ముచ్చటగా మూడోసారి!

ABN , First Publish Date - 2021-01-24T06:22:03+05:30 IST

సంగారెడ్డి క్రైం, జనవరి 23 : బతుకుదెరువు కోసం ఏ వ్యాపారం చేసిన అతడికి నష్టాలు తప్పలేవు. చివరికి అప్పులే మిగిలాయి. తమ డబ్బులేవని అప్పుల వారు రోజూ వెంటపడి వేధించసాగారు. ఏమి తోచని అతడు ఓ రోజు టీవీలో దొంగనోట్ల ముఠా గురించి చూశాడు.

ముచ్చటగా మూడోసారి!
నిందితుడి వివరాలను తెలుపుతున్న డీఎస్పీ బాలాజీ

దొంగనోట్లు చలామణీ చేస్తూ పట్టుబడిన యువకుడు

గతంలో నకిలీ నోట్ల తయారీలో రెండుసార్లు జైలుకు

మళ్లీ పోలీసులకు దొరికిన రాజుప్రసాద్‌

కారు, ఎనిమిది నకిలీ నోట్ల స్వాధీనం


సంగారెడ్డి క్రైం, జనవరి 23 : బతుకుదెరువు కోసం ఏ వ్యాపారం చేసిన అతడికి నష్టాలు తప్పలేవు. చివరికి అప్పులే మిగిలాయి. తమ డబ్బులేవని అప్పుల వారు రోజూ వెంటపడి వేధించసాగారు. ఏమి తోచని అతడు ఓ రోజు టీవీలో దొంగనోట్ల ముఠా గురించి చూశాడు. తన కష్టాలు గట్టెకాలంటే నకిలీ నోట్లు తయారీయే మార్గమనుకున్నాడు.. అటువైపు ఆకర్షితుడై దొంగనోట్ల తయారీని ప్రారంభించాడు. రూ.2వేలు, రూ.500 నోట్లను చలామణి చేస్తూ ఇప్పటికే రెండుసార్లు పోలీసులకు చిక్కాడు. జైలుకు వెళ్లొచ్చినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ అదే తంతును కొనసాగించాడు. ముచ్చటగా మూడోసారి కూడా సంగారెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. సంగారెడ్డి డీఎస్పీ ఏ.బాలాజీ శనివారం సంగారెడ్డి పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించారు. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం గ్రామానికి చెందిన ఉప్పరి రాజుప్రసాద్‌(30) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పటాన్‌చెరులో 2016 సంవత్సరంలో వివిధ వ్యాపారాలు చేయగా తీవ్రంగా నష్టపోయాడు. దీంతో దొంగనోట్లను తయారు చేసి చలామణి చేయాలని నిశ్చయించుకొని తన షాప్‌లో ఉన్న కలర్‌ ప్రింటర్‌తో రూ.2 వేలు, రూ.500 నోట్లను పెద్దమొత్తంలో కలర్‌ జిరాక్స్‌ తీసి నకిలీ నోట్లను తయారు చేయడం ప్రారంభించాడు. ఈ నకిలీ కరెన్సీ నోట్లను పటాన్‌చెరులో చలామణి చేస్తుండగా 2017లో అక్కడికి పోలీసులకు చిక్కాడు. అదే సమయంలో తన వద్ద ఉన్న కొన్ని నకిలీ నోట్ల విషయం పోలీసులకు చెప్పకుండా దాచి పెట్టాడు. అనంతరం బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన రాజుప్రసాద్‌ 2019లో మరోసారి నకిలీ నోట్లను బాచుపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చలామణి చేస్తూ అక్కడి పోలీసులు దొరికిపోయాడు. అప్పటికే తన సొంత ఇల్లు అయిన అల్లాదుర్గంలో దాచిపెట్టిన రూ.2వేల నకిలీ నోట్ల గురించి కూడా పోలీసులకు చెప్పలేదు. అనంతరం బెయిల్‌పై వచ్చిన అతడు టీఎస్‌ 07 జీసీ 0116 నంబరు గల స్విఫ్ట్‌ కారును అద్దెకు తీసుకొని ఈ నెల 7వ తేదీన సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట, విజయనగర్‌ కాలనీలో ఉన్న సాయిరాం కిరాణా షాప్‌లో రూ.2 వేల నకిలీ నోట్లను మార్చాడు. అనంతరం నకిలీ నోటుగా గుర్తించిన సదరు కిరాణాషాపు యజమాని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేయగా నిందితుడు ఉప్పరి రాజు ప్రసాద్‌గా గుర్తించారు. అతడిని శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితుడు ఉపయోగించిన కారును, కారు డిక్కీలో ఉన్న ఎనిమిది రూ.2 వేల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును త్వరగా ఛేదించిన పట్టణ సీఐ డి.వెంకటేష్‌, ఎస్‌ఐ పి.ప్రసాద్‌, కానిస్టేబుళ్లు ఎండీ అన్వర్‌, ఎండీ శాకీరుద్దీన్‌, ఎం.శంకరయ్యను డీఎస్పీ ఏ.బాలాజీ అభినందించారు. 


Updated Date - 2021-01-24T06:22:03+05:30 IST