చంద్రబాబు పర్యటనకు విశేష ఆదరణ

ABN , First Publish Date - 2021-10-31T07:31:39+05:30 IST

కుప్పంలో చంద్రబాబు పర్యటనకు విశేష స్పందన లభించింది.

చంద్రబాబు పర్యటనకు విశేష ఆదరణ

టీడీపీలో పెరిగిన జోష్‌


చిత్తూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో చంద్రబాబు పర్యటనకు విశేష స్పందన లభించింది. జిల్లానుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా టీడీపీ నాయకులు వచ్చి చంద్రబాబును కలిశారు. రోడ్‌షోలో పాల్గొన్నారు. శుక్రవారం కుప్పం బస్టాండు వద్ద నిర్వహించిన సభకు గతంలో ఎప్పుడూ లభించనంత స్పందన వచ్చిన విషయం తెలిసిందే. రెండో రోజైన శనివారం కూడా మున్సిపాలిటీ పరిధిలో పర్యటనకు విశేష స్పందన లభించింది. తొలిరోజు అర్ధరాత్రి 12.30 గంటల దాకా కుప్పం వీధుల్లో పర్యటించిన చంద్రబాబు రెండో రోజూ అదే జోష్‌ను కొనసాగించారు. సుమారు వంద వాహనాలతో ఆయన కాన్వాయ్‌ ముందుకు సాగింది. తొలి రోజు భద్రత సరిగా లేదని చంద్రబాబు చెప్పడంతో శనివారం వందమందికి పైగా పోలీసులతో అధికారులు భారీ భద్రతను ఏర్పాటుచేశారు.శుక్ర, శనివారాల్లో రాత్రిళ్లు బస్సులోనే బస చేశారు. ఆదివారం ఉదయం తిరుగుపయనమవుతారు.


నాయకులతో భేటీ

శనివారం ఉదయం ఆర్‌ అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మున్సిపాలిటీ నాయకులతో, ఆశావహులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని, మ్యానిఫెస్టోను కూడా విడుదల చేద్దామని చెప్పారు. పోటీ ఎక్కువ ఉండడంతో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. అనంతరం జిల్లాలోని బీసీ నాయకులతో సమావేశమయ్యారు. బీసీలు వెంట ఉండి టీడీపీకి పూర్వ వైభవం తేవాలని సూచించారు. అంతకుముందు కుప్పం టౌన్‌,రూరల్‌ సీలు సాదిక్‌ అలీ, యతీంద్రలను బస్సులోకి పిలిపించుకుని మున్సిపల్‌ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. ఉదయం 11 గంటలకు గెస్ట్‌హౌసు నుంచి బయటికి వచ్చి సమీపంలోని లక్ష్మీపురానికి వెళ్లి వరదరాజులస్వామి ఆలయంలోకి వెళ్లారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం లక్ష్మీపురంలో ప్రసంగించారు. అక్కడి నుంచి ప్రకాశం రోడ్డులోని ఆర్‌ఎస్‌పేట మసీదుకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో సమావేశమయ్యారు. టీడీపీ హయాంలో ముస్లిం కుటుంబాలకు మేలు జరిగిందని.. ఇప్పుడు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని చంద్రబాబుతో ముస్లింలు వాపోయారు. మసీదు సమీపంలోనే బస్సులో మధ్యాహ్న భోజనం చేశారు. అక్కడ్నుంచి సామగుట్టపల్లె, చీగలపల్లె, కమతమూరు, రాజీవ్‌కాలనీ, పరమసముద్రం, డీకేపల్లె, ఎన్టీఆర్‌ కాలనీ, అర్బన్‌ కాలనీ, ప్యాలెస్‌ రోడ్డు, డీసీసీబీ బ్యాంకు సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి వరకు పర్యటించారు.వంద పడకల ఆస్పత్రి సర్కిల్‌ వద్ద బోయకొండ ఆలయ మాజీ ఛైర్మన్‌ ఎస్‌కే రమణారెడ్డి క్రేన్‌ సాయంతో గజమాలతో చంద్రబాబును సత్కరించారు.


ఇంటింటి ప్రచారంలో భావోద్వేగం

చంద్రబాబు 1989లో కుప్పం ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. అప్పట్లో ఆయన  ఇంటింటి ప్రచారం చేసేవారు.తర్వాతి కాలంలో బహిరంగ సభలకు, రోడ్‌షోలకు పరిమితమైన ఆయన శనివారం ఇంటింటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడారు. లక్ష్మీపురం, విజయలక్ష్మి రోడ్డు, కమతమూరు, ప్రకాశం రోడ్డు, గాండ్లవీవీధుల్లో నడిచారు. సుమారు 50 కుటుంబాల వద్దకు వెళ్లి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు.కొందరు ఆయన్ను ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. 


శ్రేణుల్లో నిండిన నూతనోత్సాహం

చంద్రబాబు  పర్యటనతో  కుప్పం టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. మున్సిపల్‌ ఎన్నికలకు ముందు ఆయన పర్యటన ఎన్నికల సరళిని మార్చనుంది. వైసీపీ నేతల తీరుతో డస్సిపోయిన కార్యకర్తల్లో చంద్రబాబు ఉత్సాహాన్ని నింపారు. మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. అందరికీ న్యాయం చేస్తామంటూ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.





Updated Date - 2021-10-31T07:31:39+05:30 IST