వీడిన విగ్రహాల మిస్టరీ.. మూఢనమ్మకంతో విగ్రహాలుంచిన పుత్తూరు సోదరులు

ABN , First Publish Date - 2020-09-23T17:01:25+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటుచేసిన మిస్టరీ వీడింది..

వీడిన విగ్రహాల మిస్టరీ.. మూఢనమ్మకంతో విగ్రహాలుంచిన పుత్తూరు సోదరులు

తిరుపతి(చిత్తూరు): శ్రీకాళహస్తీశ్వరాలయంలో అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటుచేసిన మిస్టరీ వీడింది. ఆలయంలోని కాశీలింగం, రామేశ్వరలింగం వద్ద రాతి శివలింగాన్ని, నంది విగ్రహాన్ని పెట్టిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో మంగళవారం మీడియాకు ఎస్పీ రమేష్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. పుత్తూరు హరిజనవాడకు చెందిన పిండి మునస్వామి కుమారులు శూలవర్థన్‌ (32), తిరుమలయ్య (30), శేఖర్‌ (28). వీరిలో తిరుమలయ్య, మునిశేఖర్‌ చెడు వ్యసనాలకు అలవాటైన కారణంగా వివాహం కాలేదు. అలాగే ముగ్గురూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


వాటినుంచి బయటపడేందుకు తరచూ జాతకాలు చెప్పించుకునేవారు. శ్రీకాళహస్తి ఆలయంలో విగ్రహాలు ఏర్పాటుచేసి పూజలుచేస్తే ఆర్థికంగా కలిసిరావడంతోపాటు వివాహాలు జరుగుతాయని ఏడు నెలలక్రితం ఓ స్వామీజీ చెప్పారు. దీంతో వారు తిరుపతి సమీపంలోని రాజీవ్‌ గృహకల్ప వద్దగల శిల్పి మురగేషన్‌ వద్ద రూ. 7వేలకు విగ్రహాలు తయారు చేయించుకున్నారు. ఈనెల 5వ తేదీన విగ్రహాలను ఇంటికి తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. 6వ తేదీన విగ్రహాలను తీసుకుని రెండు మోటారు సైకిళ్లపై శ్రీకాళహస్తికి వచ్చారు. ముక్కంటి ఆలయంలో వాటిని ఏర్పాటుచేసి వెళ్లిపోయారు. 



అయితే ఈ విషయం వివాదాస్పదం కావడంతో ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. ఆలయంలోను, బయట మొత్తం 100 ఫుటేజీలను పరిశీలించి అనుమానితులను గుర్తించినట్టు ఎస్పీ వెల్లడించారు. ముగ్గురు నిందితులు వచ్చిన ద్విచక్రవాహనాల నెంబర్లను బట్టి వారికోసం వెతికినట్టు వెల్లడించారు. ఐతే ద్విచక్రవాహనాలు వేరొకరినుంచి కొనుగోలు చేసినవి కావడంతో వారిని పట్టుకునేందుకు మొత్తం ఐదు పోలీసు బృందాలు తమిళనాడు, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో గాలించాయన్నారు.


వాహనాలు విక్రయించిన వారిని గుర్తించాక నిందితుల చిరునామాలు తెలుసుకున్నట్టు చెప్పారు. నిందితులకు సలహాఇచ్చిన స్వామీజీ కోసం కూడా గాలిస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. నిందితులకు ఆలయ సిబ్బంది నుంచి సహకారం లభించిందా అనే అంశాన్నికూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఆలయంలో భద్రతాపరమైన లోపాలను గుర్తించి అధికారులకు తెలియజేశామన్నారు. కేసును ఛేదించేందుకు కృషి చేసిన శ్రీకాళహస్తి ఇన్‌చార్జి డీఎస్పీ మురళీధర్‌, డీసీఆర్బీ సీఐ చిరంజీవి, వన్‌టౌన్‌ సీఐ నాగార్జునరెడ్డి, ఎస్‌ఐ సంజీవ్‌కుమార్‌, సిబ్బంది చంద్రశేఖర్‌, ప్రసాద్‌, కృష్ణయ్య, కేశవన్‌, బాబుల్‌రెడ్డి, వెంకటేశులు, శ్రీనివాసరావు, ఐటీ కోర్‌టీమ్‌ నాగార్జున, కుమార్‌, తదితర సిబ్బందికి రివార్డులు అందజేసి అభినం దించారు.  



Updated Date - 2020-09-23T17:01:25+05:30 IST