వేసవి తాకిడిని తట్టుకోవాలంటే ఇలా చేయండి!

ABN , First Publish Date - 2022-03-15T19:09:18+05:30 IST

వేసవిలోకి అడుగు పెట్టాం. వేడిమి ప్రభావం పిల్లల మీద ఎక్కువ. వాళ్ల లేత శరీరాలు వేసవి తాకిడిని తట్టుకోవాలంటే తల్లులు తగిన రక్షణ చర్యలను అనుసరించక తప్పదు అంటున్నారు వైద్యులు.

వేసవి తాకిడిని తట్టుకోవాలంటే ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(15-3-2022)

వేసవిలోకి అడుగు పెట్టాం. వేడిమి ప్రభావం పిల్లల మీద ఎక్కువ. వాళ్ల లేత శరీరాలు వేసవి తాకిడిని తట్టుకోవాలంటే తల్లులు తగిన రక్షణ చర్యలను అనుసరించక తప్పదు అంటున్నారు వైద్యులు. 


పిల్లల శరీరాల్లో నీటి శాతం తక్కువ. వారి చర్మ వైశాల్యమూ తక్కువే! కాబట్టి పిల్లలు తేలికగా ఎండ వేడిమి ప్రభావానికి గురవుతారు. దాంతో డీహైడ్రేషన్‌, ఎండదెబ్బల బారిన పడతారు. పైగా ఈ కాలంలో డయేరియా, చర్మ ఇన్‌ఫెక్షన్లు కూడా పిల్లలను వేధిస్తాయి. కాబట్టి పిల్లల వయసుకు తగిన వేసవి జాగ్రత్తలు పాటించాలి.


పసికందులు

చలి కాలం నుంచి ఎండా కాలంలోకి అడుగు పెట్టే క్రమంలో, చలి కాలంలో వాడిన స్వెటర్లనే వేసవి ప్రారంభంలో కూడా తల్లులు కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇది సరి కాదు. వేడి వాతావరణంలో మందంగా ఉండే స్వెటర్లను వాడడం వల్ల శరీరం వేడెక్కి, డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇలా జరగకుండా ఉండాలంటే వదులైన దుస్తులు పసికందులకు వేయాలి. మందపాటి దుప్పట్లు, స్వెటర్ల వాడకం మానేయాలి. ఆు నెలల వయసు పసికందులకు అదనంగా దాహార్తి తీర్చడం కోసం నీళ్లు తాగించవలసిన అవసరం లేదు. వీరికి తల్లిపాలతో దొరికే నీరే సరిపోతుంది. 


డీహైడ్రేషన్‌: పసికందుల్లో డీహైడ్రేషన్‌ను గుర్తించడానికి రెండు మార్గాలున్నాయి. పిల్లల కాళ్లు, చేతులను తాకినప్పుడు, అవి వేడిగా ఉంటే డీహైడ్రేషన్‌కు గురవుతున్నట్టుగా భావించాలి. అలాగే బిడ్డ రోజుకు ఆరు నుంచి ఏడు సార్లు మూత్రవిసర్జన చేస్తుందో లేదో గమనించాలి. అన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉంటే బిడ్డ శరీరంలో నీటి శాతం సమంగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.


ఎసిలు, కూలర్లు: వేసవి వేడిమి ప్రభావం పిల్లల మీద పడకుండా,  ఎసిలు, కూలర్లు వాడే వాళ్లు ఎక్కువ. అయితే పసికందులకు ఎసి 27 డిగ్రీలకు సెట్‌ చేసి వాడుకోవాలి. వాళ్ల శరీరాలు అవసరానికి మించి చల్లబడిపోకుండా చూసుకోవాలి. కూలర్లను సరిగా శుభ్రం చేయకపోవడం, వాటిలో నీళ్లు నిల్వ ఉండిపోతూ ఉండడం మూలంగా కూలర్ల వాడకంతో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు తలెత్తే అవకాశాలు ఎఝ్కువ. కాబట్టి కూలర్లకు బదులుగా ఎసిలను ఎంచుకోవడం మేలు.


అప్రమత్తం: పిల్లల శరీరాలు విపరీతంగా వేడెక్కిపోతున్నా, చర్మం పొడిబారి, ముడతలు పడుతున్నా ఆలస్యం చేయకుండా వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. ఈ కాలంలో చర్మ సమస్యలు వేధిస్తాయి. శరీరంపై చమట ఆరిపోవడం లేదా, చర్మపు ముడతల్లో చమట, మట్టి పేరుకుపోవడం మూలంగా చమట పొక్కులు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఈ కాలంలో ఇబ్బంది పెడతాయి. సాధారణంగా మామిడి పండ్లు తినడం వల్ల వేడిచేసి సెగ గడ్డలు మొదలయ్యాయని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ సెగ గడ్డలకు కారణం చర్మం మీద చమట ఇంకిపోయి, చర్మ రంథ్రాలు మూసుకుపోయి, ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడమే! చమట పొక్కులు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, సెగ గడ్డలు పిల్లలను ఈ కాలంలో వేధించకుండా ఉండాలంటే రోజుకు రెండు పూటలా పిల్లలు స్నానం చేస్తూ ఉండేలా చూసుకోవాలి. చమటను పీల్చే దుస్తులు పిల్లలు ధరించేలా చూసుకోవాలి. ఈ కాలంలో సిల్క్‌ దుస్తులతో చర్మం ఒరిపిడికి గురై, ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. కాబట్టి అలాంటి దుస్తులను మానేయాలి.


