చెప్పింది చేయాలి

ABN , First Publish Date - 2021-01-02T07:34:59+05:30 IST

పోస్టింగు.. జీతం తీసుకునేది ఒక చోట. పనిచేసేది మరో మండలంలో. ఇలా 42 మంది తహసీల్దార్లు తమదికాని మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

చెప్పింది చేయాలి

వినకుంటే ‘డిప్యుటేషన్‌’!

18 మండలాల్లోనే రెగ్యులర్‌ తహసీల్దార్లు 

42 చోట్ల డిప్యుటేషన్లు.. ఆరింట ఇన్‌చార్జులు 

‘రెవెన్యూ’లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు

ఎక్కడాలేనివిధంగా జిల్లాలో బదిలీలు


చిత్తూరు, ఆంధ్రజ్యోతి: మండలాలు 66. రెగ్యులర్‌ తహసీల్దార్లు 18 మంది. 42 చోట్ల డిప్యుటేషన్లు.. ఆరింట ఇన్‌చార్జులు. కలెక్టరేట్‌లో ఖాళీగా ఐదుగురు. జిల్లాలో రెవెన్యూ అధికారులపై ‘అధికార పార్టీ’ నేతల ఒత్తిడి.. చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయనేందుకు ఈ గణాంకాలే తార్కాణాలు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో తహసీల్దార్లను ఇష్టారీతిన బదిలీ చేస్తున్నారు. ఆయా మండలాల్లో అధికార పార్టీ నాయకుల మాట వినని తహసీల్దార్లపై డిప్యుటేషనాస్త్రం సంధిస్తున్నారు. రాత్రికి రాత్రే మండలం మార్చేస్తున్నారు. కొందరైతే తమకు నచ్చిన తహసీల్దారును డిప్యుటేషన్‌పై తీసుకురావడమో.. స్థానిక డీటీలకు ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇప్పించడమో చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన మండలంలోనే తహసీల్దారుగా ఉండాలంటే మాత్రం అక్కడి నాయకుల మాట వినాల్సిందేనట. డీకేటీ, ప్రభుత్వ భూముల్ని చెప్పినవారి పేరు మీద అక్రమంగా ఎక్కించకుంటే మండలం మార్చేస్తున్నారనే విమర్శను అధికార యంత్రాంగం ఎదుర్కొంటోంది. ఇలా కొందరిని ఏడాదిలోనే నాలుగుసార్లు బదిలీ చేశారు. ప్రస్తుతం భూముల రీసర్వే జరుగుతున్న క్రమంలో తహసీల్దార్ల డిప్యుటేషన్‌ విమర్శలకు దారి తీస్తోంది. మాట వినేవారుంటే రీసర్వేలో భూముల ఓనర్‌షిప్‌ మార్చే అవకాశాలు ఉండొచ్చని పలువురు ఆందోళన చెందుతున్నారు. 


42 మండలాల్లో డిప్యుటేషన్లు 

తంబళ్లపల్లె, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో డిప్యుటేషన్ల మీదే పనిచేస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల తహసీల్దార్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ సదుం నుంచి డిప్యుటేషన్‌ మీద ఇక్కడికి వచ్చారు. పూతలపట్టులోని బంగారుపాళ్యం, ఐరాల తహసీల్దార్లు సుశీల, బెన్నురాజ్‌.. పెద్దమండ్యం, గంగవరం నుంచి డిప్యుటేషన్‌ మీద పనిచేస్తున్నారు. పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం తహసీల్దార్‌లు చంద్రశేఖర్‌, కులశేఖర్‌, నీలమయ్య కేఆర్‌సీసీ, కేవీబీపురం, చిత్తూరు లీడ్‌ బ్యాంకు నుంచి వచ్చి పనిచేస్తున్నారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు, వడమాలపేట, విజయపురం తహసీల్దార్లు జయరాములు, చంద్రశేఖర్‌రెడ్డి, కోటిరెడ్డి.. మదనపల్లె, బీఎన్‌ కండ్రిగ, ఆర్‌సీపురం మండలాల నుంచి డిప్యుటేషన్‌ మీద వచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం, తిరుపతి రూరల్‌, చంద్రగిరి తహసీల్దార్లు మధుసూదనరావు, భాగ్యలక్ష్మి, వెంకటేశ్వర్లు కలెక్టరేట్‌లోని బీ సెక్షన్‌, ఎర్రావారిపాలెం, వడమాలపేట నుంచి డిప్యుటేషన్‌పై వచ్చారు. సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం, బీఎన్‌ కండ్రిగ, కేవీబీపురం, సత్యవేడు, నాగలాపురం తహసీల్దార్లు హనుమాన్‌ నాయక్‌, గణేష్‌, మోహన్‌, శ్రీదేవి, శ్రీనివాసులు సోమల, బి.కొత్తకోట, కలెక్టరేట్‌, నాగలాపురం, సత్యవేడు నుంచి వచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు తహసీల్దార్‌ ఉదయ్‌ సంతోష్‌ తిరుపతి ఆర్డోవో ఆఫీ్‌సలో ఏవోగా ఉంటూ డిప్యుటేషన్‌పై వెళ్లారు. మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం తహసీల్దార్లు కుప్పుస్వామి, మంజుల, వేనయ్య గుడిపాల, రేణిగుంట, ఏర్పేడు మండలాల నుంచి డిప్యుటేషన్‌ల మీద వచ్చి పనిచేస్తున్నారు. తంబళ్లపల్లె, పెద్దమండ్యం, పీటీఎం, ములకలచెరువు, బి.కొత్తకోట, కురబలకోట తహసీల్దార్లు భీమేశ్వరరావు, పార్థసారథి, కళావతి, గోవిందు, నిర్మలదేవి, కృష్ణమోహన్‌.. చంద్రగిరి, కురబలకోట, కలెక్టరేట్‌, నారాయణవనం, వాల్మీకిపురం, నిమ్మనపల్లె మండలాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలోని కలికిరి, కలకడ తహసీల్దార్లు రమణి, చిన్నయ్యలు బైరెడ్డిపల్లె, కలెక్టరేట్‌లోని కేఆర్‌సీసీ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లె, సదుం తహసీల్దార్లు శేషయ్య, గుర్రప్ప తిరుపతి రూరల్‌, ఎస్‌ఆర్‌పురం మండలాల నుంచి వచ్చారు. పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లె, వి.కోట తహసీల్దార్లు రవీంద్రనాధ్‌రెడ్డి, శ్రీనివాసులు, సీకే శ్రీనివాసులు, సీతారామ్‌, రవి.. తంబళ్లపల్లె, పులిచెర్ల, పలమనేరు, బంగారుపాళ్యం, రామసముద్రం నుంచి డిప్యుటేషన్‌ మీద వచ్చారు. కుప్పం, శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లె తహసీల్దార్లు సురే్‌షబాబు, పార్వతి, పీసీ శ్రీనివాసులు, మురళీధర్‌.. శాంతిపురం, కలకడ, పెనుమూర్‌, వి.కోట నుంచి వచ్చి పనిచేస్తున్నారు.


