పెట్రోల్‌ ః 100

ABN , First Publish Date - 2021-05-29T04:53:26+05:30 IST

జిల్లాలో పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టేసింది. లీటరు పెట్రోలు వంద రూపాయలు దాటేసింది. ఒకట్రెండు చోట్ల పైసల్లో వ్యత్యాసం తప్పిస్తే జిల్లా అంతటా ఇదే ధర ఉంది. విశాఖ నుంచి ట్రాన్స్‌పోర్టు దూరం పెరుగుతున్న కొద్దీ ధరల్లో స్వల్ప మార్పు ఉంటుంది. అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

పెట్రోల్‌ ః 100

జిల్లాలో సెంచరీ దాటేసిన ఇంధనం ధర

వాహనదారుల బెంబేలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టేసింది. లీటరు పెట్రోలు వంద రూపాయలు దాటేసింది. ఒకట్రెండు చోట్ల పైసల్లో వ్యత్యాసం తప్పిస్తే జిల్లా అంతటా ఇదే ధర ఉంది. విశాఖ నుంచి ట్రాన్స్‌పోర్టు దూరం పెరుగుతున్న కొద్దీ ధరల్లో స్వల్ప మార్పు ఉంటుంది. అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో ప్రస్తుతం పెట్రోల్‌ లీటరు ధర రూ.99.70ఉంది. ఈ ధర శనివారం వేకువజామున మళ్లీ మారే అవకాశముంది. ఇచ్ఛాపురంలో రూ.100.40, పలాసలో రూ.99.99,  పాతపట్నంలో రూ.99.91 చొప్పున బంకుల్లో విక్రయిస్తున్నారు. జిల్లాలో 110 పెట్రోలు బంకులు ఉన్నాయి. రోజుకి సుమారు 3 లక్షల లీటర్ల పెట్రోలు, 5 లక్షల లీటర్ల డీజిల్‌ విక్రయాలు జరుగుతుంటాయి. ప్రస్తు తం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ ఉండడంతో  విక్రయాలు తగ్గాయి. పెట్రో బాదుడు ఇలాగే ఉంటే వాహనాలపై ఎలా తిరగగలమని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. వాహనం నడిపేకన్నా... నడవడమే మంచిదని భావిస్తున్నారు.  


వ్యవసాయంపై ఇంధన భారం

- పెరిగిన డీజిల్‌ ధరలు

- ఆందోళనలో అన్నదాతలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతున్న అన్నదాతపై డీజిల్‌ రూపంలో మరో అదనపు భారం పడుతోంది. ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధమవుతున్న వేళ.. పెరుగుతున్న డీజిల్‌ ధరలు రైతులను కలవరపెడుతున్నాయి. జనవరిలో లీటర్‌ డీజిల్‌పై రూ.2.77, ఫిబ్రవరిలో రూ.5.14 చొప్పున పెరిగింది. తాజాగా ఈ నెలలో ప్రస్తుతం రూ.4.16 అదనపు భారం పడుతోంది.  దీంతో ట్రాక్టర్లతో చేసే సేద్యం ఖర్చులు పెరగనున్నాయి. దుక్కి దున్నడం మొదలు పంట కోత వరకు, మందుల పిచికారికి సైతం రైతులు యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. అనూహ్యంగా పెరుగుతున్న డీజిల్‌ ధరలతో సతమతమవుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో 5.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యాన్ని నిర్థేశించింది. మొన్నటి వరకు ఎకరా పొలం దున్నడానికి రూ.1000 నుంచి రూ. 1200 వరకు డీజిల్‌ కోసం ఖర్చయేది. ప్రస్తుతం రూ. 1400 నుంచి రూ. 1600 వరకు పెరిగింది. ఇక దమ్ములు చేయడానికి, యంత్రాలతో వరి నాట్లు వేసేందుకు భారీగా డీజలు ఖర్చులు పెరిగే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 45 వేల వరకు వ్యవసాయ ట్రాక్టర్లు ఉన్నాయి. చాలా మంది రైతులు ట్రాక్టర్లను అద్దెకు తెచ్చుకుని సేద్యం చేస్తున్నారు. అలాంటి వారిపై మరింత భారం పడనుంది.  

Updated Date - 2021-05-29T04:53:26+05:30 IST