సోషల్‌మీడియా వార్‌

ABN , First Publish Date - 2022-05-29T04:49:44+05:30 IST

అందోల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ అనుచురులు సోషల్‌మీడియా వేదికగా బాహాబాహీకి దిగుతూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ అభిమానులు చేస్తున్న సోషల్‌ వార్‌ చర్చనీయాంశంగా మారుతున్నది.

సోషల్‌మీడియా వార్‌

అందోలు నియోజకవర్గంలో ఫేస్‌బుక్‌, వాట్సా్‌పలలో పోటాపోటీగా పోస్టులు

దామోదర్‌, క్రాంతి సేనల జోరు

బాబూమోహన్‌ వర్గీయుల మౌనం

హద్దులు దాటుతున్న కామెంట్లు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి /జోగిపేట, మే 28 : అందోల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ అనుచురులు సోషల్‌మీడియా వేదికగా బాహాబాహీకి దిగుతూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ అభిమానులు చేస్తున్న సోషల్‌ వార్‌ చర్చనీయాంశంగా మారుతున్నది. గత ఎన్నికల నుంచి పరస్పరం ట్రోలింగ్‌(ప్రత్యర్థి చేసిన పనిని అదేపనిగా విమర్శిస్తూ, వెక్కిరిస్తూ పెట్టే పోస్టులు) చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి అనుచరుల పోస్టులు గత రెండు మాసాలుగా పరాకాష్ఠకు చేరాయి.


ఒకరిపై ఒకరు సోషల్‌ పోస్టులు

క్రాంతి వర్సెస్‌ దామోదర్‌గా ఈ సోషల్‌ వార్‌ నడుస్తోంది. మొదట్లో కేవలం తమ నేతల గొప్పతనాన్ని చాటిన వారి అనుయాయులు, మెల్లిగా ప్రత్యర్థి నాయకులను విమర్శించడం ప్రారంభించారు. ప్రస్తుతం పోటాపోటీగా పోస్టులతో పాటు తమ నేతల వైపు నుంచి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. క్రాంతిసేన రెండు నెలలుగా దామోదర్‌ను తమ టార్గెట్‌గా ఎంచుకున్నారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య విమర్శల జోరు పెరిగింది. గణాంకాలు, తేదీలతో కూడిన సమగ్ర సమాచారంతో విమర్శించడం, ట్రోల్‌ చేయడం మొదలైంది. ఎమ్మెల్యేగా గెలిచిన మూడు సంవత్సరాల కాలంలో క్రాంతికిరణ్‌ ఏమీ అభివృద్ధి చేయలేదని, స్థానికత అంటే ఇదేనా.. లోకల్‌ నాయకుడంటే ఇంతేనా అంటూ..దామోదర్‌ అనుచరులు కామెంట్లు పెడ్తున్నారు. అయితే, వాటిని క్రాంతిసేన సభ్యులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే.... దామోదర్‌ వ్యవహార శైలి, ఆయన పాలన, నెరవేర్చని హామీలు, తదితరాలపై క్రాంతిసేన సభ్యులు కామెంట్లు చేస్తున్నారు. అయితే వాటికి కాంగ్రె్‌సలోని యువత దీటుగా స్పందించి, కౌంటర్లు ఇస్తున్నారు. ఏకంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌ చేసి పోస్టులను పెడ్తున్నారు. మధ్యమధ్యలో క్రాంతికిరణ్‌పై కౌంటర్లు ఇవ్వసాగారు.  జేఎన్ట్టీయూ భవనాలు, సింగూరు కాల్వల నిర్మాణంలో దామోదర అవినీతికి పాల్పడ్డారంటూ క్రాంతిసేన సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. దమ్ముంటే మీరు నిరూపించండి అంటూ ఇరు వర్గాల వారు సవాళ్లు విసురుకుంటున్నారు. 

రాత్రి పది దాటితే చాలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో వీరి కామెంట్ల జోరు చిన్న చినుకులా ప్రారంభమై, జడివానగా మారి ఏ అర్ధరాత్రో ముగుస్తోంది. వీటిని గమనిస్తున్న రాజకీయ ఆసక్తి గల ఫేస్‌బుక్‌ సభ్యులకు కావలిసినంత వినోదాన్ని అందిస్తూ, అలాగే ఇబ్బందిని కూడా కలిగిస్తోంది. ఈ సంగతులు క్రాంతికిరణ్‌, దామోదర్‌లకు తెలుసో తెలియదో అని ప్రజలు సందేహంలో ఉన్నారు. క్రాంతికిరణ్‌ తరఫున క్రాంతిసేన అఫీషియల్‌, క్రాంతికిరణ్‌ సైన్యం, టీఆర్‌ఎస్‌ అఫీషియల్‌, దామోదర్‌కు మద్దతుగాసీడీఆర్‌, కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా, దామన్న సైన్యం, బాబుమోహన్‌ అనుయాయులు బాబూమోహన్‌ యువసేన పేరిట రూపొందించిన ఫేస్‌బుక్‌ అకౌంట్లులతోపాటు మరెన్నో అకౌంట్లున్నాయి. 


పెద్దగా స్పందన లేని బాబూమోహన్‌ వర్గం

సోషల్‌వార్‌లో దామోదర్‌, క్రాంతిసేన వర్గాలు జోరుగా స్పందిస్తుండగా బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌ వర్గం నుంచి అంతగా స్పందన ఉండడంలేదు. మొదట్లో క్రాంతిసేన సభ్యులతో కొద్దిగా కామెంట్ల యుద్ధం చేసినా, ఒకరిద్దరు మినహా బాబూమోహన్‌ వర్గం ఈ సోషల్‌ వార్‌లో తలదూర్చడం లేదు. 

Updated Date - 2022-05-29T04:49:44+05:30 IST