ఇంటింటికీ ఇవ్వలేం

ABN , First Publish Date - 2022-05-17T06:52:24+05:30 IST

ఇంటింటికీ వాహనం ద్వారా రేషన్‌ స రుకులు అందించే ఎండీయూ ఆపరేటర్లకు నిర్వహణ భారం అధికమై.. సకాలంలో వేతనాలు అందక.. బ్యాంకుల ఈఎం ఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇంటింటికీ ఇవ్వలేం

  • సకాలంలో రాని వేతనాలు
  • నెలనెలా ఈఎంఐలు కట్టలేని దుస్థితి
  • కార్పొరేషన్‌ నుంచి కడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు వాళ్లే కట్టుకోవాలని నిబంధన
  • ఎండీయూ ఆపరేటర్ల కష్టాలు
  • మాట తప్పి బీమా సొమ్ము కట్‌
  • నిర్వహణ భారమై ఆందోళనబాట
  • 1నుంచి నిలిచిపోనున్న రేషన్‌ పంపిణీ

పిఠాపురం, మే 16: ఇంటింటికీ వాహనం ద్వారా రేషన్‌ స రుకులు అందించే ఎండీయూ ఆపరేటర్లకు నిర్వహణ  భారం అధికమై.. సకాలంలో వేతనాలు అందక.. బ్యాంకుల ఈఎం ఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. బీమా మొత్తాన్ని ప్ర భుత్వమే చెల్లిస్తుందని చెప్పినా సొమ్ములు ఆపరేటర్ల బ్యాంకు ఖాతాలు నుంచి కట్‌ కావడం, డీజిల్‌ ధర పెరుగుదలతో కనీస ఖర్చులు మిగలని పరిస్థితుల్లో అందోళనకు సిద్ధమవుతున్నా రు. వచ్చే నెల 1 నుంచి తమ విధులను పూర్తిస్థాయిలో నిర్వహించలేమని అధికారులకు నోటీసులు అందజేశారు.

ఇంటింటికీ రేషన్‌ సరుకులు అందజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జనవరినుంచి వాహనాలు సమకూర్చి ఎండీయూ ఆపరేటర్లను ఎంపిక చేసింది. ఒక్కొక్క వాహనాన్ని రూ.5,81,190 వ్యయంతో కొనుగోలు చేశారు. ఇందులో పది శాతాన్ని ఎండీయూ ఆపరేటర్‌గా ఎంపికైన వ్యక్తి భరించాల్సి ఉంది. 60శాతాన్ని ప్రభుత్వం చెల్లించేలా, మిగిలిన 30శాతాన్ని లబ్ధిదారులు ప్రతి నెలా ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంది. ఇందు నిమిత్తం ప్రతినెలా రూ.3వేలను ఎండీయూ ఆపరేటర్‌ రుణ వాయిదాగా చెల్లిస్తుండగా రూ.5879లను ఆయా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆపరేటర్‌కు ప్రతినెలా రూ.16వేలు వేతనంగా చెల్లిస్తామని, ఇందులో రూ.10వేలు వాహన అద్దెగా, రూ.3వేలు హెల్పర్‌కు, మరో రూ.3వేలు డీజిల్‌కు చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆపరేటర్ల ఆందోళనతో రూ.16వేలకు అదనంగా రూ.5వేలు పెంచి రూ.21వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1074 రేషన్‌ వాహనాలు ఉండగా, కాకినాడ జిల్లాలో 390 వాహనాలు ఉన్నాయి.

బ్యాంకు ఖాతాల నుంచి కట్‌ 

కొంతకాలంపాటు ప్రతినెలా అదే నెలలో చివరి మూడు రోజుల్లో నెలవారీ చెల్లించే సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో పడేవి. తదనంతరం దీన్ని మరుసటి నెల 10-12వ తేదీల్లో చెల్లించే విధంగా మార్పు చేశారు. ఇప్పుడు రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేదు. దీంతో ఆపరేటర్లు నెలవారీ ఈఎంఐ చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కార్పొరేషన్‌ల ద్వారా చెల్లించాల్సిన నెలవారీ రుణవాయిదాలను కొంతకాలంగా సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంకులు అపరాధ రుసుములు విధిస్తున్నాయి. ఇవన్నీ లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలనుంచి కట్‌ కావడంతో వారు షాక్‌కు గురవుతున్నారు. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలను రుణానికి అనుసంధానించడంతో ఆలస్యపు చార్జీలు సహా అన్ని రకాల రుసుములు తమ ఖాతా నుంచే తీసుకుంటున్నారని, దీంతో తమ ఖాతానుంచి తాము రూపాయి తీసుకునే పరిస్థితి ఉండడం లేదని ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డీజిల్‌ ధర గత 18నెలల వ్యవధిలో గణనీయంగా పెరగడంతో తమపై మరింత అదనపు భారం పడిందని వారు చెబుతున్నారు. వీటితోపాటు వాహనానికి ఆరేళ్లపాటు బీమాను పౌరసరఫరాలశాఖ భరిస్తుందని ఆపరేటర్లతో ఒప్పంద సమయంలో ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఆపరేటర్లే చెల్లించాలని చెబుతుండడంతో ఒక్క రూపాయి కూడా మిగలకపోగా ఇంటి నుంచి సొమ్ములు తెచ్చి పెట్టే పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. కొవిడ్‌తోపాటు ఒత్తిళ్లకు లోనై జిల్లాలో 8మంది ఆపరేటర్లు చనిపోయారు. వీరిని ఆదుకోవడంతోపాటు ప్రతి నెలా సక్రమంగా వేతనాలు చెల్లించాలని, పాత బకాయిలు తక్షణం విడుదల చేయాలని, బీమా సొమ్మును ప్రభుత్వమే భరించాలని, బ్యాంకు ఈఎంఐలను కార్పొరేషన్ల నుంచి సకాలంలో చెల్లించాలని ఎండీయూ ఆపరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఆరునెలలుగా తమ సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఈనెల 1 నుంచి విధులకు దూరంగా ఉండాలని వీరు ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులకు నోటీసులు అందజేస్తున్నారు. వీరు ఆందోళనకు దిగితే ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీ నిలిచిపోయే అవకాశం ఉంది.

సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం

న్యాయమైన మా డిమాండ్లు, సమస్యలను పరిష్కరించాలని మేం కోరుతున్నాం. సకాలంలో వేతనాలు రాక ఈఎంఐలు చెల్లించలేకపోతున్నాం. బీమా భారం మాపై వేయడం తగదు. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని మాకు ఇచ్చే మొత్తాలను పెంచాలి. మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కానీ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనబాట పడుతున్నాం.

-సిద్దాంతపు రవికుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమైఖ్య ఎండీయూ ఆపరేటర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు

Updated Date - 2022-05-17T06:52:24+05:30 IST