సిజేరియన్ల కట్టడి

ABN , First Publish Date - 2022-05-22T05:05:56+05:30 IST

సంగారెడ్డి జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కువ సంఖ్యలో సిజేరియన్‌ ఆపరేషన్లనే చేస్తున్నారు. అవసరం లేకున్నా చేస్తున్న సిజేరియన్‌ ఆపరేషన్లను అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

సిజేరియన్ల కట్టడి
సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు

 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆపరేషన్లపై నిఘా

 జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు

 ప్రతీ నెల శస్త్రచికిత్సలపై ఆడిట్‌

 ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆరా

 సరైన కారణం లేకుండా చేస్తే చర్యలు 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మే 21: ‘అన్ని ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలనే నిర్వహించాలి. ఇందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది మొదటి నుంచి గర్భిణులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వడమే గాకుండా నార్మల్‌ డెలివరీ జరిగేలా చిన్న చిన్న ఎక్సర్‌ సైజులు చేయించాలి. నార్మల్‌ డెలివరీలు జరిగితే తల్లి ఆరోగ్యంగానే ఉంటుంది. దీన్ని గమనంలోకి తీసుకోవాలి.’ ఇది ప్రభుత్వ పెద్దల మాట. అయితే ఆచరణలోకి వచ్చే సరికి సంగారెడ్డి జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కువ సంఖ్యలో సిజేరియన్‌ ఆపరేషన్లనే చేస్తున్నారు. అవసరం లేకున్నా చేస్తున్న సిజేరియన్‌ ఆపరేషన్లను అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఎందుకు చేయాల్సి వస్తుందో ఆరా తీయనున్నది. సరైన కారణం లేకుండా సిజేరియన్‌ చేసినట్టు తేలితే ఆ ఆస్పత్రిపై చర్యలు తీసుకోనున్నారు. 


సర్కారు ఆస్పత్రుల్లో


సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రితో పాటు జోగిపేట, నారాయణఖేడ్‌, పటాన్‌చెరు, జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రులు, సదాశివపేట కమ్యూనిటీ ఆస్పత్రులున్నాయి. వీటిలో సాధారణ ప్రసవాలే ఎక్కువగా జరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆయా ఆస్పత్రుల్లో 8,499 సాధారణ ప్రసవాలు జరగగా, 5,735 సిజేరియన్లు నిర్వహించారు. ఈ ఆపరేషన్లను కూడా తప్పని పరిస్థితుల్లో తల్లీ బిడ్డను కాపాడేందుకు చేసినవేనని వైద్యాధికారులు తెలిపారు. అలాగే గత ఏప్రిల్‌ నెలలో ఆయా ఆస్పత్రుల్లో 687 సాధారణ ప్రజవాలు జరగగా సగానికిపైగా 491 సిజేరియన్లు చేశారు.


పీహెచ్‌సీలలో ఈ విధంగా


జిల్లాలో ఉన్న 31 పీహెచ్‌సీలల్లో అన్నీ సాధారణ ప్రసవాలే జరుగుతున్నాయి. వీటిలో సిజేరియన్లు చేసే పరిస్థతులు లేవు. సిజేరియన్‌ చేయాలంటే గైనకాలజిస్ట్‌, పీడియాట్రిషియన్‌, స్కానింగ్‌ యంత్రం, రక్తనిధి కేంద్రం ఉండాలి. పీహెచ్‌సీలల్లో ఆయా సౌకర్యాలు లేని కారణంగా సిజేరియన్లు నిర్వహించడం లేదు. సిజేరియన్‌ చేసే పరిస్థితులు ఉన్నట్టు ముందే గుర్తిస్తే గర్భిణులను సమీపంలోని ఏరియా ఆస్పత్రికి పంపిస్తున్నారు. కాగా పీహెచ్‌సీలలో పరీక్షలు చేయించుకునే గర్భిణులకు అంగన్‌వాడీల ద్వారా అవసరమైన పౌష్ఠికాహారాన్ని అందజేస్తున్నారు. అంతేగాక నార్మల్‌ డెలివరీ జరిగేందుకు ఎలాంటి పద్ధతులు అనుసరించాలనే అంశాలను వైద్య సిబ్బంది వివరిస్తున్నారు. అందుకే గత ఆర్థిక సంవత్సరంలో పీహెచ్‌సీలలో 3,010 మంది గర్భిణులకు నార్మల్‌ డెలివరీలే జరిగాయి. గత ఏప్రిల్‌ నెలలోనైతే పీహెచ్‌సీలలో 220 నార్మల్‌ డెలివరీలు జరిగినట్టు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. 


ప్రైవేట్‌లో సిజేరియన్లే ఎక్కువ


ఇక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కువ సంఖ్యలో సిజేరియన్‌ ప్రసవాలే జరుగుతున్నాయి. గత సంవత్సరం మొత్తం మీద జిల్లాలోని అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కలిపి 1,437 సాధారణ ప్రసవాలు జరగగా, రికార్డుస్థాయిలో 5,197 సిజేరియన్లు చేశారు. అలాగే ఏప్రిల్‌ నెలలో 94 నార్మల్‌ డెలివరీలుండగా, 419 సిజేరియన్లు నిర్వహించారు. తొమ్మిది నెలలు నిండిన గర్భిణులకు నొప్పులు రాకపోవడం, ఒకవేళ నొప్పులు వచ్చినా ప్రసవ వేదనను భరించలేకపోవడం వంటి కారణాలతో ప్రైవేట్‌ ఆస్పత్రులలో సిజేరియన్లు జరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కొన్ని పరిస్థితుల్లో గర్భిణుల తల్లిదండ్రులే సిజేరియన్లు చేయాలని ప్రైవేట్‌ ఆస్పత్రుల డాక్టర్లను కోరుతున్నారని ఆయా వర్గాలు తెలిపాయి. ఈ ఆపరేషన్లతో ఆర్థికంగా కూడా కలిసి వస్తుందని ప్రైవేట్‌ ఆస్పత్రుల డాక్టర్లు సిజేరియన్లు చేస్తున్నారు.


సిజేరియన్లపై కమిటీ


ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా జరుగుతున్న  సిజేరియన్లను అరికట్టేందుకు జిల్లా స్థాయి కమిటీని నియమించినట్లు జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి గాయత్రిదేవి తెలిపారు. ఈ కమిటీలో ఎంసీహెచ్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో, డీపీహెచ్‌ఎన్‌వో సభ్యులుగా ఉంటారని ఆమె తెలియజేశారు. ప్రతీ నెల సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్న ప్రైవేట్‌ ఆస్పత్రికి ఈ కమిటీ వెళ్లి సి-సెక్షన్‌ ఆడిట్‌ నిర్వహిస్తుందని వెల్లడించారు. సిజేరియన్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈ కమిటీ ఆరా తీస్తుందని తెలిపారు. సరైన కారణం లేకుండా సిజేరియన్‌ చేసినట్టు తేలితే ఉన్నాతాధికారుల ఆదేశం మేరకు చర్యలు ఉంటాయని డాక్టర్‌ గాయత్రిదేవి వెల్లడించారు. అయితే ప్రతీ మూడు నెలలకోసారి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, సాధారణ ప్రసవాలే ప్రోత్సహించాలని ప్రైవేట్‌ నర్సింగ్‌ హోం డాక్టర్లకు సూచనలు ఇస్తున్నామని డాక్టర్‌ గాయత్రిదేవి తెలిపారు.  


 

Updated Date - 2022-05-22T05:05:56+05:30 IST