డిసెంబరు నెలాఖరుకు శ్రీనివాస సేతు పూర్తి

ABN , First Publish Date - 2022-09-24T07:26:52+05:30 IST

తిరుపతిలోని శ్రీనివాససేతు నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నెలాఖరుకు పూర్తిచేసి 2023 జనవరి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

డిసెంబరు నెలాఖరుకు శ్రీనివాస సేతు పూర్తి

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి


తిరుమల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని శ్రీనివాససేతు నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నెలాఖరుకు పూర్తిచేసి 2023 జనవరి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీనివాససేతు మొదటిదశను నాలుగు నెలల ముందే తిరుపతి నగర ప్రజలకు, భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రారంభించామన్నారు. ఈనెల 27న కరకంబాడి వైపునుంచి వాసవీభవన్‌ వరకు నిర్మించిన రెండో దశ ఫ్లైఓవర్‌ను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి.. శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించి, మరుసటిరోజు 28వ తేదీన ఉదయం నూతన పరకామణి భవనాన్ని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన నూతన అతిథి గృహాన్ని ప్రారంభిస్తారన్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాలు, దర్శనం, లడ్డూప్రసాదాలు అందేలా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పుకొచ్చారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో స్వయంగా వచ్చిన ప్రముఖులకు మాత్రమే వీఐపీ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-24T07:26:52+05:30 IST