బాలాజి కో-ఆపరేటివ్‌ సూపర్‌బజార్‌ వార్షిక వ్యాపారం రూ.17.21 కోట్లు

ABN , First Publish Date - 2022-09-26T05:13:03+05:30 IST

పలమనేరు పట్టణంలోని బాలాజి కో-ఆపరేటివ్‌ సూపర్‌ బజార్‌ గత ఆర్థిక సంవత్సరం రూ.17.21 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహించిందని సూపర్‌ బజార్‌ అధ్యక్షుడు ఆర్వీ సుభాష్‌ చంద్రబోస్‌ మహాజన సభలో తెలిపారు.

బాలాజి కో-ఆపరేటివ్‌  సూపర్‌బజార్‌ వార్షిక వ్యాపారం రూ.17.21 కోట్లు
మహాజన సభలో మాట్లాడుతున్న ఆర్వీ సుభాష్‌చంద్రబోస్‌

పలమనేరు, సెప్టెంబరు 25: పట్టణంలోని బాలాజి కో-ఆపరేటివ్‌ సూపర్‌ బజార్‌ గత ఆర్థిక సంవత్సరం రూ.17.21 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహించిందని సూపర్‌ బజార్‌ అధ్యక్షుడు ఆర్వీ సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పలమనేరు సూపర్‌ బజార్‌ భవనం మిద్దెపై జరిగిన మహాజన సభలో ఆయన సూపర్‌ బజార్‌ పురోభివృద్ధిని వివరించారు. ప్రస్థావన సంవత్సరం ఆరంభంలో రూ.24.07 లక్షల స్టాకు నిల్వ ఉండి ఈ సంవత్సరంలో రూ.16.94 కోట్ల సరుకులను కొనుగోలు చేసి రూ.17.21  విక్రయించినట్టు తెలిపారు. ఇక రూ.86.28 లక్షల స్టాకు నిల్వ ఉందని తెలిపారు. విక్రయాల ద్వారా సూపర్‌బజార్‌ రూ.24,68,874 నికరలాభం సాధించిందని తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో 13,786 మంది సభ్యులతో రూ.33,61,315 షేర్‌ ధనం నిల్వ ఉండగా, ప్రస్తుత సంవత్సరంలో 60 మంది కొత్తగా సభ్యులుగా చేరారని తెలిపారు. సంవత్సరాంతంలో 13846 మందితో రూ.33,79,515 షేర్‌ ధనం నిల్వ ఉందన్నారు. సూపర్‌ బజార్‌ భవనంలోని మొదటి అంతస్తులో నాలుగు గదులు నిర్మించామని, వాటిని టెండర్ల ద్వారా బాడుగలకు ఇచ్చి సూపర్‌ బజార్‌ ఆదాయం పెంచుతామన్నారు. ఈ సమావేశంలో 2022-23 అంచనా బడ్జెట్‌ను ఆమోదించారు. అంతేకాక సభ్యులందరికీ డివిడెండ్ల కింద వెండి నాణెం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా రూ.300 కట్టిన సభ్యులు మిగిలిన సభ్యత్వ రుసుం చెల్లించి వారి డివిడెండ్లను పొందాలని సూచించారు. గుర్తింపు కార్డులు లేకుంటే సూపర్‌ బజార్‌ కార్యాలయంలో  ఏదేని తమ గుర్తింపుకార్డును తీసుకొని వచ్చి సూపర్‌ బజార్‌ గుర్తింపుకార్డులను పొంది, డివిడెండ్లను పొందాలని సూచించారు. వినియోగదారుల సౌకర్యార్థం ఆదివారం కూడా సూపర్‌ బజార్‌ తెరిచి ఉంటుందన్నారు. ఇక  సూపర్‌బజార్‌కు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మహాజన సభ తీర్మానించింది. ప్రభుత్వం నిబంధనల మేరకు 15 సంవత్సరాల వాహనాల వినియోగం కుదరనందున సంచార వాహనాన్ని నిలిపివేస్తున్నట్లు బోస్‌ తెలిపారు. సూపర్‌ బజార్‌ ఉపాధ్యక్షుడు పి.సుధాకర్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు సి.శ్రీనివాసులునాయుడు, ఆర్‌.సుబ్రమణ్యంరెడ్డి, కె.లక్ష్మీపతి, బి.సత్యం, చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌.కృష్ణమూర్తి, సూపర్‌బజార్‌ మేనేజర్‌ బాలు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-26T05:13:03+05:30 IST