సరిహద్దులో సారా జోరు!

ABN , First Publish Date - 2021-05-20T05:13:05+05:30 IST

కరోనా విజృంభిస్తున్న వేళ ఒడిశా సరిహద్దు మండలాల్లో సారా ఏరులై పారుతోంది. ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది దాడులు చేస్తున్నా..సారా తయారీదారులు వెనక్కి తగ్గడం లేదు. అటవి, కొండ ప్రాంతాల్లో సారా తయారు చేస్తున్నారు. మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. అమాయక గిరిజనులకు డబ్బు ఆశ చూపి.. వారితోనే సారాను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. మద్యం కంటే తక్కువ ధరకు లభిస్తుండడంతో మందుబాబులు సారా వైపే మొగ్గు చూపుతున్నారు. కరోనా వ్యాప్తి వేళ.. సారాను తాగి చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీని నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.

సరిహద్దులో సారా జోరు!
ఏజెన్సీలో సారా తయారు చేస్తున్న దృశ్యం

అటవీ ప్రాంతాల్లో తయారీ స్థావరాలు

మైదాన ప్రాంతాల్లో విక్రయాలు

అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలు

సిబ్బంది కొరతతో చేతులెత్తేస్తున్న ఎస్‌ఈబీ

(మెళియాపుట్టి)

కరోనా విజృంభిస్తున్న వేళ ఒడిశా సరిహద్దు మండలాల్లో సారా ఏరులై పారుతోంది. ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది దాడులు చేస్తున్నా..సారా తయారీదారులు వెనక్కి తగ్గడం లేదు. అటవి, కొండ ప్రాంతాల్లో సారా తయారు చేస్తున్నారు. మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. అమాయక గిరిజనులకు డబ్బు ఆశ చూపి.. వారితోనే సారాను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. మద్యం కంటే తక్కువ ధరకు లభిస్తుండడంతో మందుబాబులు సారా వైపే మొగ్గు చూపుతున్నారు. కరోనా వ్యాప్తి వేళ.. సారాను తాగి చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీని నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.

...............................................

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో సారా విక్రయం జోరుగా సాగుతోంది. మెళియాపుట్టి, పాతపట్నం, భామిని, కొత్తూరు, సీతంపేట, మందస, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లోని సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ, రవాణా, అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మద్యం ధరలు అమాంతం పెరిగాయి. క్వార్టర్‌ మద్యం ధర కనిష్ట స్థాయిలో రూ.150 ఉంది. పేరుమోసిన బ్రాండ్ల ధరలు రూ.250పైమాటే. అదే సారా ప్యాకెట్‌ గ్రామాల్లో రూ.50 నుంచి రూ.70కు దొరుకుతుంది. దీంతో మందుబాబులు సారానే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్‌షాపుల మాదిరిగా సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో సారా తాగి చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రామాల్లో సచివాలయ సిబ్బందికి, వలంటీర్లకు ఈ విషయం తెలిసినా... వారు రాజకీయ ఒత్తిళ్లతో ఉన్నతాధికారులకు సమాచారం అందించడం లేదు.


కేసులు నమోదు చేస్తున్నా..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ధరలను అమాంతం పెంచేస్తూ.. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడుపుతోంది. దీనిపై విపక్షాల నుంచి ఆరోపణలు ఎదురైనా.. ధరలు పెంచడం ద్వారా మందుబాబులను మద్యానికి దూరం చేయవచ్చని చెప్పుకొచ్చింది. ఈ కారణంగానే ఎక్కువ మంది సారా వైపు మొగ్గుచూపారు. అదే సమయంలో సారా నియంత్రణకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ప్రభుత్వం నియమించింది. ఎస్పీ స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్‌ శాఖ నుంచి సిబ్బందిని బదలాయించింది. కానీ పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడం, వాహనాల నిర్వహణ ఖర్చులు ఇవ్వకపోవడం తదితర కారణాలతో ఎస్‌ఈబీ తూతూమంత్రపు దాడులకే పరిమితమైపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మద్యం, సారా అక్రమ రవాణాకు సంబంధించి గత ఏడాదిగా 2,756 కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్‌ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 1,933 మందిని అరెస్ట్‌ చేసినట్టు చూపుతున్నారు. తీర ప్రాంతాల్లో 11, గిరిజన ప్రాంతాల్లో 21 సారా స్థావరాలను గుర్తించారు. కానీ ఇంకా చాలాచోట్ల తయారీ కేంద్రాలు వెలిశాయి. ముఖ్యంగా దట్టమైన అటవీ ప్రాంతాలను ఎంచుకున్న అక్రమార్కులు అక్కడే సారా తయారు చేస్తున్నారు. ఒడిశా భూభాగం పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి చీకటి మార్గాల్లో మన జిల్లాలోని మైదాన ప్రాంతాలతో పాటు పట్టణాలకు తెచ్చి మరీ విక్రయిస్తున్నారు. లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇదో లాభసాటి వ్యాపారం కావడంతో జైలు పాలవుతున్నా.. తిరిగి వచ్చి ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కరోనా వ్యాపిస్తున్న సమయంలో సారా నియంత్రణపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 


దాడులు చేస్తున్నాం 

సారా తయారీ, రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. తయారీ స్థావరాలపై దాడులు చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్నా.. ఉన్నంతలో మెరుగైన సేవలే అందిస్తున్నాం. ప్రస్తుతం సిబ్బందిలో కొంతమంది కరోనా భారినపడ్డారు. అయినా దాడుల విషయంలో  వెనక్కి తగ్గడం లేదు. ఎక్కడైనా సారా తయారు చేస్తున్నా, విక్రయిస్తున్నా సమాచారమందించాలి.

-రాజేంద్రకుమార్‌, సీఐ, ఎస్‌ఈబీ

Updated Date - 2021-05-20T05:13:05+05:30 IST