ముగిసిన మెగా మీటింగ్‌

ABN , First Publish Date - 2021-11-15T07:50:11+05:30 IST

మెగా ఈవెంట్‌ అయిన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం చివరకు చప్పగా ముగిసింది.

ముగిసిన మెగా మీటింగ్‌

జిల్లాకు సంబంధించిన కీలక అంశాల ప్రస్తావన


తిరుపతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంతో పాటు జిల్లా చరిత్రలో నిలిచిపోదగ్గ మెగా ఈవెంట్‌ అయిన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం చివరకు చప్పగా ముగిసింది. దీనికోసం ఆతిధ్య రాష్ట్రంగా రాష్ట్రప్రభుత్వం  భారీ ఎత్తున వ్యయం చేసింది. కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అత్యున్నతాధికారులు, ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాలకు చెందిన ఇద్దరేసి మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు పాల్గొంటున్నందున వారికి తిరుపతిలో వసతి, రవాణా సదుపాయాల కోసం పెద్ద ఎత్తున నిధులు వ్యయం చేసింది.జిల్లా యంత్రాంగం గత పదిరోజులుగా ఏర్పాట్లలో తలమునకలైంది. సమావేశంలో తెలుగుగంగ బకాయిలు, కుప్పంలో పాలారు ప్రాజెక్టుకు అనుమతి వంటి జిల్లాకు సంబంధించిన కీలక అంశాలను సీఎం జగన్‌ ప్రస్తావించారు. తెలుగుగంగ కాలువ ద్వారా కృష్ణా జలాలు చిత్తూరు జిల్లా మీదుగానే తమిళనాడు చేరుతున్నాయి. ఈ నీటిని చెన్నై నగరవాసుల దాహార్తి తీర్చేందుకు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. నీటి పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులను తమిళనాడు ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సివుంది. అయితే పదేళ్ళుగా తమిళనాడు నుంచీ అందాల్సిన రూ. 338.48 కోట్లు రావడం లేదు.అలాగే కుప్పం నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు అందించగల పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి చాలాకాలంగా తమిళనాడు అడ్డుపడుతున్న విషయం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. చెన్నై తాగునీటి అవసరాల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఏటా పది టీఎంసీల కృష్ణా జలాలను తమిళనాడుకు సరఫరా చేస్తున్న నేపధ్యంలో కుప్పంలో పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి ఆ రాష్ట్రం అభ్యంతర పెట్టడం సమంజసం కాదని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ అంశాలపై స్పందించాల్సింది తమిళనాడు. అయితే సమావేశానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ హాజరు కాలేదు. స్టాలిన్‌ తొలిసారి సీఎం పదవిని అధిష్టించిన నేపధ్యంలోనూ, ఆయన వ్యవహారశైలి పలువురి మన్ననలు పొందుతున్న క్రమంలోనూ పాలారు ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా స్పందించేవారన్న ఆశాభావం జిల్లావాసుల్లో వుంది.అయితే ఆయన గైర్హాజరుతో ఇవన్నీ మళ్ళీ మరుగునపడిపోయినట్టే. మరోవైపు తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులు కూడా రాలేదు.వీరిద్దరూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేక వైఖరి కలిగివున్నందున సమావేశానికి వచ్చివుంటే వాడివేడి ఆరోపణలు, ఫిర్యాదులూ చేసివుండేవారన్న అభిప్రాయం జిల్లావాసుల్లో వుంది. ఇవేవీ జరగకపోవడంతో సమావేశం చప్పగా ముగిసిపోయినట్టయింది. 

Updated Date - 2021-11-15T07:50:11+05:30 IST