Advertisement

ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీ

Nov 29 2020 @ 23:08PM


ఓపీ వారం రోజులకే వర్తింపు..

అత్యవసరమైతే టోకెన్‌ ధర డబుల్‌

టెస్టుల పేరిట అధిక మొత్తంలో వసూళ్లు

రోగులపై అదనపు భారం

పట్టించుకోని వైద్యఆరోగ్యశాఖ

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి) 

- శ్రీకాకుళం నగరంలోని బలగ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఒళ్లంతా మంటగా ఉందని స్థానిక డేఅండ్‌నైట్‌ జంక్షన్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లాడు. రూ.300 చెల్లించి ఓపీ తీసుకున్నాడు. వైద్యుడు ముఖానికి మాస్క్‌, ఆపై ఫేష్‌ షీల్డ్‌ వేసుకుని.. కనీసం ఆ వ్యక్తి రోగ లక్షణాలను పరిశీలించలేదు. మాటల ద్వారానే ఆయన అనారోగ్య సమస్య తెలుసుకుని.. మందులు రాసిచ్చేశారు. మందులు వాడినా.. వ్యాధి తగ్గకపోవడంతో వారం రోజుల తర్వాత మళ్లీ అదే వైద్యుడి వద్దకు వెళ్లగా.. మళ్లీ ఓపీ తీసుకోవాలని సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యాడు. మొన్ననే ఓపీ తీసుకున్నాను కదా అని వాదించగా.. ఓపీ వారం రోజుల వరకే వర్తిస్తుందని సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక ఓపీ కోసం మళ్లీ రూ.300 చెల్లించాడు.  

- నరసన్నపేట మండలం దేవాది ప్రాంతానికి చెందిన ఓ చిన్నారిని.. శ్రీకాకుళంలోని  డేఅండ్‌నైట్‌ జంక్షన్‌లోని చిన్నపిల్లల ఆస్పత్రికి సాయంత్రం 6 గంటల సమయంలో కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఓపీ జనరల్‌ టోకెన్‌లు(రూ.250) అయిపోయాయని..  ఎమర్జెన్సీ కింద అయితే రూ.500 చెల్లించాలని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేది లేక.. ఓపీ కోసం రూ.500 చెల్లించి ఆ వైద్యునికి చిన్నారిని చూపించి ఆరోగ్య సమస్య వివరించారు. 

వైద్యోనారాయణో హరి.. అంటారు పెద్దలు. కానీ కొంతమంది ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల వైద్యులు అత్యాశకు పోయి వైద్య వృత్తికి మచ్చ తెస్తున్నారు. కరోనాను బూచిగా చూపి.. ఓపీ ధరలను రెట్టింపు చేసేశారు. ఓపీ కాల పరిమితిని కూడా వారం రోజులకు కుదించేయడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్యులు, సాధారణంగా చూసేందుకు ఒక ధర, అత్యవసర సేవకు ఇంకో ధరను నిర్ధారిస్తున్నారు. దీనికితోడు ప్రతి అనారోగ్య సమస్యకూ టెస్ట్‌ల పేరిట అధిక మొత్తంలో దోచేస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


జిల్లాలో ఇదీ పరిస్థితి 

జిల్లావ్యాప్తంగా సుమారు 315  ప్రైవేట్‌ ఆసుపత్రిలు ఉన్నాయి. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పాలకొండ, రాజాం పట్టణాల్లో ప్రైవేటు ఆస్పత్రులు అధికంగా ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రోజుకు సుమారు 100 నుంచి 150 మంది అనారోగ్య సమస్యతో వెళ్తుంటారు. చాలా ఆస్పత్రులు ఓపీ నిమిత్తం రూ.300 నుంచి రూ.500 వరకు వసూళ్లు చేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులుకు ఒక్కరోజుకు కేవలం ఓపీ చార్జీల రూపంలోనే రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. దీంతో పాటు మందులు, ఇంజక్షన్లు, టెస్టుల పేరిట అదనపు ఆదాయం సమకూరుతోంది. రోగులకు తడిసి మోపెడవుతోంది. గతంలో ఓపీ కాలపరిమితి రెండు వారాలుండగా.. కరోనా సాకుతో  కొన్ని ఆస్పత్రుల్లో వారం, మరికొన్ని ఆస్పత్రుల్లో పది రోజులకు కుదించేశారు. గతంలో రూ.200 ఉన్న ఓపీ కార్డు ధరను ప్రస్తుతం రూ.300, రూ.450, రూ.500 ఇలా పెంచేశారు. ఓపీ కోసం అధిక మొత్తం చెల్లించినా ఆస్పత్రి వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రోగులు పేర్కొంటున్నారు. కరోనా భయంతో కొంతమంది వైద్యులు కనీసం నాడి కూడా చూడకుండానే మందులు రాసిచ్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ మందులతో వ్యాధి నయం కాకపోతే మళ్లీ వారం తర్వాత వెళితే.. మరో ఓపీ తీసుకోవాలని చెబుతున్నారని వాపోతున్నారు. కరోనా వేళ ఉపాధి లేక.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమపై మరింత అదనపు భారం పడుతోందని రోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సక్రమంగా సేవలు అందకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నామని చెబుతున్నారు. 


తనిఖీలు ఏవీ....

జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు దశాబ్ద కాలంగా ప్రైవేటు ఆస్పత్రులో దోపిడీపై తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. వాస్తవానికి ప్రైవేటు ఆసుపత్రిల్లో ఓపీ ధర నుంచి ఏ చికిత్సకు ఎంత వసూలు చేస్తున్నారనే విషయాన్ని ఆసుపత్రి వద్ద బహిరంగంగా బోర్డుల్లో ప్రదర్శించాలి. కానీ జిల్లాలో చాలా ఆసుపత్రుల్లో ఈ నిబంధనలు పాటించడం లేదు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు అధిక మొత్తం వసూళ్లు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేటు దోపిడీ నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.  


వివరాలు  వెల్లడించాల్సిందే 

నిబంధనల ప్రకారం ఏ ఆసుపత్రిల్లో అయినా అక్కడ అందుతున్న సేవలు.. వాటికి తీసుకోనున్న ధరల వివరాలను బోర్డుల్లో వెల్లడించాల్సిందే. ఎక్కువ ధరలు వసూలుచేయకూడదు. నిబంధనలు అతిక్రమించినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 

డా.చంద్రానాయక్‌, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిFollow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.