కార్యాలయాల్లోనూ... 

కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల్లోని తహసీల్దార్‌ పోస్టులూ డిప్యుటేషన్లతో నిండిపోయాయి. తిరుపతి, మదనపల్లె ఆర్డీవో ఆఫీ్‌సల ఏవోలు సురేష్‌ బాబు, షంషీర్‌ఖార్‌.. మదనపల్లె, పుత్తూరు నుంచి డిప్యుటేషన్‌ మీద వచ్చారు. కలెక్టరేట్‌లోని బీ-సెక్షన్‌, డీ-సెక్షన్‌ సూపరింటెండెంట్లు ప్రసాద్‌ బాబు, బ్యూలాలు.. ఐరాల, చౌడేపల్లె నుంచి వచ్చారు. కలెక్టరేట్‌లోని ప్రొటోకాల్‌, కేఆర్‌సీసీ-2 తహసీల్దార్లు వెంకటపతి, శివరామ్‌.. వెదురుకుప్పం, రొంపిచెర్ల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చారు.


కలెక్టరేట్‌లో ఖాళీగా ఐదుగురు 

కలెక్టరేట్‌లో నిత్యానందబాబు, కృష్ణకుమార్‌, కుప్పయ్య, రాము, మురళి ఖాళీగా ఉన్నారు. అలాగే ములకలచెరువు తహసీల్దార్‌ మహేశ్వరి భాయ్‌ను ఖాళీగా ఉన్న ఎర్రావారిపాలెం మండలానికి బదిలీ చేశారు. రాజకీయ ఒత్తిళ్లు కారణంగా ఆమెను అక్కడ విధుల్లోకి చేర్చుకోకపోవడంతో ప్రస్తుతం మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీ్‌సలో ఖాళీగా ఉన్నారు. కలెక్టరేట్‌కు డిప్యుటేషన్‌పై మార్చిన కుప్పం తహసీల్దార్‌ కుప్పయ్యను డీఎ్‌సవో కార్యాలయంలో క్లర్కుగా నియమించారు. రామకుప్పం తహసీల్దార్‌ నిత్యానంద బాబును కలెక్టరేట్‌లోని నేషనల్‌ హైవే భూసేకరణ విభాగంలో అవసరం లేకున్నా.. అదనంగా నియమించారు. ఫ విజయపురం మండలంలో ప్రభుత్వ భూముల్ని మార్చడంలో కీలకపాత్ర పోషించిన తహసీల్దార్‌ రాముకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనాలతో ఇప్పటికే కిందిస్థాయి అధికారులు, సిబ్బంది మీద చర్యలు తీసుకున్నా.. తహసీల్దార్‌పై చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతల పేర్ల మీదున్న ప్రభుత్వ భూముల్ని వెనక్కి తీసుకున్నారు. 


ఆరు మండలాల్లో డీటీలే ఇన్‌చార్జులు 

కలెక్టరేట్‌లో ఐదుగురు, మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో ఒక సీనియర్‌ తహసీల్దార్‌ ఖాళీగా ఉన్నా.. ఆరు మండలాల్లో డిప్యూటి తహసీల్దార్లు ఇన్‌చార్జులుగా పనిచేస్తున్నారు. రేణిగుంటలో శివప్రసాద్‌, పులిచెర్లలో విజయసింహారెడ్డి, వాల్మీకిపురంలో ఫైరోజ్‌ఖాన్‌, సోమలలో శ్యాంప్రసాద్‌రెడ్డి, రొంపిచెర్లలో ముర్షావల్లి, ఎర్రావారిపాలెంలో మహేశ్వరి ఇన్‌చార్జిగా ఉన్నారు. 

Updated Date - 2021-01-02T07:34:59+05:30 IST