కేజీబీవీల్లో సీట్ల కోసం క్యూ

ABN , First Publish Date - 2022-05-27T05:59:19+05:30 IST

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో సీట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి.

కేజీబీవీల్లో సీట్ల కోసం క్యూ
కేజీబీవీ


ఒక్కోచోట 1:4, మరికొన్నిచోట్ల 

1:3 నిష్పత్తితో దరఖాస్తులు


అనంతపురం విద్య, మే 26: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో సీట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. కొన్ని కేజీబీవీల్లో ఒక్కో సీటుకు నలుగురు చొప్పున, మరికొన్ని చోట్ల ముగ్గురు, ఇద్దరు దరఖాస్తు చేసి పోటీ పడ్డారు. 2022-23 ఏడాదికి సంబంధించి కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు, 7,8 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 7వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్‌ విద్యార్థినుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు. ఆరోతరగతిలో సీట్ల కోసం 6348 దరఖాస్తులు వచ్చాయి.


కేజీబీవీల వారీగా...దరఖాస్తులు

6వ తరగతిలో ఖాళీ సీట్లకు పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న 62 కేజీబీవీల్లో ఒక్కో కేజీబీవీలో 40 సీట్లు చొప్పున భర్తీ చేస్తారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 6వ తరగతిలో 2480 సీట్లు ఖాళీ ఉన్నాయి. అత్యధికంగా అనంతపురం కేజీబీవీలో సీట్ల కోసం 155 దరఖాస్తులు, గుంతకల్లు కేజీబీవీలో సీట్ల కోసం 153 దరఖాస్తులు, ధర్మవరం, గుత్తి 151 దరఖాస్తులు, కుందుర్పి, రొద్దంలో 148, గార్లదిన్నె 138, ఉరవకొండ 132, శింగనమల 131, కదిరి 121, బ్రహ్మసముద్రం 124, కదిరి, బొమ్మనహాళ్‌ 121, తాడిపత్రి 119, కనగానపల్లి 118, చిలమత్తూరు 115 , పుట్టపర్తి 113, రాయదుర్గం 119, గుమ్మఘట్ట 118, రొళ్ల 111, కంబదూరు 106, రామగిరి, రాయదుర్గం 105, సోమందేపల్లి 104,  హిందూపురం 102, బుక్కపట్నం, వజ్రకరూరు, 101, విడపనకల్లు, యాడికి, కణేకల్లు 100 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇక మిగిలిన చోట్ల దరఖాస్తులు వంద కూడా దాటలేదు. అమడగూరులో అత్యల్పంగా 46మాత్రమే దరఖాస్తులు వచ్చాయి.  


 కేజీబీవీల్లో 7వ, 8వ తరగతిలో మిగిలిపోయిన సీట్లకు సైతం దరఖాస్తులు కోరారు. 7లో 89 సీట్లు, 8వ తరగతిలో 104 సీట్లు ఖాళీలున్నాయి. ఈ రెండు తరగతుల్లో 193 సీట్లు ఉండగా.. వాటిలో అడ్మిషన్ల కోసం 2719 దరఖాస్తులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారులు సీట్ల కేటాయింపుపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Updated Date - 2022-05-27T05:59:19+05:30 IST