తీగుల్‌ బీసీ హాస్టల్‌లో ఆరుగురికి అస్వస్థత

ABN , First Publish Date - 2022-07-02T05:22:50+05:30 IST

మండలంలోని తీగుల్‌ బీసీ బాలుర వసతి గృహంలో శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

తీగుల్‌ బీసీ హాస్టల్‌లో ఆరుగురికి అస్వస్థత

జగదేవ్‌పూర్‌, జూలై 1 : మండలంలోని తీగుల్‌ బీసీ బాలుర వసతి గృహంలో శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ వసతి గృహంలో 6 నుంచి 10వతరగతి వరకు 28 మంది విద్యార్థులు ఉన్నారు. ఉదయం 8:30 గంటలకు రోజువారి దినచర్యలో భాగంగా వారికి దొడ్డు అటుకులు అల్పాహారంగా అందించారు. వాటిని తిన్న ఆరుగురు విద్యార్థులు అరగంటలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వెంటనే హాస్టల్‌ కుక్‌ వారిని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రానికి తరలించారు. అస్వస్థతకు గురైన 6,7వ తరగతికి చెందిన కార్తీక్‌, అరవింద్‌, అభిమన్యు, కేశవ్‌కు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ నివేదిత మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటున్నారు. మరో ఇద్దరు సాత్విక్‌, భానులకు ఓఆర్‌ఎస్‌ ద్రావణం అందించడంతో వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. విషయం తెలుసుకున్న మండల ప్రత్యేక అధికారిని, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిని సరోజ, ఎంపీడీవో శ్రీనివాస్‌వర్మ, ఎంఈవో ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ బాలేశంగౌడ్‌, సర్పంచ్‌ భానుప్రకాష్‌రావు ఆరోగ్య కేంద్రానికి చేరకుని విద్యార్థులు ఆరోగ్యంపై వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. అల్పాహారంలో ఎలాంటి ఫుడ్‌ పాయిజన్‌ జరగలేదని ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిని సరోజ, పీహెచ్‌సీ డాక్టర్‌ నివేదిత వెల్లడించారు. 

Updated Date - 2022-07-02T05:22:50+05:30 IST