క్షణికావేశం..బతుకు శూన్యం

ABN , First Publish Date - 2020-12-01T05:44:10+05:30 IST

క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాల ఫలితంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వారి పిల్లలు అనాథలవుతున్నారు.

క్షణికావేశం..బతుకు శూన్యం

ఒత్తిడి తట్టుకోలేక పెరుగుతున్న ఆత్మహత్యలు

రోడ్డున పడుతున్న కుటుంబాలు

అనాథలవుతున్న పిల్లలు

ఆత్మహత్యల్లో పురుషులే అధికం


తమ్ముడూ నేను చనిపోతున్నా అంటూ ఫోన్‌ చేసి మంజీరా నదిలో ఈనెల 26వ తేదీన  దూకి ఆత్మహత్యకు పాల్పడింది సంగారెడ్డిలోని రైతు శిక్షణా కేంద్రంలో పని చేస్తున్న వ్యవసాయ అఽధికారిణి అరుణ. గల్లంతైన ఆమె ఆచూకీ కోసం నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం ఉదయం    మృతదేహం లభ్యమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మూడు, నాలుగు నెలల నుంచి ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఒత్తిడికి లోనవుతున్నట్టు ఆమె తోటి ఉద్యోగుల ద్వారా తెలుస్తోంది. ఆమె నిర్ణయంతో ఇద్దరు పిల్లలు అమ్మలేని వారయ్యారు.

హత్నూర మండలం దౌల్తాబాద్‌లో పూజిత (24) (ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది) అత్తింటి వారి వేధింపులు భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు నాలుగేళ్ల కూతురు, ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. 

అందోల్‌ మండలం డాకూరులో భాను (25)  ఐదు నెలల బాలింత ఉరి వేసుకొని తనువు  చాలించింది. ఈ ఘటనలన్నీ కేవలం నవంబరు నెలలో చోటు చేసుకున్నవి 


సంగారెడ్డి క్రైం, నవంబరు 30 : భార్య కాపురానికి రాలేదని భర్త.... టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనే మనస్తాపంతో విద్యార్థులు.. అత్తామామలు, భర్త వేధింపులకు గురిచేస్తున్నారంటూ వివాహిత.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమికులు.. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా గృహిణి... ఇలా పలు కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాల ఫలితంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వారి పిల్లలు అనాథలవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలన్నీ క్షణికావేశంలోనే తీసుకుంటున్న నిర్ణయాలుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఏటా ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే వుంది. పని ఒత్తిడి, పరిమితి లేని కోర్కెలు, చిన్న విషయానికే ఆవేశ పడటం, మనస్తాపానికి గురికావడం, ప్రేమానురాగాలను పొందకపోవడం, ఆత్మీయులను కోల్పోవడం, కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులు, అనారోగ్యం, తీవ్ర అప్పులు, ఆస్తినష్టం, ఆర్థిక సమస్యలే ఆత్మహత్యను ప్రేరేపిస్తున్నాయి. 


పురుషులే అధికం

అన్ని రంగాల్లో మహిళలపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న పురుషులు మాత్రం సమస్యలను ఎదుర్కోలేక చిన్న కష్టానికే కృంగిపోతున్నారు. ఫలితంగా ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళల కంటే పురుషులే అందులోనూ యుక్త వయస్కులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ముఖ్యంగా వివాహితుల్లో భార్యల కంటే భర్తలే రెట్టింపు సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సహనానికి మారుపేరైన మహిళలు కష్టాల్లోనూ అంతే మనోనిబ్బరాన్ని కలిగి వుంటున్నారు. క్లిష్టమైన సమస్యలను కూడా ఎదుర్కొంటూ మానసిక స్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. మహిళలు అబలలు కాదు సబలలంటూ జీవనయానంలో ముందుకు సాగుతున్నారు. రెండేళ్ల కాలంలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఆత్మహత్యలకు పరిశీలించినట్లయితే 2019 సంవత్సరంలో 224, 2020 (నవంబర్‌ వరకు)లో 170లో చోటుచేసుకున్నాయి. 2019లో పురుషులు 168, మహిళలు 56 మంది ఉన్నారు. 2020 సంవత్సరంలో పురుషులు 129 కాగా, మహిళలు 41 ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 


ఆ ఒక్క క్షణంలో

తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడే సమయంలో తమ కుటుంబ సభ్యులను గుర్తు తెచ్చుకోవడం, తమ బిడ్డల భవిష్యత్తును, జీవితాంతం కష్ట సుఖాల్లో కలకాలం కలిసి వుంటామని అగ్నిసాక్షిగా చేసుకున్న ప్రమాణాలను గుర్తుకు తెచ్చుకోవడం వంటివి చేయాలి. అలాగే కుటుంబంలో ఎరైనా ఒకరు ఒత్తిడికి గురవుతున్నట్టు తెలిస్తే వెంటనే మానసిక నిపుణుడిని సంప్రదించాలి. అంతేగాకవారి ఒంటిరిగా వుండకుండా నలుగురితో కలిసి వుండే విధంగా చూడాలి. సమస్యల పరిష్కారానికి ఆత్మహత్య ఒక్కటే మార్గం కాదని, సమస్యలను ఎదుర్కోవడానికి సరైన చేయూతనిస్తూ వారికి అండగా నిలువాలి. జీవితం ఎంతో విశాలమైందని, ఒకసారి ఓటమి చెందితే నిరాశ పడకుండా భవిష్యత్‌ కోసం ముందుకు సాగాల్సిన అవసరం వుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. 

Updated Date - 2020-12-01T05:44:10+05:30 IST