చేతివాటం!

ABN , First Publish Date - 2021-07-20T05:30:00+05:30 IST

అది రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే తనకంటూ గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన ప్రభుత్వాసుపత్రి.

చేతివాటం!

  • ముడుపులు చెల్లిస్తేనే కొత్త పీఆర్‌సీ వేతనం
  • లేకపోతే బయట బిల్లులు చేయించుకోవాలంట.. 
  • వివిధ శాఖల్లో కొందరు ఉద్యోగుల నిర్వాకం
  • ట్రెజరీ అధికారుల పేరిట ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి అక్రమ వసూళ్లు



అది రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే తనకంటూ గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన ప్రభుత్వాసుపత్రి. వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఆసుపత్రిలో కొత్త పీఆర్‌సీ ప్రకారం బిల్లులు చేసేందుకు అక్కడ పనిచేసే ఉద్యోగుల నుంచి వారి హోదా మేరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కొక్కరి నుంచి వెయ్యి నుంచి మూడు వేల వరకు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము అడిగినంత ఇస్తేనే కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతన బిల్లులు చేస్తామని, లేకపోతే బయట వేరే వారితో చేయించుకోవాలని ఖరాఖండిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇది అక్కడి ఉద్యోగులు మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఎదుర్కొంటున్నారనేది అక్షర సత్యం. 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) : తమకు పెరిగిన వేతనం పొందడానికి ప్రభుత్వ ఉద్యోగులు ముడుపులు చెల్లించాల్సి వస్తోంది. వేతనం బిల్లు తయారీ చేసేవారి నుంచి బిల్లులు ఆమోదించే వారి వరకు ముడుపుల వేధింపులు తప్పడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. కొత్త పీఆర్‌సీ ప్రకారం పెరిగిన వేతనం పొందడానికి ఒకవైపు ఉద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే.. కొందరు అక్రమ వసూళ్లకు తెరలేపారు. తాము చెప్పినంత డబ్బులు చెల్లిస్తేనే కొత్త పీఆర్‌సీతో వేతనం బిల్లులు చేస్తామంటున్నారు. తమ సహచర ఉద్యోగుల వేతనం బిల్లులు తయారు చేసే ఉద్యోగులు ఆ ఉద్యోగుల హోదా, తీసుకునే వేతనం ఆధారంగా ముడుపులు డిమాండ్‌ చేయడం గమనార్హం. వేతనం బిల్లులు తయారు చేయడం మీ ఉద్యోగ బాధ్యతల్లో ఒకటని, దానికి తామెందుకు డబ్బులు చెల్లించాలంటూ ఎవరైనా ఉద్యోగులు ప్రశ్నిస్తే.. మీ బిల్లు చేసేది లేదంటూ స్పష్టం చేయడం గమనార్హం. నిర్ణీత గడువులోగా పీఆర్‌సీ వేతన బిల్లులు తయారు చేసి ట్రెజరీలో సమర్పించకపోతే కొత్త వేతనం కోసం మరోనెల వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని బూచిగా చూపిస్తూ ఉద్యోగుల వద్ద దండుకుంటున్నట్లు తెలుస్తోంది. 

వికారాబాద్‌ జిల్లాలో 7400 మంది ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగులు ఉన్నారు. వీరే కాకుండా వివిధ ప్రభుత్వ, ప్రభుత్వరంగకార్యాలయాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. వీరందరికీ వేతన, ఇతర బిల్లులు ట్రెజరీ ద్వారా మంజూరవుతాయి. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనం సకాలంలో అందాలంటే సహాయకులు తయారు చేసే బిల్లులు డీడీవోలు పరిశీలించి ట్రెజరీకి పంపిస్తారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరఫున వారి వేతన బిల్లులు తీసుకుని ట్రెజరీ కార్యాలయంలో డీడీవోలు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లలో ఒకరు అందజేస్తుంటారు. వేతన బిల్లులు రూపొందించే విధులు నిర్వహించే సహాయకులతోపాటు కొందరు డీడీవోలు కూడా కొత్త వేతన స్థిరీకరణ బిల్లుల పేరిట ఉద్యోగుల నుంచి అందినంత దండుకుంటున్నారనేఆరోపణలు వినిపిస్తున్నాయి.


అక్కడ ఇవ్వాలంటూ అక్రమ వసూళ్లు...

ఇదిలా ఉంటే, కొత్త పీఆర్‌సీ ప్రకారం తయారు చేసిన బిల్లుల ప్రకారం వేతనం రావాలంటే ట్రెజరీ కార్యాలయాల్లో ముడు పులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఉద్యోగులు, ఉపాధ్యాయుల వద్ద కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ట్రెజరీ అధికారుల పేరిట చేతివాటం చూపిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.500 నుంచి రూ.1,000 వరకు కొందరు డీడీవోలు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారంటూ సోమవారం యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బందెప్పలు డీటీవో దృష్టికి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తమ శాఖ పేరిట ఎవరైనా వసూలు చేస్తే దానికి మేమెలా బాధ్యత వహించగలమని, తమ కార్యాలయాల్లో మాత్రం ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన పనిలేదని ఆయన వారితో స్పష్టం చేసినట్లు తెలిసింది. 


ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు..

కొత్త పీఆర్‌సీ వేతన బిల్లులు మంజూరు చేసేందుకు ట్రెజరీ కార్యాలయాల్లో ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బు డిమాండ్‌ చేస్తే ఆవిషయాన్ని మా దృష్టికి తీసుకువస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ట్రెజరీ కార్యాలయం పేరిట ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి కొందరు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని యూటీఎఫ్‌ జిల్లా నాయకులు కూడా మా దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయాన్ని ఇదివరకే జిల్లాలో పనిచేస్తున్న ట్రెజరీ ఉద్యోగులందరికీ స్పష్టం చేశాం. ఎవరైనా డబ్బు డిమాండ్‌ చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. 

- దశరథ్‌, జిల్లా కోశాధికారి, వికారాబాద్‌ 

Updated Date - 2021-07-20T05:30:00+05:30 IST