మట్టి తరలింపును అడ్డుకున్న సర్పంచ్‌

May 8 2021 @ 23:28PM

పుల్‌కల్‌, మే 8: మండల కేంద్రమైన చౌటకూర్‌ శివారులోని కోమటి చెరువులో నుంచి అక్రమ మట్టి తరలింపును సర్పంచ్‌ కొల్కూరి వీరమణిమొగులయ్య శనివారం అడ్డుకున్నారు. చెరువులో నుంచి అనుమతి లేకుండా లారీల్లో మట్టిని తరలిస్తున్నారని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సర్పంచ్‌ ఫిర్యాదుతో స్పందించిన రెవెన్యూ అధికారులు గ్రామ సేవకులను పంపించి మట్టి తరలింపును నిలిపివేశారు. కాగా, సుల్తాన్‌పూర్‌, ఉప్పరిగూడెం గ్రామాలకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులే సంగారెడ్డి సమీపంలోని ఇటుకబట్టీ వ్యాపారులకు రూ.ఆరు వేలకు టిప్పర్‌ చొప్పున విక్రయిస్తున్నారని ఆరోపించారు. జాతీయ రహదారి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ వద్ద, ఇతర చెరువులు, కుంటలతో పాటుగా అసైన్డ్‌ భూముల నుంచి మట్టిని మేడ్చల్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలిసినప్పటికీ రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్‌ విమర్శించారు. 


 

Follow Us on: