అద్దెల దరువు!

Jun 15 2021 @ 23:43PM
ట్రాక్టరుతో దుక్కులు చేస్తున్న దృశ్యం
రైతు నెత్తిన యంత్రాల అద్దె భారం

డీజిల్‌ ధర పెరుగుదలే కారణం

ఆందోళనలో అన్నదాతలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

సాగులో యాంత్రీకరణతో సమయం ఆదా అవుతున్నా...ఎప్పటికప్పుడు పెరుగుతున్న అద్దెలతో రైతులపై అదనపు భారం పడుతోంది. పశువుల సంఖ్య తగ్గడం, కూలీలు దొరక్కపోవడంతో ప్రతిఒక్కరూ ఇప్పుడు యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. దుక్కుల నుంచి నూర్పుల వరకూ యంత్రాలనే వినియోగిస్తున్నారు. కొద్దిరోజులుగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో యంత్రాల అద్దెలు పెరుగుతూ వస్తున్నాయి. కూలీల రెట్లదీ అదే తీరు. దుక్కుకు ఒక రేటు, నూర్పులకు ఒక రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయం లేక రైతులు అదనపు ధరలు చెల్లించి పనులు చేయించుకుంటున్నారు. గతంలో ఎకరాకు ఖర్చుచేసిన దాని కంటే అదనంగా రూ.10 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 గత ఏడాది కంటే అ‘ధనం’

గత ఏడాది ట్రాక్టరుతో గంట పాటు పొలం దున్నితే రూ.1000 వరకూ వసూలు చేసేవారు. కానీ ప్రస్తుతం డీజిల్‌ ధర పెరిగిన తరువాత రూ.1,200కు పెంచారు. గతంలో వరి నూర్పునకు కూలీలతో కలిపి రూ.1,200 వసూలు చేసేవారు. ఇప్పుడు రూ.1,400 వసూలు చేస్తున్నారు. ఇక కోత యంత్రాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఏడాదికేడాది పెంచుతూ వస్తున్నారు. తాజాగా పెరిగిన డీజిల్‌ ధరతో భారీగా పెరిగే అవకాశముందని సంబంధిత యజమానులు చెబుతున్నారు. 

 

 కూలీలదీ అదే పరిస్థితి

గ్రామాల్లో కూలీల కొరత కూడా అధికంగా ఉంది. పొలం పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కూలీల ధర కూడా పెరిగింది. దుక్కి చేయడం, గట్టు వేయడం, గాబు తీయడం వంటి వాటి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. మహిళలకైతే రూ.300, పురుషులకైతే రూ.500 చెల్లించాల్సిందే. అదీ కూడా దొరకని పరిస్థితి. ప్రస్తుతం ఉపాధి హామీ పనులు జరుగుతుండడం, ఎండలు ఎక్కువగా ఉండడం, కరోనా కేసుల దృష్ట్యా పొలం పనులకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు.  


 ప్రభుత్వాలు మారినా...

 ప్రభుత్వాలు ప్రోత్సహక నిధులు అందిస్తున్నా ఫలితం లేకపోతోంది. ధరలు నియంత్రించకపోవడంతో ప్రోత్సాహకాలను అందించినా ఫలితం ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రైతు భరోసా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరిట కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాయి. రైతులకు అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటిస్తున్నాయి. కానీ సాగు పెట్టుబడులు తగ్గే మార్గాలను మాత్రం చూపలేకపోతున్నాయి. గిట్టుబాటు ధరతో పాటు మార్కెటింగ్‌ సదుపాయాన్ని కల్పించలేకపోతున్నాయి. 


అప్పులు చేయాల్సి వస్తోంది

 వ్యవసాయం కష్టతరంగా మారింది. సాగు పెట్టుబడులు పెరిగాయి. యంత్రాల సాయంతో సాగుచేద్దామంటే ఏడాదికేడాది అద్దెలు పెరుగుతున్నాయి. గత ఏడాది కంటే దుక్కులకు రూ.200 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కూలీల ధరలు కూడా పెరిగాయి. రైతుకు కనీస గిట్టుబాటు కలగడం లేదు. ప్రత్యామ్నాయ ఉపాధి శ్రేయస్కరంగా భావిస్తున్నాం.  

-సనపల వెంకటరావు, రైతు, నందిగాం


ఇలా అయితే కష్టం

గతంలో పశువులతో వ్యవసాయ పనులు చేసేవాళ్లం. కానీ ప్రస్తుతం పశువులు తగ్గుముఖం పట్టాయి. యంత్రాలతో సాగుచేద్దామనుకుంటే అద్దె పెరుగుతూ వస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపే ఇందుకు కారణం. రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్న ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా నియంత్రించాలి. ఇలాగే డీజిల్‌ ధర పెరిగితే యంత్రాలతో సాగు చేయడం చాలా కష్టం. 

-దాసరి లోకనాథం, రైతు, మాకన్నపురం, సోంపేట మండలం
Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.