రేషన్‌ బియ్యం.. ఇక కిలో రూపాయి

ABN , First Publish Date - 2020-11-29T05:46:52+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సర్కారు రేషన్‌ కార్డుదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఒక్కో వ్యక్తికి 12 కిలోలు, జూలై నుంచి నవంబర్‌ వరకు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాత విధానాన్ని అనుసరించాలని పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు అందాయి.

రేషన్‌ బియ్యం.. ఇక కిలో రూపాయి
రేషన్‌ షాపులో బియ్యం పంపిణీ చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

ఉచిత పంపిణీకి స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం

లాక్‌డౌన్‌ నుంచి ఇస్తున్న ఉచిత రేషన్‌ రద్దు

డిసెంబర్‌ నుంచి పాత పద్ధతిలోనే.. ఒక్కొక్కరికి 6 కిలోలు

ఉత్తర్వులు జారీ చేసిన పౌరసరఫరాల శాఖ

వచ్చే మార్చి వరకు ఉచితంగానే ఇవ్వనున్న కేంద్రం


మెదక్‌ అర్బన్‌, నవంబరు 28: కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సర్కారు రేషన్‌ కార్డుదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఒక్కో వ్యక్తికి 12 కిలోలు, జూలై నుంచి నవంబర్‌ వరకు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాత విధానాన్ని అనుసరించాలని పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు అందాయి. డిసెంబరు నుంచి లాక్‌డౌన్‌కు పూర్వం మాదిరిగానే నగదు వసూలు చేయనున్నారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల బియ్యం మాత్రమే ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారులు డీలర్లను అప్రమత్తం చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 521 రేషన్‌ దుకాణాల పరిధిలో 2,13,377 కార్డులు ఉన్నాయి.


ఎనిమిది నెలలు ఉచితం

దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించారు. అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాయి. ఏపిల్ర్‌, మే, జూన్‌ నెలల్లో ఒక్కో వ్యక్తికి 12 కిలోల చొప్పున.. జూలై నుంచి నవంబర్‌ వరకు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ సడలించారు. సాధారణ జీవనం కొనసాగుతుండడంతో ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్ర సర్కారు స్వస్తి పలికింది. 


వచ్చే నెల నుంచి యథావిధిగా వసూలు

వచ్చే నెల డిసెంబర్‌ ఒకటి నుంచి గతంలో మాదిరిగానే రూపాయికి కిలో చొప్పున.. ఒక్కో వ్యక్తికి 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. అంత్యోదయ కార్డుదారులకు 35 కేజీల బియ్యంతో, రూ. 13.50 కిలో చక్కెర ఇవ్వనున్నారు. అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తారు. ఈమేరకు తమ కోటా ప్రకారం డీడీలు చెల్లించాలని రేషన్‌డీలర్లకు అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.


మార్చి వరకు ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీని మార్చి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఇదివరకు ఉత్తర్వుల ప్రకారం ఉచిత పంపిణీ ఈ నెలతో ముగుస్తుండడంతో.. వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం పంపింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉచిత బియ్యం పంపిణీకి స్వస్తి పలికింది. వచ్చే నెల ఒకటి నుంచి బియ్యానికి నగదు వసూలు చేయాలని  ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Updated Date - 2020-11-29T05:46:52+05:30 IST