ఆశ్రమ పాఠశాలల సరుకులు విక్రయం

ABN , First Publish Date - 2021-05-07T05:30:54+05:30 IST

కరోనా సెకెండ్‌వేవ్‌ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలలు, పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో మిగిలి ఉన్న సరుకులు అమ్మకానికి అధికారులు చర్యలు చేపట్టారు.

ఆశ్రమ పాఠశాలల సరుకులు విక్రయం

సీతంపేట : కరోనా సెకెండ్‌వేవ్‌ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలలు, పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో మిగిలి ఉన్న సరుకులు అమ్మకానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఐటీడీఏ పీవో స్పందించారు. తొలుత రూ.3.5 లక్షలు విలువ చేసే పాల ప్యాకెట్లను సంబంధిత వార్డెన్లు ఒక్కో ప్యాకెట్టు రూ.5 చొప్పున అమ్మేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరిగి పాఠశాలలు పునః ప్రారంభం తర్వాత ఈ డబ్బులతో తిరిగి పాల ప్యాకెట్లకు చెల్లించాలన్నారు. టెండర్‌ ద్వారా ఒక్కోపాల ప్యాకెట్టు రూ.5.75కు ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేయగా... ఇప్పుడు రూ.5కే విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి కొంత మేర నష్టం వాటిళ్లనుంది. కాగా మిగతా నిత్యావసర సరుకులు తదుపరి ఆదేశాల తర్వాతే విక్రయించాలని సూచించారు. ఇదిలావుంటే అన్ని ఆశ్రమ పాఠశాలలు, పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లకు సంబంధించి ఏడేళ్లగా ఆడిట్‌ జరగలేదు. ఈ క్రమంలో ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఐటీడీఏలో ఆడిట్‌ కలవరం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి జిల్లా ఆడిట్‌ అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆడిట్‌కు సిద్ధం కావాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి ఉపసంచాలకులు శ్రీనివాసరావు సంబంధిత హాస్టళ్ల నిర్వాహకులకు ఆడిట్‌కు సంబంధించిన రికార్డులన్నీ సిద్ధంగా ఉంచాలని సర్క్యులర్‌ జారీ చేశారు.

 

మరో నెల రోజులు సెలవుపై డీడీ

ఐటీడీఏ అనుబంధంగా పనిచేస్తున్న గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎం.కమల మరో నెల రోజులు సెలవు పొడిగించారు. ఇప్పటికే ఆమె నెల రోజులు సెలవులో ఉండగా... ఈ నెలాఖరు వరకు సెలవును పొడిగించుకున్నారు. కాగా గిరిజన సంక్షేమ శాఖలో వర్గపోరు నెలకొని, నిత్యమూ కోర్టుల్లో వివాదాలకు ఆ శాఖ కేంద్ర బిందువుగా మారింది. దీంతో ఆమె ఇమడలేక ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మందస ఏటీడబ్ల్యూవో శ్రీనివాసరావు ఇన్‌చార్జి డీడీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉప విద్యాశాఖను కూడా డీడీనే నిర్వహించడం, రెగ్యులర్‌ అధికారిగా ఎవర్నీ నియమించకపోవడంతో పనిభారం కూడా వీరిపై పెరిగింది.

 

Updated Date - 2021-05-07T05:30:54+05:30 IST