
తిరుపతి : ఎడతెరిపి లేకుండా బుధవారం రాత్రి నుంచీ భారీ వర్షాలు విరుచుకుపడుతుండడంతో చిత్తూరు జిల్లా అతలాకుతలమవుతోంది. వీధులు నదులయ్యాయి. వస్తువులన్నీ పడవల్లా తేలిపోయాయి. వరద నీటిలో వాహనాలు బొమ్మల్లాగా కొట్టుకుపోయాయి. ఇది తిరుపతి నగరంలో కనిపించిన దృశ్యం! వాయుగుండం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు పెద్దగండం తెచ్చిపెట్టింది. తిరుమల-తిరుపతి అతలకుతలమయ్యాయి. వాయుగుండం ప్రభావంతో చిత్తూరుతో పాటు కడప, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో తిరుమల, తిరుపతికి వచ్చిన వాహనదారులు, ప్రయాణికులు స్వగ్రామాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా పలుమార్గాలు ప్రయాణానికి అనుకూలంగా లేవని.. తాము సూచించిన మార్గంలోనే వెళ్లాలని అర్బన్ జిల్లా పోలీసులు కొన్ని మార్గాలను ప్రకటనలో తెలిపారు.

ఇలా వెళ్లండి..!
- తిరుపతి నుంచి నెల్లూరు, చెన్నై వెళ్లాల్సినవారు పుత్తూరు, నాగలాపురం, సత్యవేడు, తడ మీదుగా వెళ్లాలి..
- కడప వైపు వెళ్లాల్సినవారు రేణిగుంట-పూతలపట్టు జాతీయ రహదారిమీదుగా పూతలపట్టు, పీలేరు, రాయచోటి మీదుగా వెళ్లాలి.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
భారీ వర్షాల కారణంగా అనవసరంగా రోడ్లపైకి వచ్చి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని ఎస్పీ సెంథిల్‌కుమార్ సూచించారు. జిల్లావ్యాప్తంగా సహాయ చర్యల్లో పోలీసులు పాల్గొంటున్నారని, వారికి స్థానిక ప్రజలు సహకారం అందించాలని కోరారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున్న... అవసరమైతే తప్ప ప్రజలు వాహనాల్లో లేదా నడిచి బయటికి రాకూడదన్నారు. ప్రజలకు అత్యవసర సేవల కోసం డయల్ 100, పోలీస్ వాట్సాప్ నెంబరు 9440900005 నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
