టీడీపీ సానుభూతిపరురాలి గది కూల్చివేత

ABN , First Publish Date - 2021-07-26T06:26:26+05:30 IST

చిత్తూరులో టీడీపీ సానుభూతిరాలి గదిని వైసీపీ నేతలు దగ్గరుండి కూల్చివేయించారు.

టీడీపీ సానుభూతిపరురాలి గది కూల్చివేత
కూల్చివేసిన గది

చిత్తూరు, జూలై 25: చిత్తూరులో టీడీపీ సానుభూతిరాలి గదిని వైసీపీ నేతలు దగ్గరుండి కూల్చివేయించారు. గదికి సంబంధించిన రికార్డులు లేకపోయినా రెవెన్యూ అధికారులు లేదా నగరపాలక సంస్థ అధికారులు కూల్చాలి. కానీ వీరితో సంబంధం లేని అధికార పార్టీకి కార్పొరేటర్‌ బంధువు దగ్గరుండి ఈ పని చేయించడం చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. సంతపేట ఇందిరానగర్‌లోని టీడీపీకి చెందిన మాజీ కార్పొరేటర్‌ బంధువు సావిత్రికి.. కాణిపాకం రోడ్డులోని దక్షిణామూర్తి ఆలయం ఎదురుగా 263 చదరపు అడుగులతో ఓ గది ఉంది. ఇక్కడే మాజీ కార్పొరేటర్‌ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ బంధువు కుమరేశన్‌, మరికొందరు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దగ్గరుండి ఎక్స్‌కవేటర్‌తో ఆ గదిని కూల్చివేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ, బాధితురాలు సావిత్రితో కలిసి రెండో పట్టణ సీఐ యుగంధర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేశారు. రికార్డులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సుధాకరరెడ్డి తెలిపారు. కాగా, ఈ కూల్చివేతకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని కార్పొరేషన్‌ అధికార వర్గాలు వెల్లడించడం గమనార్హం. 

Updated Date - 2021-07-26T06:26:26+05:30 IST