గుంతలో పడి బాలిక మృతి

ABN , First Publish Date - 2021-11-29T05:15:45+05:30 IST

ఇంటి సమీపంలో తవ్విన గుంతలో పడి బాలిక మృతి చెందిన ఘటన చిత్తూరు నగర పరిధిలోని మురకంబట్టులో ఆదివారం చోటు చేసుకుంది. స్థల ఆక్రమణదారులు రాత్రిపూట గుంత తీయడంతోనే ప్రమాదం జరిగిందంటూ స్థానికులు మురకంబట్టు సర్కిల్‌లో ఆందోళనకు దిగారు.

గుంతలో పడి బాలిక మృతి
కీర్తన మృతదేహం వద్ద రోధిస్తున్న బంధువులు , ప్రమాదానికి కారణమైన గుంత

స్థల ఆక్రమణదారుల వల్లే ప్రమాదం అంటూ స్థానికుల ఆందోళన

మురకంబట్టులో స్తంభించిన ట్రాఫిక్‌


చిత్తూరు, నవంబరు 28: ఇంటి సమీపంలో తవ్విన గుంతలో పడి బాలిక మృతి చెందిన ఘటన చిత్తూరు నగర పరిధిలోని మురకంబట్టులో ఆదివారం చోటు చేసుకుంది. స్థల ఆక్రమణదారులు రాత్రిపూట గుంత తీయడంతోనే ప్రమాదం జరిగిందంటూ స్థానికులు మురకంబట్టు సర్కిల్‌లో ఆందోళనకు దిగారు. దీంతో చిత్తూరు - తిరుపతి జాతీయ రహదారిలో గంట సేపు వాహనాలు నిలిచిపోయాయి. డీఎస్పీ సుధాకరరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధితుల కథనం మేరకు.... మురకంబట్టులోని డీఎల్‌పీవో కార్యాలయం వెనుక ఈశ్వర్‌, మౌనిక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె కీర్తన(9) ఆదివారం మధ్యాహ్నం సమీపంలోని చిన్నాన్న ఇంటికి బయల్దేరింది. దారిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో శాంతినగర్‌ కాలనీకి చెందిన స్వప్న, సంధ్య అనే మహిళలు శనివారం రాత్రి ఎక్స్‌కవేటర్‌తో గుంత తవ్వించారు. వర్షం కురుస్తుండడంతో ఆ గుంత పూర్తిగా నిండిపోయింది. చిన్నాన్న ఇంటికి వెళ్తున్న కీర్తన అక్కడ గుంత ఉన్న విషయం తెలియక వర్షపు నీరనుకుని అడుగు పెట్టడంతో నీటమునిగి మృత్యువాత పడింది. చిన్నాన్న ఇంటికి వెళ్లిన బిడ్డ తిరిగి రాకపోవడంతో పిల్చుకొద్దామని కీర్తన తల్లిదండ్రులు వెళ్తుండగా గుంతలో చెప్పులు తేలియాడుతూ కనిపించాయి. అనుమానంతో గాలించగా మృతదేహం లభ్యమైంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి కొంతమంది శనివారం రాత్రే గుంత తీశారని, రోజూ అదేదారిలో వెళ్లే కీర్తన వర్షపు నీరనుకుని గుంతలో దిగడంతోనే మృతి చెందిందని మురకంబట్టు గ్రామస్థులు ఆరోపించారు. బాలిక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చూస్తూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. బాలిక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. రెండో పట్టణ సీఐ యుగంధర్‌ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.



Updated Date - 2021-11-29T05:15:45+05:30 IST