అడ్డగోలుగా..!

ABN , First Publish Date - 2021-05-19T05:22:53+05:30 IST

యంతాంగ్రమంతా కరోనా విధుల్లో ఉండగా జిల్లా నుంచి ఇసుక తరలిపోతుందా? వంశధార, నాగావళి నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారా? రాజకీయ పలుకుబడితో కాసులు కొల్లగొడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భామిని మండల సరిహద్దు ఒడిశా గ్రామాల్లో కొందరు స్థానిక అనుమతులను పొందినట్లు చెబుతూ పదుల సంఖ్యలో ఇసుక లారీలను పాలకొండ, రాజాం వయా విజయనగరం మీదుగా విశాఖ తరలించుకుపోతున్నట్లు సమాచారం.

అడ్డగోలుగా..!
భామిని : ఏబీ రహదారిపై ఇసుక లోడుతో వెళ్తున్న లారీ





ఇసుక తరలింపు

ఒడిశా అనుమతుల పేరిట తవ్వకాలు

యథేచ్ఛగా రవాణా

రెచ్చిపోతున్న అక్రమార్కులు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

యంతాంగ్రమంతా కరోనా విధుల్లో ఉండగా జిల్లా నుంచి ఇసుక తరలిపోతుందా? వంశధార, నాగావళి నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారా? రాజకీయ పలుకుబడితో కాసులు కొల్లగొడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భామిని మండల సరిహద్దు ఒడిశా గ్రామాల్లో కొందరు స్థానిక అనుమతులను పొందినట్లు చెబుతూ పదుల సంఖ్యలో ఇసుక లారీలను పాలకొండ, రాజాం వయా విజయనగరం మీదుగా విశాఖ తరలించుకుపోతున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన కొందరు నేతల ప్రమేయంతో తతంగం జరుగుతున్నట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో ఇసుక ఉచిత విధానం అమల్లో ఉండేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం స్థానికంగా జిల్లాలో అనుమతి ఉన్న రీచ్‌లలో మాత్రమే తవ్వకాలు జరగాలి. ఒడిశా నుంచి ఇసుకను ఆంధ్రకు రవాణా చేసుకొనే వీలుండదు.  మాఫియా కొత్త ఎత్తులతో భామిని మండలానికి ఆనుకొని ఉన్న ఒడిశా రాయగడ జిల్లా గుణుపూర్‌ బ్లాక్‌ పెంగూడ పంచాయతీ మచ్చకోట్‌ గ్రామం పేరిట అనుమతులు తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఇసుక సేకరించి లారీలు, టిప్పర్లలో ఆంధ్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కరోనా విధుల్లో ఉన్నామని చెబుతూ కనీసం పట్టించుకోవడం లేదు. 


స్థానిక అవసరాల పేరిట

జిల్లాలో కరోనా ఉధృతి కారణంగా అనుమతి ఉన్న రీచ్‌లలో కూడా ఇసుక సేకరణను గనుల శాఖ అధికారులు నిలిపేశారు. ఇసుక బుకింగ్‌ సైట్‌ కూడా ఓపెన్‌ కావడం లేదు. కర్ఫ్యూ ఈనెలఖరు వరకూ పొడిగించిన నేపథ్యంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉండదని అధికారులు చెబుతున్నారు.కొన్నిచోట్ల స్థానిక అవసరాలకు అనే కుంటి సాకుతో యథేచ్చగా వంశధార, నాగావళి నదీ పరివాక ప్రాంతాల్లోని తవ్వకాలు జరగుతున్నాయి. భామిని మండలం కొసలి, బిల్లమడ రీచ్‌ల వద్ద కొద్దిరోజుల కిందట వరకూ ఇసుక  తవ్వకాలు జరిగాయి. దీనిపై కొందరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో తవ్వకాలు నిలిపేశారు. నరసన్నపేట మండలం మడపాం, లుకలాం, తేనెలవలసల్లో అనుమతి లేకుండానే ఇసుక రవాణా జరుగుతోంది. ఆమదాలవలస మండలం చవాకులపేట, నిమ్మతొర్ల్లాడ, తొరగాం గ్రామ నదీ పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరగుతున్నాయి. బూర్జ మండలం నారాయణపురం, సరుబుజ్జిలి మండలం ఎరగాంలో తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక నాయకుడికి చెందిన ఇసుక లారీలు ఇటీవల పట్టుబడ్డాయి. పెదసావళాపురంలో కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక నేతలే ఇసుక టైర్‌ బళ్లను ఏర్పాటు చేసుకొని రాత్రి, తెల్లవారు జామున ఇసుక రవాణా చేసి  జేబులు నింపుకొంటున్నారు. గృహ నిర్మాణ సంస్థ ఇళ్ల నిర్మాణాలకు,ప్రభుత్వ అభివృద్ధి పనులకు స్థానిక సచివాలయంలో కార్యదర్శి ఇసుక పర్మిట్లు జారీ చేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు కార్యదర్శుల ద్వారా అనుమతి పత్రాలు తీసుకొని విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు. దీనిపై యంత్రాంగం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.





Updated Date - 2021-05-19T05:22:53+05:30 IST