Advertisement

సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేయాలి

Jan 24 2021 @ 01:00AM

భెల్‌ మాజీ కార్మికులకు రేషన్‌ కార్డులు, ఫించన్లు

సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు


రామచంద్రాపురం, జనవరి 23: ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించేది లేదని అధికారులను మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. కలెక్టర్‌ హన్మంతరావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్‌ వి.సింధూఆదర్శ్‌రెడ్డితో కలిసి హెచ్‌ఐజీలో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భారతీనగర్‌ 111 డివిజన్‌లో నెలకొన్న సమస్యలపై చర్చించారు.  


తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.59 కోట్లు

హెచ్‌ఐజీ, మాక్‌సొసైటీ, బీడీఎల్‌ కాలనీల్లో తాగునీటి సరఫరా కోసం ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం కోసం రూ.59 కోట్లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భెల్‌ కార్మికుల కాలనీలను గేటెడ్‌ కమ్యూనిటీగా గుర్తించొద్దని, సరిపడా నీటిని కేటాయించాలని హెచ్‌ఎండబ్ల్యూఎ్‌స ఉన్నతాధికారులకు సూచించారు. ఎంఎంటీఎస్‌ నిర్మాణంలో ఇళ్లను కోల్పోయిన పేదలకు జూన్‌లోగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాలుగా రైల్వే ట్రాక్‌ పక్కనే ఉంటున్న పేదలకు అదే స్థలంలో ఇళ్ల పట్టాలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బీహెచ్‌ఈఎల్‌ పరిశ్రమలో పనిచేసి పదవీ విరమణ పొందిన కార్మికులకు పక్కా భవనం ఉన్నప్పటికీ రూ. 2 వేల లోపు పీఎఫ్‌ ఫించన్‌ అందుకుంటున్న వారికి రేషన్‌ కార్డులు,  ఆసరా ఫించన్లు మంజూరు చేయాలని కలెక్టర్‌, జోనల్‌ కమిషనర్‌కు సూచించారు. బీడీఎల్‌, మాక్‌ సొసైటీ కాలనీల ఫైనల్‌ లేఅవుట్‌ జారీ చేపట్టాలని హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు ఈఎ్‌సఐ ఆస్పత్రి ఆవరణలో స్థలం కేటాయింపు, ఎంఎంటీఎస్‌ రైళ్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడటానికి ఎంపీతో కలిసి ఢిల్లీ వెళ్లాలని కార్పొరేటర్‌కు మంత్రి సూచించారు. 


నియోజకవర్గానికి 3,500 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

పటాన్‌చెరు నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరుకు ప్రతిపాదనలు తుదిదశలో ఉన్నాయని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల అధికారి సురేష్‌ తెలిపారు. కొల్లూరు, ఈదులనాగులపల్లిలో డబుల్‌ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని వివరించారు. కొల్లూరులోని బీహెచ్‌ఈఎల్‌ కార్మికుల గృహసముదాయానికి సంబంధించి సొసైటీ  సభ్యులు మంత్రి దృష్టికి తీసుకురాగా కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడనని చెప్పారు.


సిద్దిపేట మార్కెట్‌ను తలపించేలా రైతు బజార్‌

సిద్దిపేటలోని రైతు బజారును తలపించేలా రామచంద్రాపురం రైతు బజార్‌ను డిజైన్‌ చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రాయసముద్రం చెరువు సుందరీకరణ పనుల్లో జాప్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని 180 సర్వే నంబరులోని 18 గుంటల ప్రభుత్వ భూమిలో మినీస్టేడియం నిర్మించాలని ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఆర్డీవో నగేష్‌, తహసీల్దార్‌ శివకుమార్‌, డీసీ బాలయ్య, కార్పొరేటర్లు అంజయ్యయాదవ్‌, పుష్ప పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement