సూపర్‌ సిద్దిపేట

ABN , First Publish Date - 2021-10-12T04:40:09+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని జిల్లాలాగే సిద్దిపేట జిల్లా ప్రారంభమైదని, కానీ ప్రస్తుతం దేశం చూపు తనవైపు తిప్పుకునేలా అభివృద్ధి చెంది ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ఒకింత గర్వంగా ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్దేశం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మార్గదర్శనంలో ఐదేళ్లల్లో అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా సిద్దిపేటను నిలిపామని తెలిపారు. సిద్దిపేట జిల్లా ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు.

సూపర్‌ సిద్దిపేట
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి

దేశం చూపు ఇటువైపు తిప్పుకునేలా జిల్లా అభివృద్ధి

ముఖ్యమంత్రి నిర్దేశం, మంత్రి మార్గదర్శనంలో ఐదేళ్లల్లో ఆదర్శంగా

రికార్డు సమయంలో భూసేకరణ, ప్రాజెక్ట్‌ల నిర్మాణం 

సకల హంగులతో ఆర్‌అండ్‌ఆర్‌ మోడల్‌ కాలనీలను నిర్మించాం 

సిద్దిపేట అధికారి అని గర్వంగా చెప్పుకునేలా చేశాం : కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి


సిద్దిపేట సిటీ, అక్టోబరు 11 : కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని జిల్లాలాగే సిద్దిపేట జిల్లా ప్రారంభమైదని, కానీ ప్రస్తుతం దేశం చూపు తనవైపు తిప్పుకునేలా అభివృద్ధి చెంది ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ఒకింత గర్వంగా ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్దేశం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మార్గదర్శనంలో ఐదేళ్లల్లో అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా సిద్దిపేటను నిలిపామని తెలిపారు. సిద్దిపేట జిల్లా ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, పథకాలను ప్రభావవంతంగా అమలు చేసి ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు సాధించగలిగారన్నారు. సమష్టి కృషితోనే అనేక అంశాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రానికే కాకుండా దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. సిద్దిపేట అధికారి అని గర్వంగా చెప్పుకునేలా చేశామని కలెక్టర్‌ తెలిపారు.


మిషన్‌ మోడ్‌లో భూ సేకరణ, ప్రాజెక్టుల నిర్మాణం

దేశంలోనే 718 జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా కొత్త భూసేకరణ చట్టంతో... ఏ జిల్లాలో లేనంత వేగంగా భూసేకరణను నిర్వహించి ప్రాజెక్టులను పూర్తి చేయగలిగామని తెలిపారు. అప్పటి డీఆర్వో చంద్రశేఖర్‌, సంయుక్త కలెక్టర్‌ పద్మాకర్‌, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు భూ సేకరణలో విశేష కృషి చేశారని గుర్తుచేశారు. అందరి సహకారంతో శ్రమించి సుమారు రూ.5 వేల కోట్లతో దాదాపు 50 వేల ఎకరాలను అవకతవకలు లేకుండా, అవినీతి మాటే వినబడకుండా ఒక నమూనాగా భూసేకరణ చేశామన్నారు. భూసేకరణ విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకారం అందించిన స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా నిర్వాసిత రైతులకు కలెక్టర్‌ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అధికారుల సమష్టి కృషి, సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు.


జీహెచ్‌ఎంసీ తర్వాత మనమే నంబర్‌ వన్‌

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తర్వాత సిద్దిపేట జిల్లానే నంబర్‌ వన్‌గా నిలిచిందని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి తెలిపారు. జిల్లాలోని 278 గ్రామాల్లో డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించామని తెలియజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం, కాంట్రిబ్యూషన్‌ హౌసింగ్‌ నిర్మాణంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని హంగులు, సౌకర్యాలతో మైలురాయిలా నిలిచే అభివృద్ధిని సాధించామని కలెక్టర్‌ పేర్కొన్నారు. అనేక జిల్లాలు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణానికి నెలల కొద్ది సమయం తీసుకుంటే పకడ్బందీ కార్యాచరణతో 40 రోజుల్లోనే సిద్దిపేట జిల్లాలో 24 వేల మరుగుదొడ్లను నిర్మించామని తెలియజేశారు. సిద్దిపేట జిల్లా ‘ధరణి’లోనూ ముందున్నదని, భూ సమస్యల పరిష్కారానికి వేగవంతమైన పరిష్కారం చూపే దిశగా క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారని తెలిపారు.


ఐఏఎస్‌, ఐసీఎ్‌సలకు అధ్యయన కేంద్రంగా జిల్లా

అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అటవీ పునరుద్ధరణ కార్యక్రమాల అధ్యయనానికి సిద్దిపేట జిల్లా కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్‌ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు క్షేత్రస్థాయి అధ్యయనానికి రావడం 50 ఏళ్లలో ఇదే తొలిసారి అని కలెక్టర్‌ పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు, రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం జిల్లాలో జరిగిన పురోగతిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారని గుర్తుచేశారు.

నూతనంగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాలో ఐదేళ్ల పాటు పని చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రి హరీశ్‌రావుకు కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లా టీమ్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను సైతం తనకు ఇచ్చారన్నారు. ప్రభుత్వ నిర్ధేశిత లక్ష్యాల సాధనలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, ట్రెయినీ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, జిల్లా రెవెన్యూ అధికారి బి.చెన్నయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-12T04:40:09+05:30 IST