర్యాదు 

కాగా బాధితులు ఎలుగంటి మాణిక్యం వెంకటలక్ష్మి, చెల్లూరి రమేష్‌ సోమవారం తహశీల్దారు జి.భీమారావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అంద జేశారు. తాము ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకున్నామని, రెండు నెలల క్రితం రైతుభరోసా కేంద్రం నిర్మాణం పేరిట తమ ఇళ్ళును ఆనుకుని గోతులు తీసి మట్టిని విక్రయించుకున్నారన్నారు. ప్రస్తుతం ఆ గోతుల వల్ల తమ ఇళ్లకు బీటలు వస్తున్నాయన్నారు. సదరు కాంట్రాక్టర్‌ మట్టిని ట్రాక్టర్‌ రూ.2 వేలకు విక్రయించుకున్నారని అంతే కాకుండా తాము ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. 


Updated Date - 2021-03-02T05:58:40+05:30 IST