ఐదు రోజుల తర్వాత హడావుడి

ABN , First Publish Date - 2021-11-24T07:57:04+05:30 IST

చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తారన్న ప్రకటనతో వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార పక్ష నేతల హడావిడి పెరిగింది.

ఐదు రోజుల తర్వాత హడావుడి

చంద్రబాబు ప్రకటన పర్యవసానం


తిరుపతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి):  వరద ప్రాంతాల్లో ఒక్కసారిగా అధికార పక్షం నేతల హడావిడి  పెరిగింది. తిరుపతి నుంచి హెలికాప్టర్లు ఎగురుతున్నాయి. నాయకులు పడవలేసుకుని మరీ తిరుగుతున్నారు. ఇదంతా ఐదు రోజుల తర్వాత జరగడమే విశేషం. ఈ నెల 18న కురిసిన భారీ వానలతో తిరుపతి అర్బన్‌, తిరుపతి రూరల్‌, రామచంద్రాపురం, ఏర్పేడు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, పుంగనూరు, సదుం, సోమల, పులిచెర్ల తదితర మండలాల్లో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టాలు సంభవించాయి. 20వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే ద్వారా నష్టాలను పరిశీలించారు. తర్వాత 22వ తేదీ నుంచే జిల్లాలో ఽఅధికార పార్టీ ముఖ్యనేతల హడావిడి పెరిగింది. ఒకరిద్దరు తప్ప అంతకు ముందు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం గానీ, బాధిత ప్రజల్ని పరామర్శించడం గానీ చేయలేదు. కనీసం ప్రభుత్వపరంగా తక్షణసాయం అందించే ప్రయత్నం కూడా చేయలేదు. చాలావరకూ అధికార యంత్రాంగమే పునరావాస కేంద్రాల ఏర్పాటు వంటి బాధ్యతలు నిర్వర్తించింది. అయితే 21వ తేదీన వర్ష ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంతో అఽధికారపార్టీ నేతలు పరుగులు తీశారు. 22న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పాపానాయుడుపేట, రాయలచెరువు, పూతలపట్టు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. 23న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జిల్లా ఇంఛార్జి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు రాయలచెరువును సందర్శించి మరమ్మతు పనులు పరిశీలించగా మంత్రి పెద్దిరెడ్డి పులిచెర్ల, సదుం, పుంగనూరు, గంగవరం తదితర మండలాల్లో పర్యటించారు. తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు మాత్రం వరద ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉన్నారు. 

Updated Date - 2021-11-24T07:57:04+05:30 IST