ఇవేం రోడ్లు బాబోయ్‌

ABN , First Publish Date - 2020-10-27T07:05:00+05:30 IST

రాజమహేంద్రవరం రహదారులు దారుణంగా తయారయ్యాయి. పలు వీధుల్లో దుమ్మురేగుతోంది. గతుకులు కుదిపేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ పెద్దపెద్ద గోతులు.. దీంతో వాహనాలు పాడైపోతున్నాయి.

ఇవేం రోడ్లు బాబోయ్‌
ఇదీ రాజమహేంద్రవరం నగరంలో రోడ్ల దుస్థితి. కాతేరు వైపు కనిపించిన దృశ్యం

రాజమహేంద్రవరంలో రోడ్లు అధ్వానం

ఎక్కడికక్కడ గోతులు..  సెంట్రల్‌ డివైడర్లకే ప్రాధాన్యం

రూ.27.89 కోట్లతో 22 రోడ్లకు టెండర్లు పిలిచినా ముందుకు కదలని పనులు

 రాజమహేంద్రవరం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం రహదారులు దారుణంగా తయారయ్యాయి. పలు వీధుల్లో దుమ్మురేగుతోంది. గతుకులు కుదిపేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ పెద్దపెద్ద గోతులు.. దీంతో వాహనాలు పాడైపోతున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ వల్ల చాలా రోజులు వీధులు మూసేసినప్పుడు డ్రైన్లలో పూడికలు కొంతమేర తీశారు. కానీ రోడ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు జనమంతా రోడ్లమీదకు వచ్చారు. ట్రాఫిక్‌ బాగా పెరిగిపోయింది. కానీ రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్లు మినహా మిగతా రోడ్లన్నీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచే వేయాలి. పన్నులు బాగా వసూలు చేస్తున్నారు. ఆస్తిపన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల రూపంలో  ఏటా  రూ.70 కోట్ల వరకూ వసూలు చేస్తారు. ఇంకా  మార్కెట్‌ సెస్‌ వసూ లు చేస్తున్నారు. వినోదపు పన్ను వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతీ ఏటా రూ.కోట్లాది ఆదాయం ప్రజల నుంచే వస్తోంది. ఇక ఉద్యోగుల జీతాలు ప్రభుత్వమే ఇస్తుంది. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సుమారు 1100 మంది ఉన్నారు. వీరికి సుమారు రూ.2 కోట్ల జీతాలివ్వాలి. ఇవి మాత్రం కార్పొరేషనే ఇవ్వాలి. ఇక పన్నుల రూపేణా వచ్చిన జనరల్‌ ఫండ్స్‌తో రోడ్లు, విద్యుత్‌, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలు వంటివి మెయిటెనెన్స్‌ చేయాలి. పుష్కరాల తర్వాత ఎక్కడా సరైన రోడ్డు వేయలేదు. కొన్నిచోట్ల ఒక్కో లేయర్‌ వేసినప్పటికీ, అవన్నీ గతులకుమయం అయిపోయా యి. ఇవాళ మొత్తం కార్పొరేషన్‌ పరిధిలోని ప్రధాన రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఇటీవల రూ.27.89 కోట్లతో 22 రోడ్లు, సెంట్రల్‌ డివైడర్లు, ఇతర వర్కులకు టెండర్లు పిలిచారు. ఇవన్నీ 14వ ఫైనాన్స్‌ నిధులు. వీటితో ముందుగా రోడ్ల రిపేర్లు, అభివృద్ధి ప్రారంభిస్తే, ఈ సమయంలో ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయి. కొన్నిచోట్ల డివైడర్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అంతగా అవసరం లేని ప్రాంతాల్లో 100 అడుగుల రోడ్ల అభివృద్ధి పనులు మొదలుపెట్టడం గమనార్హం. వీఆర్‌ పురం రైతు బజార్‌ పక్క నుంచి  మోరంపూడి సెంటర్‌ ఆర్టీసీ రోడ్డును కలుపుతూ మోడల్‌ కాలనీ వెనుక నుంచి నిర్మిస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి అవసరమే. ప్రస్తుతం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వాటికి ప్రాధాన్యత ఇచ్చి వీటిని అభివృద్ధి చేస్తే ప్రజలు హర్షిస్తారు. టీడీపీ కల్యాణమండపం రోడ్డులో పెద్ద గోతులున్నాయి. ఏవీ అప్పారావురోడ్డు, జేఎన్‌ రోడ్డు, లాలాచెరువు రోడ్డుతోపాటు ఇతర ప్రధాన రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. రంభాఊర్వశి మేనకా ఽథియేటర్ల రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇది అతిదారుణంగా మారింది.  ధవళేశ్వరం వైపు నుంచి రోడ్డు కమ్‌ రైలు బ్రిడ్జి నుంచి, బొమ్మూరు, హుకుంపేట, మోరంపూడి తదితర రోడ్లన్నీ ఇదే దుస్థితిలో ఉన్నాయి.


Updated Date - 2020-10-27T07:05:00+05:30 IST