రుచీపచీ లేనేలేవు

ABN , First Publish Date - 2022-05-29T05:57:24+05:30 IST

మార్కెట్‌లో మామిడి పండ్ల రంగు చూస్తే నిగనిగలాడుతుంటుంది. కానీ అవి రుచిపచీ ఉండవు. కారణం విషపూరిత పదార్థాలతో మగ్గబెడుతుండడమే. దీనివల్ల ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే మామిడి పండ్ల విక్రయాలు జోరందుకున్నాయి. వాటిని కొనుగోలుచేసి ఇంటికి తీసుకెళ్లి తిన్నవారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

రుచీపచీ లేనేలేవు

మామిడిని కార్బైడ్‌తో మగ్గిస్తున్న వ్యాపారులు
ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్న వైద్యులు
(ఇచ్ఛాపురం రూరల్‌/నరసన్నపేట)

మార్కెట్‌లో మామిడి పండ్ల రంగు చూస్తే నిగనిగలాడుతుంటుంది. కానీ అవి రుచిపచీ ఉండవు. కారణం విషపూరిత పదార్థాలతో మగ్గబెడుతుండడమే. దీనివల్ల ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే మామిడి పండ్ల విక్రయాలు జోరందుకున్నాయి. వాటిని కొనుగోలుచేసి ఇంటికి తీసుకెళ్లి తిన్నవారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో 5,269 హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయి. అంతే కాకుండా కొబ్బరితోటల్లో అంతర పంటగా కూడా ఎక్కువమంది సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే హెక్టారుకు 9 టన్నుల పైగా దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల కారణంగా 2 నుంచి 5 టన్నులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గడంతో మామిడి పండ్లకు డిమాండ్‌ పెరిగింది. గతేడాది కిలో పండ్లు రూ.50 ఉండగా.. ప్రస్తుతం రూ.100కు విక్రయిస్తున్నారు. ఏడాదికోసారి లభ్యమయ్యే పంట కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు పక్వానికి వచ్చిన అరటి, మామిడికాయలను గడ్డిలో వేసి గాలి తగలని ప్రదేశంలో మగ్గపెట్టేవారు. ఐదారు రోజులు తర్వాత ఇవి పండ్లు అయ్యేవి. వాటిని తింటే ఎంతో రుచిగా ఉండేవి. కాగా, ప్రస్తుతం మామిడి కాయలను మగ్గబెట్టేందుకు వ్యాపారులు ప్రమాదకర పద్ధతులు అవలంబిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నిషేధించిన కాల్షియం కార్బైడ్‌ను పండ్ల మధ్య ఉంచుతున్నారు. దీనివల్ల గాలిలోని తేమతో రసాయనిక చర్య జరిగి ఎసిటైలిన్‌ అనే వాయువు విడుదల అవుతుంది. ఇది కాయలు పక్వానికి రాకముందే రంగును మార్చేస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో అరటి పండ్లకు కూడా డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో త్వరగా మగ్గబెట్టేందుకు అరటిపండ్ల గెలలకు కూడా రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. మరికొందరు మొక్కల పెంపకానికి ఉపయోగించే ఇథోపాన్‌ రసాయనం కలిపిన నీటిలో మామిడి కాయలు ముంచి తీస్తున్నారు. దీనివల్ల రంగు ఒక్కరోజులో మారిపోతోంది. వీటిని తింటే అనారోగ్యం బారిన పడక తప్పవని వైద్యులు పేర్కొంటున్నారు. కార్బైడ్‌ను సాధారణంగా ఎరువులు, స్టీల్‌ తయారీలో వినియోగిస్తారు. ఇందులో ఉండే ఆర్సెనిక్‌, పాస్పరస్‌ వంటి ప్రమాదకర రసాయనాలు ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ప్రత్యామ్నాయ పద్ధతులు
మామిడి , ఇతర పండ్లను మగ్గబెట్టేందుకు ఉద్యానశాఖ ప్రత్యామ్నాయ పద్ధతులు సూచించింది. పండ్లను ఎన్‌రైప్‌ పదార్థంతో మగ్గపెట్టుకోవచ్చని అధికారికంగా పేర్కొంది. మామిడి పండ్ల ట్రేలలో ఎన్‌రైప్‌ పొట్లం పెట్టి ఉంచితే మూడు రోజుల్లో పక్వానికి వచ్చేస్తాయని చెబుతోంది. ఇందులో ప్రమాదకర రసాయనాలు లేవని పేర్కొంటోంది.

ఆరోగ్యంపై దుష్ప్రభావం
కార్బైడ్‌, ఇథోపాన్‌ రసాయనాలు క్యాన్సర్‌ కారకాలు. వీటితో మగ్గించిన పండ్లను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా జీర్ణసంబంధిత సమస్యలు వస్తాయి. కాలేయం, కిడ్నీలు, మెదడు పనితీరును తగ్గిస్తుంది. శరీరంలోని అన్ని వ్యవస్థల మీద వీటి ప్రభావం ఉంటుంది.
- డి.ఇంద్రజ, వైద్యాధికారిణి, ఇచ్ఛాపురం

రసాయనాలతో అనారోగ్యం
ఈ కాలంలో విరివిగా లభించే మామిడి, సపోట పండ్లపై రసాయనాలు చల్లితే ప్రజలకు అనారోగ్యం తప్పదు. రసాయనాలతో మగ్గించే పండ్లను తింటే జీర్ణకోశ సమస్యలు వస్తాయి. ఈ పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండవు.
 -పొన్నాడ గణేష్‌, ఎండీ, నరసన్నపేట వందపడకల ఆస్పత్రి

అందుబాటులో సహజ విధానాలు
కొందరు వ్యాపారులు మామిడికాయలను కృత్రిమంగా పండిస్తున్నారు. మార్కెట్‌లో ఇథలిన్‌ అనే పౌడర్‌ దొరుకుతుంది. దాన్ని నీటిలో కలిపి అందులో కాయలు ముంచి ఆరబెడితే త్వరగా మగ్గుతాయి. అంతేకాకుండా రెళ్లి కొమ్మలు, గడ్డిలో పెట్టి కూడా మగ్గబెట్టుకోవచ్చు. ఆ పండ్లు కూడా రుచికరంగా ఉంటాయి.
- ఆర్‌.వరప్రసాద్‌రావు, ఏడీ, ఉద్యానశాఖ

Updated Date - 2022-05-29T05:57:24+05:30 IST