‘కొత్త’ సంబురం

ABN , First Publish Date - 2022-08-11T05:30:00+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు పింఛన్‌ జీవుల్లో కొత్త ఆనందాన్ని ఆవిష్కరించింది. మూడున్నరేళ్లుగా ఆశల పల్లకిలో ఉన్న 57ఏళ్ల పైబడిన వృద్ధులకు మరో మూడు రోజుల్లో తీపికబురు అందనున్నది. ఏ గ్రామంలో ఎంతమంది అర్హులు ఉన్నారనే విషయంపై ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఒక అంచనాకు వచ్చింది.

‘కొత్త’ సంబురం

మూడున్నరేళ్ల తర్వాత తీపికబురు

57 ఏళ్లుపైబడిన వారి వివరాల సేకరణ

దరఖాస్తుల్లో 36 వేల మందికి అర్హత

600 మందికిపైగానే డయాలసిస్‌ బాధితులు

పంద్రాగస్టు నుంచి పింఛన్ల పంపిణీకి శ్రీకారం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఆగస్టు 11 : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు పింఛన్‌ జీవుల్లో కొత్త ఆనందాన్ని ఆవిష్కరించింది. మూడున్నరేళ్లుగా ఆశల పల్లకిలో ఉన్న 57ఏళ్ల పైబడిన వృద్ధులకు మరో మూడు రోజుల్లో తీపికబురు అందనున్నది. ఏ గ్రామంలో ఎంతమంది అర్హులు ఉన్నారనే విషయంపై ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఒక అంచనాకు వచ్చింది. మరోసారి జల్లెడ పట్టి వీరందరినీ అర్హుల జాబితాలో చేర్చడానికి కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా కిడ్నీ వ్యాధితో డయాలసిస్‌ చికిత్సపొందున్న వారి వివరాలను సైతం గుర్తిస్తున్నారు. ఈనెల 15వ తేదీన ఈ ఇరు వర్గాలకు పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. 


36వేలకుపైగా కొత్త పింఛన్లు

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 65 ఏళ్లు నిండిన వృద్ధులకు ఆసరా పింఛన్‌ అందుతోంది. కాగా గడిచిన మూడేళ్లలో 65 ఏళ్లు నిండిన చాలా మందికి పింఛన్‌ రాలేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆమోద ముద్ర లభించలేదు. వీరితోపాటు 57 ఏళ్లు నిండిన వృద్ధులకు కూడా ప్రతీనెల రూ.2016 ఆసరా పింఛన్‌ అందించాలని ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పటికే మూడున్నరేళ్ల సమయం గడిచింది. అయినా హామీగానే మిగిలింది. ఇటీవల సీఎం కేసీఆర్‌ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 15వ తేదీన కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. సమయం, సందర్భాల గురించి ప్రస్తావించడంతో పింఛన్‌ ఆశాజీవుల్లో సంతోషం అలుముకున్నది. 57 ఏళ్లు నిండిన వృద్ధులంతా ఇప్పటికే దరఖాస్తులు సమర్పించారు. వీరిలో దాదాపు 36 వేల పైచిలుకు లబ్ధిదారులకు కొత్తగా ఆసరా పింఛన్‌ అందే అవకాశం కనిపిస్తున్నది. ఫలితంగా ప్రతీనెల రూ.7.25 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనున్నది. 


జిల్లాలో పింఛన్ల వివరాలు

పింఛన్లు      సంఖ్య 

వృద్ధులు     49,227

వితంతువులు     52,229

వికలాంగులు     14,420

చేనేత కార్మికులు     2,327

గీతా కార్మికులు     2,910

బీడీ కార్మికులు     44,057

ఒంటరి మహిళలు     3,368

మొత్తం             1,68,538


2 లక్షలు దాటనున్న పింఛన్లు

జిల్లాలో ఇప్పటికే 1,68,538 మందికి వృద్ధాప్య, వికలాంగ, చేనేత, బీడీ, గీతా కార్మిక, ఒంటరి మహిళ, వితంతు పింఛన్లు అందుతున్నాయి. తాజాగా 57 ఏళ్లు నిండిన వృద్ధులను పరిగణనలోకి తీసుకుంటే 36 వేల పైచిలుకు లబ్ధిదారులు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ లెక్కన 2లక్షల పైచిలుకు పింఛన్‌దారులు ఉండనున్నారు. జిల్లా జనాభాలో సుమారు 20 శాతం మందికి పింఛన్లు వస్తున్నాయి. ఇక కొంతమంది చనిపోయినప్పటికీ వారి పేర్లను పింఛన్‌ జాబితాల నుంచి తొలగించనట్లుగా ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఒకే ఇంట్లో రెండేసి ఆసరా పింఛన్లు కూడా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఆ ఇంటి సభ్యులకు ఆసరా పింఛన్‌ అందుతున్నదనే వాదనలు లేకపోలేదు. ఇలాంటి విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తే సుమారుగా 5 నుంచి 10వేల పింఛన్లకు కోత పడే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్ల రూపేణా ఆర్థిక భారం పడుతున్న క్రమంలో నిఘా పెంచడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. 


కిడ్నీ బాధితులకు కాస్త ఊరట

ఇటీవల కాలంలో కిడ్నీ బాధితుల సంఖ్య విరివిగా పెరుగుతోంది. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌ తదితర ప్రభుత్వ ఆస్పత్రిల్లో కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ చికిత్స అందించడానికి ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సౌకర్యం ఉన్నవారికే ఇక్కడ ఉచిత సేవలు అందుతున్నాయి. బెడ్ల సంఖ్య తక్కువగా ఉండడం, రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో తీవ్ర సమస్య వాటిల్లుతోంది. రోజువారీ డయాలసిస్‌, రెండ్రోజులకు ఓసారి, వారానికి ఒకసారి డయాలసిస్‌ చేసుకునే రోగులు ఉన్నారు. వీరికి బెడ్లు లభించని సమయంలో అత్యవసరంగా ప్రైవేట్‌ ఆస్పత్రులకు బాట పడుతున్నారు. ఒకసారి డయాలసి్‌సకు రూ.5వేల వరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఖర్చవుతున్నది. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేసుకునేవారికి కూడా దారి ఖర్చు లు తప్పడం లేదు. అందుకే ప్రభుత్వం గుర్తించి వీరికి కూడా రూ.2016 ఆసరా పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో 600పైచిలుకు డయాలసిస్‌ బాధితులు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. వీరికి ఈ నెల 15వ తేదీన పింఛన్‌ ధ్రువీకరణ పత్రంతోపాటు రూ.2016 అందివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST