జన్మాష్టమికి సిద్ధమైన ఆలయాలు..

ABN , First Publish Date - 2022-08-18T05:43:44+05:30 IST

దేవతలలో శ్రీకృష్ణ పరమాత్ముడిని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు. కొందరు స్నేహితుడిగా ఆరాధిస్తారు.

జన్మాష్టమికి సిద్ధమైన  ఆలయాలు..

కన్నయ్య వేడుక

ఇస్కాన మందిరంలో నేటి నుంచే..

అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 17: దేవతలలో శ్రీకృష్ణ పరమాత్ముడిని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు. కొందరు స్నేహితుడిగా ఆరాధిస్తారు. మరికొందరు కన్నబిడ్డలో బాలకృష్ణుడి అల్లరిని చూసుకుని మురిసిపోతారు. శ్రీమన్నారాయణుడి దశావతారాలలో కృష్ణావతారం భిన్నమైనది. వ్యక్తిత్వ వికాసం గురించి నేడు ఎందరో బోధిస్తున్నారు. కానీ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడని.. అదే భగవద్గీత అని భక్తులు గుర్తు చేస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని ఈ శుక్రవారం ఘనంగా నిర్వహించుకునేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోని కృష్ణమందిరాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. 

    నగరంలోని ఇస్కాన్‌ మందిరంలో గురువారం నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఇస్కాన్‌ మందిరాన్ని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గోకుల కృష్ణుడిని దర్శించుకునేందుకు వచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయం వద్ద ఏర్పాట్లు చేశారు. ఇస్కాన్‌ మందిరాల చైర్మన దామోదర్‌ గౌరంగ దాస్‌ పర్యవేక్షణలో ఆలయం వద్ద బుధవారం సాయంత్రం ఏర్పాట్లు చేపట్టారు. ఇక తల్లిదండ్రులు తమ చిన్నారులకు రాధాకృష్ణులు, గోపికల వేషధారణ వేయించి, ముచ్చటపడేందుకు సమాయత్తమయ్యారు. పలు ఆధ్యాత్మిక సంస్థలు, ఆలయ కమిటీలు చిన్ని కృష్ణుల వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నారు.


ఈ ఏడాది తెప్పోత్సవం... 

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా ఈ ఏడాది ప్రత్యేకంగా తెప్పోత్సవం నిర్వహిస్తున్నాం. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా కృష్ణాష్టమి వేడుకలను ఏకాంత సేవలకే పరిమితం చేయాల్సి వచ్చింది. అందుకే ఈ ఏడాది మరింత వైభవంగా వేడుకలను నిర్వహిస్తున్నాం. గురువారం యజ్ఞ హోమాది కార్యక్రమాలు, వాహనసేవ, 19న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాధాపార్థసారథులకు విశేషాలంకరణ, పూజాది కైంకర్యాలు, అదేరోజు సాయంత్రం ఆలయ ఆవరణలో తెప్పోత్సవం నిర్వహిస్తాం. 20వ తేదీన ఇస్కాన వ్యవస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల ఆవిర్భావోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదానం చేస్తాం. వేడుకల్లో విశ్వశాంతి హోమం, విష్ణుసహస్రనామ పారాయణం, ఉట్టికొట్టే ఉత్సవం, గరుడవాహనసేవ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తాం.

- దామోదర్‌ గౌరంగదాస్‌, ఇస్కాన మందిరాల చైర్మన


నేడు సాయిగోకులం

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సాయి ట్రస్టు, శ్రీనృత్యకళానిలయం సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు సాయిగోకులం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు విజయసాయికుమార్‌, నాట్యాచార్యురాలు సంధ్యామూర్తి బుధవారం సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. శ్రీకృష్ణ తులాభారం, గోపూజ, ఊయలసేవ, ఉట్లోత్సవం నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


Updated Date - 2022-08-18T05:43:44+05:30 IST