హై అలర్ట్‌.. హై టెన్షన్‌..!

ABN , First Publish Date - 2021-11-22T08:12:31+05:30 IST

రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండింది.

హై అలర్ట్‌.. హై టెన్షన్‌..!
నిండుకుండలా ఉన్న రాయలచెరువు

 ప్రమాదపు అంచున రాయలచెరువు 

 కట్టనుంచి పలుచోట్ల లీకవుతున్న నీరు

 గండిపడుతుందంటూ గ్రామాల్లో ప్రచారం

 పరిశీలించిన అధికార యంత్రాంగం

దిగువగ్రామాలను ఖాళీచేయించిన పోలీసులు

లీకవుతున్న చోట ఇసుక బస్తాల అడ్డు


తిరుపతి, ఆంధ్రజ్యోతి/రామచంద్రాపురం: రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండింది. ఎగువప్రాంతాలనుంచి నీటి ప్రవాహం పెరగడంతో పలుచోట్ల కట్ట లీకేజీలు స్థానికులతో పాటు యంత్రాంగం గుర్తించింది. శనివారమే చెరువు కట్ట తెగిందన్న ప్రచారంతో దాదాపు 20 గ్రామాలు భయాందోళనకు గురయ్యాయి. మొరవ కాలువను యంత్రాల సాయంతో వెడల్పు చేసి నీటిని వదలడంతో వచ్చేనీరు తగ్గుముఖం పడుతుందని రెవెన్యూ యంత్రాంగం హామీ ఇచ్చింది. కానీ, ఆదివారం చెరువు కట్ట లీకవడంతో అందోళన మొదలైంది. అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. పోలీసుల సహకారంతో దిగువగ్రామాలను ఖాళీచేయించారు. ఏక్షణమైనా గండిపడే అవకాశం ఉందన్న భయంతో ఊళ్లకు ఊళ్లకు ఖాళీచేసి వెళ్లిపోయారు. 



అధికారుల పరిశీలన

రాయల చెరువు ప్రమాదకర పరిస్థితి తెలుసుకున్న ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, కలెక్టరు హరినారాయణన్‌, అర్బన్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడుతో పాటు ఇరిగేషన్‌ అధికారులు రాయలచెరువును పరిశీలించారు. లీకేజీ నివారణ చర్యలు చేపట్టారు. మొరవ కాలువను ఎక్స్‌కవేటర్‌తో మరింత పెద్దదిచేసి నీటిని విడుదల చేయాలని సూచించారు. లీకవుతున్న చోట స్థానిక యువత సాయంతో ఇసుక బస్తాలతో అడ్డుపెట్టే ప్రయత్నం చేపట్టారు. డ్రోన్‌ కెమెరాలతో చెరువు పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు. 


16 గ్రామాలు అప్రమత్తం

రాయల చెరువుకు గండిపడితే 16 ప్రభావిత గ్రామాలను యంత్రాంగం గుర్తించింది. పాడిపేట, ముండ్లపూడి, వడ్డేపల్లి, కుంట్రపాకం ఎస్టీ కాలనీ, తనపల్లి, పద్మవల్లి పురం, నాగూర్‌ కాలనీ, ప్రసన్న వెంకటేశ్వర పురం, బలిజపల్లి, ఎస్‌ఆర్‌ పురం, గంగిరెడ్డి పల్లి, కమ్మకండ్రిగ, కమ్మపల్లి, నెన్నూరు, కొత్త నెన్నూరు, శాఖమూరి కండ్రిగ ప్రాంతాల వాసులను అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది. 


కొండలు, గుట్టలు ఎక్కుతున్న స్థానికులు

చెరువుకు గండిపడిందన్న ప్రచారంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కట్టకింద ఉన్న 10గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో సమీపంలోని అడవి.. గుట్టల్లోకి పరుగులు తీశారు. పశువులను సమీపంలోని అడవుల్లోకి వదిలేశారు. చెరువు సమీపంలోని గుట్టపైకి పలువురు స్థానికులు చేరుకుని గట్టువైపే చూస్తూ ఉండిపోయారు. కాగా, 1997లో రాయలచెరువు తెగిందన్న ప్రచారంతో వీరంతా అడవుల్లోకి పరుగులు తీసినట్టు పలువురు గుర్తుచేసుకుంటున్నారు. 


పునరావాస కేంద్రాల ఏర్పాటు 

రాయలచెరువు లోతట్టు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయంతో పాటు రామాపురంలోని వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌, రామరాజా కాలేజీ, అగరాల ఈశ్వర్‌రెడ్డి కళాశాల, శ్వేత ఇంజినీరింగ్‌ కాలేజ్‌, సి.రామాపురం జడ్పీ హైస్కూల్‌ తదితర కేంద్రాల్లో పునరావాసం ఏర్పాటు చేసింది. చెరువు దిగువప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు. వీటిలో బాధితులకు వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు. 


విమానాశ్రయానికి 3 ప్రత్యేక హెలికాప్టర్లు 

రాయలచెరువు కట్టకు ఏక్షణమైనా గండిపడే అవకాశం ఉందని భావించిన యంత్రాంగం రెస్క్యూ బృందాలను సిద్ధం చేస్తోంది. తిరుపతి విమానాశ్రయానికి మూడు ప్రత్యేక హెలికాప్టర్లు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం విజ్ఞప్తితో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది హెలికాప్టర్లతో సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 


ససేమిరా అంటున్న గ్రామస్తులు: 

తిరుపతి(నేరవిభాగం): కొందరు గ్రామాలను ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. కమ్మపల్లి మరో రెండు గ్రామాల ప్రజలు ఎంతకూ కదలకపోవడంతో ఎస్పీ వెంకటఅప్పలనాయుడే ఆయా గ్రామాల నాయకులతో మాట్లాడారు. తాము గ్రామాలు ఖాళీచేస్తే అధికారులు రాయలచెరువుకు గండికొడతారని, అందువల్ల తాము కదిలేది లేదని వారంటున్నట్లు తెలిసింది. గండి పడకుండా ఆపడం, ప్రజలకు ప్రమాదం లేకుండా చేయడమే తమ బాధ్యతని, అధికారులు గండి కొడతారన్నది అపోహ మాత్రమేనని ఆయన చెప్పి వారిని ఒప్పించినట్టు తెలుస్తోంది. 


అప్రమత్తంగా ఉన్నాం: ఎస్పీ 

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 21: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితోపాటు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు తెలిపారు. చెరువుకు దిగువ ప్రాంతంలోని 18 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించామన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరమేమీ లేదని, ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు వెళ్లే పరిస్థితి ఉండదుగాబట్టి ఖాళీ చేయాలని చెప్పామన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే అదనపు బలగాలను రప్పించేలా కలెక్టర్‌ ఏర్పాట్లు చేశారన్నారు. అవసరమైతే ఎయిర్‌ఫోర్సు సహాయం కూడా తీసుకుంటామన్నారు. అధికారులకు ప్రజలు సహకరించి సూచనలను పాటించాలని కోరారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను, లైఫ్‌ బోట్లను రప్పించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పవర్‌బోటు సాయంతో చెరువులో దిగి పరిస్థితిని పరిశీలించాయి.







Updated Date - 2021-11-22T08:12:31+05:30 IST