ప్రతీ అడుగు ప్రజల కోసమే..

ABN , First Publish Date - 2022-06-28T05:12:26+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రతీ అడుగు రైతుల కోసమే వేశారని, ప్రతీ నిమిషం వారి సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నారని ఆర్థిక, వెద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. గజ్వేల్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన రేక్‌ పాయింట్‌ను సోమవారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో ప్రారంభించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్సులో 557 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద మంజూరైన రూ. 5.56 కోట్ల విలువైన చెక్కులను, 108 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ. 82.60 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.

ప్రతీ అడుగు ప్రజల కోసమే..
గజ్వేల్‌ రైల్వేస్టేషన్‌లో గూడ్సు రైలుకు ఆహ్వానం పలుకుతున్న మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి తదితరులు

అన్నదాతల శ్రేయస్సు కోసమే ప్రతీ నిమిషం సీఎం కేసీఆర్‌ తపన

రేక్‌ పాయింట్‌తో ఎరువులు, సరుకుల సులభ రవాణా

ముహుర్తాలు చూసి సిజేరియన్లు చేయించడం తగదు

ప్రతీ శిశువుకు ముర్రుపాలు పట్టించాలి

గజ్వేల్‌లో పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌, డయాలసిస్‌ సెంటర్‌

మూడు నెలల్లో మాతాశిశు ఆసుపత్రి పూర్తి

ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

తెలంగాణ రాకతోనే పేదల అభివృద్ధి

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి


గజ్వేల్‌, జూన్‌ 27: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రతీ అడుగు రైతుల కోసమే వేశారని, ప్రతీ నిమిషం వారి సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నారని ఆర్థిక, వెద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. గజ్వేల్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన రేక్‌ పాయింట్‌ను సోమవారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో ప్రారంభించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్సులో 557 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద మంజూరైన రూ. 5.56 కోట్ల విలువైన చెక్కులను, 108 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ. 82.60 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం గజ్వేల్‌ నియోజకవర్గంలో 104 గ్రామపంచాయతీలకు భవనాల నిర్మాణం కోసం రూ.25 లక్షల చొప్పున విడుదల చేస్తూ ప్రొసీడింగ్‌ కాపీలను సర్పంచ్‌లకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ రేక్‌ పాయింట్‌ కోసం గతంలో మంత్రులు, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నవారు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్‌లో రేక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీంతో జిల్లా ప్రజలకు ఎరువులు, సరుకులు సులభంగా దొరకుతాయని చెప్పారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు 9వేల మంది ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశామని తెలియజేశారు. పెళ్లి చేసి చూడు.. ఇళ్లు కట్టి చూడు.. అని సామెత ఉందని.. కానీ తమ ప్రభుత్వం పేదింట్లో పెళ్లికి సాయం అందజేస్తున్నదని స్పష్టం చేశారు. ప్రతీ పేదింటి ఆడపడుచు వివాహానికి సీఎం కేసీఆర్‌ మేనమామలా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. పెళ్లైన అనంతరం మొదటి కాన్పు తల్లిగారు చేయించే సంప్రదాయాన్ని గౌరవిస్తూ కేసీఆర్‌ కిట్‌ను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12వేలు కానుక అందజేస్తున్నారని తెలియజేశారు. ముహుర్తాలు చూసి సిజేరియన్‌ ఆపరేషన్లు చేయించే సంస్కృతిని వీడనాడాలని పిలుపునిచ్చారు. సిజేరియన్లతో 35 ఏళ్లకే మహిళలు నీళ్ల బిందె కూడా మోయలేని స్థితికి చేరుకుంటున్నారని వాపోయారు. పుట్టిన శిశువుకు మొదటి గంటలోనే ముర్రుపాలు పట్టిస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందని, కానీ రాష్ట్రంలో కేవలం 34 శాతం మంది శిశువులకు మాత్రమే మొదటి గంటలో ముర్రుపాలు అందుతున్నాయని వెల్లడించారు. దీంతో శిశువులు అనేక వ్యాధులకు గురవుతున్నారని, వారిలో ఎదుగుదల లోపిస్తుందని పేర్కొన్నారు. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడకుండా గజ్వేల్‌ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఐదుబెడ్‌లతో పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలియజేశారు. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఇంటి వద్దనే చికిత్సను అందించడానికి ‘ఆలన’ వాహనాన్ని ఏర్పాటు చేశామని, ఇందులో ఇంటి దగ్గరకే వైద్యులు వచ్చి చికిత్సను అందజేస్తారని స్పష్టం చేశారు. కిడ్నీ సంబంధ వ్యాధిగ్రస్తులు గతంలో డయాలసిస్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్లిల్సి వచ్చేదని, ప్రస్తుతం గజ్వేల్‌ ఆసుపత్రిలోనే డయాలసిస్‌ సౌకర్యం అందజేస్తున్నామని వెల్లడించారు. మూడునెలల్లో మాతాశిశు ఆసుపత్రిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. 


తెలంగాణ రావడంతోనే పేదల అభివృద్ధి : మంత్రి నిరంజన్‌రెడ్డి

తెలంగాణ రావడంతోనే పేదల అభివృద్ధి, గజ్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రేక్‌ పాయింట్‌ రాకతో ఎరువులతో పాటు బియ్యం, కాటన్‌బెల్స్‌, సిమెంట్‌, ఇతర నిత్యావసర వస్తువులను ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు సొంత గ్రామాలకు కూడా రోడ్లు వేసుకోలేదని, కేసీఆర్‌ మాత్రం గజ్వేల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారుఖ్‌హుస్సేన్‌, యాదవరెడ్డి మాట్లాడుతూ గజ్వేల్‌లో రైలు చూస్తామని కలలో కూడా అనుకోలేదని, రైలును తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఎఫ్‌ఢీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, జడ్పీ చైర్మన్‌ రోజాశర్మ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌ మాట్లాడారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌భూషణ్‌పాటిల్‌, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌రావు, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్‌, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, ఎంపీపీలు అమరావతి, బాలేషంగౌడ్‌, జడ్పీటీసీలు పంగ మల్లేశం, వంటేరు సుధాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవి రవిందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌గౌడ్‌, ఇంద్రసేనారెడ్డి, వైస్‌ చైర్మన్లు జకీ, ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు చంద్రమోహన్‌రెడ్డి, మల్లంరాజు, శ్రీనివా్‌సరెడ్డి, బాపురెడ్డి, యాదిరెడ్డి, రాజు, వైస్‌ ఎంపీపీ కృష్ణాగౌడ్‌, ఆత్మచైర్మన్లు రంగారెడ్డి, చిన్నమల్లయ్య, నాయకులు పండరి, రవీందర్‌రావు, దయాకర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ఏడీలు బాబునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:12:26+05:30 IST