పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో అందుబాటులో రెండు యూనిట్లు

ABN , First Publish Date - 2022-01-22T05:27:15+05:30 IST

సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో 115 మెగావాట్ల సామర్థ్యం గల 3.4 యూనిట్లు సాంకేతిక లోపాల కారణంగా ఎల్‌సీలో ఉన్నాయని ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు తెలిపారు.

పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో అందుబాటులో రెండు యూనిట్లు

 సీలేరు కాంప్లెక్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు
మోతుగూడెం, జనవరి 21: సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో 115 మెగావాట్ల సామర్థ్యం గల 3.4 యూనిట్లు సాంకేతిక లోపాల కారణంగా ఎల్‌సీలో ఉన్నాయని ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు తెలిపారు. విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో నాలుగు యూనిట్లలో ప్రస్తుతం రెండు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. మూడు, నాలుగు యూనిట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం గోదావరి డెల్టాలకు ఫిబ్రవరి నుంచి నీటి విడుదల కోసం సీలేరు  కాంప్లెక్స్‌లోని మూడు జల విద్యుత్‌ కేంద్రాల్లో కూడా ఉత్పత్తిని నిలిపివేసి నీటిని నిల్వ ఉంచామన్నారు. ప్రస్తుతం 32 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయన్నారు. గోదావరి డెల్టా ఇరిగేషన్‌ అధికారులు రబీకి ఏ సమయంలో నీటి విడుదల అవసరమని సూచిస్తారో అప్పటివరకు విద్యుదుత్పత్తి నిలిపివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని ఎగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో ఒకటో నెంబర్‌ యూనిట్‌ మరమ్మతులు పూర్తికావడంతో అక్కడ 60 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్లు అందుబాటులోనే ఉన్నాయన్నారు. డొంకరాయి జల విద్యుత్‌ కేంద్రంలో 25 మెగావాట్ల సామర్థ్యం గల ఒక యూనిట్‌ కూడా అందుబాటులో ఉందన్నారు. ఫిబ్రవరిలో సీలేరు కాంపెక్స్‌లోని మూడు జల విద్యుత్‌ కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు చెప్పారు.

Updated Date - 2022-01-22T05:27:15+05:30 IST