ర్యాంపుల వద్ద ప్రైవేటు దళం!

ABN , First Publish Date - 2021-06-09T05:10:22+05:30 IST

జిల్లాలో ఇసుక ర్యాంపుల వద్ద ప్రైవేటు వ్యక్తుల హవా కొనసాగుతుందా? టెండరు దక్కించుకున్న సంస్థకు చెందిన మనుషులమంటూ రాయలసీమకు చెందిన వ్యక్తులు హల్‌చల్‌ చేస్తున్నారా? యంత్రాలతో పనులు చేసి... స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారా? నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ధర పెంచి విక్రయిస్తున్నారా? ఈ విషయంలో అధికార పార్టీ చోటా నాయకులకు కూడా చుక్కెదురవుతుందా?...అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ర్యాంపుల వద్ద ప్రైవేటు దళం!
మడపాం ఇసుక రీచ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది


సంస్థ మనుషులమంటూ హుకుం

స్థానికులను దరిచేరనివ్వని వైనం

ఇసుక ధర పెంచి విక్రయాలు

తరచూ వివాదాలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఇసుక ర్యాంపుల వద్ద ప్రైవేటు వ్యక్తుల హవా కొనసాగుతుందా? టెండరు దక్కించుకున్న సంస్థకు చెందిన మనుషులమంటూ రాయలసీమకు చెందిన వ్యక్తులు హల్‌చల్‌  చేస్తున్నారా? యంత్రాలతో పనులు చేసి... స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారా? నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ధర పెంచి విక్రయిస్తున్నారా? ఈ విషయంలో అధికార పార్టీ చోటా నాయకులకు కూడా చుక్కెదురవుతుందా?...అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత రెండు రోజులుగా ఇసుక ర్యాంపుల వద్ద రగడ చోటుచేసుకుంటోంది. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ వరకూ పంచాయితీ నడిచిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇటీవల నూతన ఇసుక విధానాన్ని ప్రారంభించింది. ఇసుక రవాణా బాధ్యతలను జేపీ పవర్‌ అనే సంస్థకు టెండరు ద్వారా అప్పగించింది. జిల్లాలో వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాల్లోని 29 ఇసుక రీచ్‌లను కేటాయించింది. ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఇసుక సరఫరా సులభతరం చేయడంతో పాటు తక్కువ ధరకు విక్రయించవచ్చన్నది ప్రభుత్వ వాదన. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ర్యాంపుల వద్ద ఇసుక ఎక్కువ ధరకు అమ్ముతున్నారని... అసలు రీచ్‌ల వద్దరకు రానివ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.   


గతం కంటే పెరిగిన ధర

వాస్తవానికి టన్ను ధరను రూ.475గా నిర్ణయించారు. గతంలో ట్రాక్టరుకు నాలుగు టన్నులు లోడ్‌చేస్తే రూ.1900 వసూలు చేసేవారు. ఇప్పుడు టెండరు దక్కించుకున్న సంస్థ మడపాం, పోతయ్యవలస ర్యాంపుల వద్ద ట్రాక్టరు ఇసుకకు రూ.2,040 వసూలు చేస్తోందని ట్రాక్టరు యజమానులు చెబుతున్నారు.. అంతేకాకుండా స్థానిక ట్రాక్టర్‌ యజమానులకు ఇసుక లోడులు ఇచ్చేందుకు ఏజెన్సీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పోతయ్యవలస ర్యాంపు నుంచి లారీల్లో ఇసుకను విజయనగరం జిల్లాకు తరలిస్తున్నారు. ఇటీవల దూసి ర్యాంపులో కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. స్థానికులు ఆందోళన చేపట్టారు. జిల్లాలో 29 ర్యాంపుల నుంచి ఇసుక ఎక్కడికైనా రవాణా చేసుకొనే అనుమతులు ఇవ్వడంతో స్థానికంగా కాదని ఇతర ప్రాంతాలకు తరలించడానికే  ప్రాధాన్యమిస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


రాయలసీమ వ్యక్తుల హల్‌చల్‌

ర్యాంపుల వద్ద ప్రైవేటు వ్యక్తుల హడావుడి ఎక్కువైంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. సంబంధిత సంస్థ మనుషులమంటూ చెప్పుకొస్తున్నారు. వారే పహారా కాస్తూ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇసుక రవాణాలో కూడా వారిదే కీలక పాత్ర. ర్యాంపు పరిసర గ్రామాలకు చెందిన కార్మికులకు పని కల్పించడం లేదు. అంతా యంత్రాలతోనే పనులు చేయిస్తున్నారు. దీంతో పరిసర గ్రామాల వారు, స్థానికులు ర్యాంపుల వద్ద ఆందోళనకు దిగుతుండడంతో తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ట్రాక్టరు యజమానుల్లో కొందరు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఇటువంటి వారిని సైతం ర్యాంపుల వద్దకు రానీయకపోవడంతో వారికి మింగుడుపడడం లేదు. స్థానికంగా ఇసుక దొరకక..ఒకవేళ దొరికినా అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ వద్దకు పంచాయీతీ చేరింది. అయినా బాధితులకు ఎటువంటి భరోసా లభించలేదని తెలిసింది. ప్రభుత్వ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని ఆయన చెప్పడంతో స్థానికులు నిరాశతో వెనుదిరిగినట్లు సమాచారం.  


పోలీసుల పరిశీలన

 పోతయ్యవలస, మడపాం ఇసుక ర్యాంపులను మంగళవారం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించారు. ట్రాక్టరు యజమానులకు, టెండరు దక్కించుకున్న సంస్థకు మధ్య గత రెండు రోజులుగా వివాదం చోటుచేసుకుంది. ట్రాక్టరు యజమానులు ఆందోళనకు దిగడంతో పంచాయితీ నరసన్నపేట పోలీసుల వరకూ చేరింది. దీంతో ఎస్‌ఐ సత్యనారాయణ, ట్రైనీ ఎస్‌ఐ ప్రమీలారాణి ర్యాంపును పరిశీలించారు. ఒకే పాయింట్‌ వద్ద లారీలకు, ట్రాక్టర్లకు ఇసుక లోడింగ్‌ చేస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించారు. వేర్వేరుగా పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి చిన్నారావు, వీఆర్వో అప్పలనాయుడు, జేపీ పవర్స్‌ కంపెనీ ప్రతనిధి విశ్వనాథరెడ్డి ఉన్నారు. 





Updated Date - 2021-06-09T05:10:22+05:30 IST