ప్రమాదకరంగా ప్రధాన రహదారులు

ABN , First Publish Date - 2020-12-04T05:10:27+05:30 IST

ప్రమాదకరంగా ప్రధాన రహదారులు

ప్రమాదకరంగా ప్రధాన రహదారులు
కుందన్‌పల్లి నుంచి కుషాయిగూడ వెళ్లే ప్రధానరహదారి

  • కీసరలో భారీ వరదకు కయ్యకోసిన రోడ్లు 
  • రహదారులపై గుంతలతో  ప్రయాణికుల ఇబ్బందులు  
  • పట్టించుకోని అధికారులు, పాలకులు

కీసర: ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధార రోడ్లు తెగిపోయి ప్రమాదకరంగా మారాయి. తెగిపోయిన రోడ్లతో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కీసర మండల పరిధిలోని పలు ప్రధాన రహదారులు గతనెల కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కుందన్‌పల్లి చౌరస్తా నుంచి కుషాయిగూడ వెళ్లే దారిలో ఉన్న కల్వర్టు వద్ద, భోగారం నుంచి కీసరకు వచ్చే ప్రధాన రహదారి (మేఘన హిల్స్‌ వెంచర్‌ ఎదురుగా) భారీ వరదకు రోడ్డు పూర్తిగా కయ్యకోసింది. దీంతో రహదారి అంచున అతిపెద్ద గుంతగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఇటీవల ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్‌ అనే వ్యక్తి కుటుంబసభ్యులతో కలిసి తన కారులో భోగారం నుంచి కీసరకు వస్తుండగా వర్షానికి దెబ్బతిన్న రోడ్డును గమనించకపోవడంతో కారు కాస్త కయ్యపడిన రోడ్డు గుంతలోకి దూసుకుపోయింది. కారు వేగంగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వరద బీభత్సవానికి కల్వర్టు వద్ద పెద్దగా గుంత ఏర్పడింది. పైనుంచి చూస్తే మాత్రం రోడ్డు ఉన్నట్లుగానే కనిపిస్తుంది. గుంతను ఆదమరిచినా, ఓవర్‌టేకులు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వర్షాలు పడి నెలరోజులు గడస్తున్నా కయ్యలు పడిన రోడ్లను బాగు చేయాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరిమధ్యలో ఏర్పడిన చిన్నచిన్న గుంతలను మట్టి పూడుస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్న ప్రజాప్రతిధులు ఊరు వెలుపల ఉన్న ప్రధాన రహదారులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.  కయ్యలు పడిన రోడ్లకు రాళ్లు అడ్డంగా పెట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, గుంతలను మాత్రం పూడ్చడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గుంతలు పడిన చోట పూడ్చివేసి, ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. 


గుంతలు పూడ్చాలి: ప్రవీణ్‌, గోధుమకుంట


వర్షాలకు ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు అధికారులు వెంటనే చర్యలు  తీసుకోవాలి. ముఖ్యంగా కుందన్‌పల్లి చౌరస్తా, భోగారం నుంచి వచ్చే ప్రధాన  రహదారులకు ఏర్పడిన గుంతలు పెను ప్రమాదకరంగా మారాయి. దీంతో అవగహన లేని వారు, రాత్రి వేళల్లో వాహనదారులు గుంతలు గమనించకపోతే ప్రమాదబారిన పడే అవకాశాలున్నాయి. కావున అధికారులు ప్రమాదాలు జరకముందే తగు చర్యలు తీసుకుని గుంతలను పూడ్చాలి.  

Updated Date - 2020-12-04T05:10:27+05:30 IST