నిరసన గళం!

ABN , First Publish Date - 2021-01-22T05:16:47+05:30 IST

టీడీపీ సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు అరెస్టు ఘటనపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గురువారం జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఎక్కడికక్కడ మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్దఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలంతా రాజాం చేరుకుని.. ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. ముందుగా కళా వెంకటరావును పరామర్శించి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

నిరసన గళం!
రాజాంలో మానవహారంగా ఏర్పడిన టీడీపీ నేతలు

కళా అరెస్టుపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు

జిల్లావ్యాప్తంగా మానవహారాలు, ర్యాలీలు

ఆందోళనలతో దద్దరిల్లిన రాజాం

కళా వెంకటరావుకు పరామర్శల వెల్లువ

(రాజాం/రూరల్‌, జనవరి 21)

టీడీపీ సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు అరెస్టు ఘటనపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గురువారం జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఎక్కడికక్కడ మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్దఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలంతా రాజాం చేరుకుని.. ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. ముందుగా కళా వెంకటరావును పరామర్శించి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్‌, విజయనగరం పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌ నాయుడు సారధ్యంలో కళా వెంకటరావు ఇంటి నుంచి అంబేద్కర్‌ కూడలి వరకూ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ కూడలిని దిగ్బంధించారు. మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 30 నిమిషాల పాటు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్‌   విమర్శించారు. ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, టీడీపీ  నాయకులను లక్ష్యంగా పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విజయనగరం జిల్లా లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ పతనం ఖాయమని, ప్రజలు పోరుబాటకు శ్రీకారం చుట్టారని శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూన రవికుమార్‌ స్పష్టం చేశారు. రాముడి సాక్షిగా, రామతీర్థాల సాక్షిగా జగన్‌ ప్రభుత్వాన్ని పతనం చేసేందుకు రాష్ట్ర ప్రజలు రోడ్డెక్కుతున్నారని పేర్కొన్నారు. ఇంత అరాచకపాలనను  ఎన్నడూ చూడలేదని టీడీపీ సీనియర్‌ నేత కిమిడి రామకృష్టంనాయుడు వెల్లడించారు. తాము కేసులకు భయపడే పరిస్థితి లేదని, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు నాయుడు పేర్కొన్నారు. కడప సంస్కృతి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోందని అశోక్‌ గజపతిరాజు కుమార్తె అతిధి గజపతిరాజు వ్యాఖ్యానించారు. పార్టీ సీనియర్‌ నాయకులను పథకం ప్రకారం అరెస్ట్‌ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కళాను కలిసిన వారిలో.. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్‌.నాయుడు (గణబాబు), అనకాపల్లి ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు, మాజీ మంత్రులు గుండ అప్పలసూర్యనారాయణ, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, బంజ్‌దేవ్‌, మీసాల గీత, కోళ్ల లలితకుమారి, బొబ్బిలి చిరంజీవులు, పల్లా శ్రీనివాసరావు, కావలి గ్రీష్మాప్రసాద్‌, తెలుగురైతు అధ్యక్షులు డి.వెంకటనాయుడు తదితరులు ఉన్నారు.  


చట్టానికి అందరూ సమానమే 

విజయనగరం ఎస్పీ రాజకుమారి 

విజయనగరం క్రైం, జనవరి 21: చట్టం ముందు అందరూ సమానమేనని... చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజయనగరం ఎస్పీ రాజకుమారి బుధవారం అర్ధరాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌లో ఈ నెల 2న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ నిమిత్తం మాజీ మంత్రి కళా వెంకటరావును హాజరు కావాల్సిందిగా పోలీసులు పలు పర్యాయాలు కోరారు. కానీ కళా వెంకటరావు స్పందించ లేదు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో భాగంగా విజయనగరం రూరల్‌ పీఎస్‌ మంగవేణి(దర్యాప్తు అధికారి) బుధవారం విచారణకు పిలిచారు. విచారణ పూర్తయిన అనంతరం నోటీసు ఇచ్చి.. ఆయనను విడిచిపెట్టారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశా’మని ఎస్పీ రాజకుమారి తెలిపారు. 

Updated Date - 2021-01-22T05:16:47+05:30 IST