ఒంటరి మహిళలకు షాక్‌

ABN , First Publish Date - 2022-06-22T05:07:07+05:30 IST

ఒంటరి మహిళ పింఛన్‌ పొందేందుకు ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్‌ పంపిణీలో పలు మార్పులు చేపట్టింది. వివిధ కారణాలతో ఉన్న కొన్ని పింఛన్లు తొలగించింది. దీంతో లబ్ధిదారుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది ఇలా ఉండగానే ఒంటరి మహిళ పింఛన్‌ అర్హతలో తాజాగా నూతన మార్పులు తీసుకొచ్చింది. ఒంటరి మహిళలు భర్త నుంచి విడిపోయిన, వివాహం కాని స్త్రీలకు ఇచ్చే అర్హత వయసును 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకూ పెంచింది.

ఒంటరి మహిళలకు షాక్‌

- పింఛన్‌కు నిబంధనల మెలిక
- అర్హత వయస్సు 35 నుంచి 50 ఏళ్లకు పెంపు
- భర్త నుంచి విడిపోయి ఏడాది పూర్తి అవ్వాల్సిందే
- ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
(ఇచ్ఛాఫురం రూరల్‌)

ఒంటరి మహిళ పింఛన్‌ పొందేందుకు ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్‌ పంపిణీలో పలు మార్పులు చేపట్టింది. వివిధ కారణాలతో ఉన్న కొన్ని పింఛన్లు తొలగించింది. దీంతో లబ్ధిదారుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది ఇలా ఉండగానే ఒంటరి మహిళ పింఛన్‌ అర్హతలో తాజాగా నూతన మార్పులు తీసుకొచ్చింది. ఒంటరి మహిళలు భర్త నుంచి విడిపోయిన, వివాహం కాని స్త్రీలకు ఇచ్చే అర్హత వయసును 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకూ పెంచింది. ఇప్పటి వరకు 35 ఏళ్లు దాటిన ఒంటరి మహిళకు పింఛన్‌ అందిస్తుండగా ఇకపై కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి 50 ఏళ్లు దాటితేనే సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం.. వృద్ధాప్య, వితంతువు, వికలాంగ, ఒంటరి మహిళతో పాటు వివిధ రకాల పింఛన్లు 3,79,967 మంది లబ్ధిదారులకు అందిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం ఒంటరి మహిళ పింఛన్‌ రూ.1000 అందించేది. వైసీపీ ప్రభుత్వం మొదటి రూ.వెయ్యి పెంచి, మరో రెండు దఫాలుగా రూ.250 చొప్పున పెంచి ప్రస్తుతం రూ.2500 అందిస్తోంది. అయితే పింఛన్‌ అర్హతలో ప్రభుత్వం మార్పులు తీసుకురావడంతో ఒంటరి మహిళలు ఆందోళన  చెందుతున్నారు.

నిబంధనలు ఇవే :
- వివాహమైన ఒంటరి మహిళ పింఛన్‌ కోసం ధరఖాస్తు నాటికి ఆధార్‌ కార్డు ప్రకారం వయసు 50 సంవత్సరాలు నిండి ఉండాలి.
- భర్త నుంచి విడిపోయి ఏడాది దాటి ఉండాలి.
- భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు కోర్టు నుంచి ధ్రువపతాన్ని కూడా జతచేయాలి.
- పెళ్లికాని ఒంటరి మహిళ పింఛను కోసం దరఖాస్తు నాటికి 50 ఏళ్లు నిండి ఉండాలి. వివాహం కానట్లు తహసీల్దార్‌ నుంచి ధ్రువీకరణ పత్రం ఉండాలి. ధ్రువీకరణ జారీ చేసిన తేదీ నుండి సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ నిబంధనలు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆదేశాలు వచ్చాయి
ఒంటరి మహిళల పింఛన్ల మంజూరులో నిబంధనలు మార్చుతూ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ మార్గదర్శకాలు మేరకు ఒంటరి మహిళలు సచివాలయంలో దరఖాస్తులు చేసుకోవాలి. వాటిని పరిశీలించి పింఛన్లు మంజూరు చేస్తాం.
- బి.వెంకటరమణ, ఎంపీడీవో, ఇచ్ఛాపురం.
 

Updated Date - 2022-06-22T05:07:07+05:30 IST