పదేళ్ల లోపు పిల్లలు

వేసవిలో ఎండదెబ్బకు గురయ్యే అవకాశమున్న వయసిది. ఆరుబయట ఆటలాడుతూ, దాహం వేసినా నీళ్లు తాగకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ వయసు పిల్లలు తేలికగా ఎండ దెబ్బకు గురవుతూ ఉంటారు. కాబట్టి పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచాలి. సరిపడా నీళ్లు తాగుతున్నారో, లేదో గమనించుకుంటూ ఉండాలి. తాజా కూరగాయలు, పప్పు, పెరుగు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మసాలాలు, కారాలు ఈ కాలంలో తగ్గించి, పండ్ల రసాలు, క్యారెట్‌ జ్యూస్‌ , మజ్జిగ, రాగి జావ, కొబ్బరి నీళ్లు ఇస్తూ ఉండాలి. 


ఇవి వద్దు: శీతల పానీయాలు, జంక్‌ ఫుడ్‌ పిల్లలు తినకుండా చూసుకోవాలి. చక్కెర ఒంట్లోని నీటిని పీల్చుకుని, డీహైడ్రేషన్‌కు గురి చేస్తుంది. కాబట్టి తీయగా ఉండే పానీయాలు, తీపి పదార్థాలకు పిల్లలను దూరం పెట్టాలి. బడికి వెళ్లే పిల్లలకు స్నాక్‌గా బిస్కెట్లకు బదులుగా పండ్ల ముక్కలను అందించాలి. డీప్‌ ఫ్రీజర్‌లో చల్లబరిచిన నీళ్లు కాకుండా, ఫ్రిజ్‌లో డోర్‌లో ఉంచిన నీళ్లు తాగించడం మేలు. 


ఈ లక్షణాలు గమనించాలి: పిల్లలు నీరసంగా కనిపించినా, ఎక్కువ సమయం పాటు పడుకునే ఉంటున్నా, వాంతులు చేసుకుంటున్నా డీహైడ్రేషన్‌కు గురయినట్టు భావించాలి. శరీరం వేడిగా ఉందేమో పరీక్షించి, చల్లని నీళ్లలో తడిపి పిండిన క్లాత్‌తో ఒళ్లు తుడవాలి. చక్కెర, కొద్దిగా ఉప్పు కలిపిన ఓఆర్‌ఎస్‌ తాగించాలి. మార్కెట్లో దొరికే ఓఆర్‌ఎస్‌ పానీయాల్లో చక్కెర శాతం ఎక్కువ. కాబట్టి టెట్రా ప్యాక్‌లకు బదులుగా పొడి రూపంలో ఉండే ఓఆర్‌ఎ్‌సలనే ఎంచుకోవాలి.


డయేరియా

డయేరియా వానాకాలానికే పరిమితం కాదు. వేసవిలోనూ దీని తాకిడి ఎక్కువే! ఎండ వేడిమికి పదార్థాలు త్వరగా పాడైపోతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో తాజాగా వండిన వాటినే పిల్లలు తినేలా చూసుకోవాలి. బజార్లో బండ్ల మీద అమ్మే పండ్ల ముక్కలు, పండ్ల రసాలు, ఇతరత్రా పానీయాలు తాగడం వల్ల వాంతులు, విరోచనాలు వేధించే ప్రమాదం ఉంది. డయేరియాతో డీహైడ్రేషన్‌ తీవ్రత మరింత పెరిగిపోతుంది. రెండేళ్ల వయసు పిల్లలుఅన్ని రకాల ఘన, ద్రవ పదార్థాలూ పెద్దలతో సమానంగా తీసుకునే వయసు కాబట్టి, ఈ వయసు పిల్లలను పెద్దలతో సమానంగా పరిగణించవచ్చు. అయితే ఘనాహారం మొదలుపెట్టే ఆరు నెలల వయసు నుంచి ఏడాదిన్నర వయసు వరకూ పిల్లలకు అందించే ఆహారం, తీసుకునే జాగ్రత్తల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. 


ఆహారం: ఘనాహారం మొదలుపెట్టినప్పుడు, సాధారణంగా పప్పు, అన్నం, నెయ్యిని మాత్రమే కలిపి పిల్లలకు తినిపిస్తూ ఉంటారు. కానీ వేసవి వేడిమి నుంచి రక్షణ దక్కాలంటే కూరగాయలను కూడా ఆహారంలో తప్పక జోడించాలి. క్యారెట్‌, బంగాళాదుంప, కాలీఫ్లవర్‌ మొదలైన కూరగాయలను చిన్న ముక్కలుగా తరిగి, బియ్యం, పప్పుతో పాటు కుక్కర్‌లో మెత్తగా ఉడికించి తినిపించాలి. పెరుగు, పళ్లు తినిపించాలి. తీపి, ఉప్పులను దూరం పెట్టాలి. వీటికి అలవాటు పడే వయసు ఇదే కాబట్టి, భవిష్యత్తులో మధుమేహం, అధిక రక్తపోటు ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కోసం ఈ వయసు నుంచే చక్కెర, ఉప్పులను పిల్లలకు అలవాటు చేయకూడదు.


జాగ్రత్తలు: వదులైన కాటన్‌ దుస్తులు వేయాలి. సిల్క్‌, జీన్స్‌ దుస్తులకు స్వస్థి చెప్పాలి. ఉదయం, లేదా సాయంత్రం ఎండ తీవ్రత తక్కువగా ఉండే సమయంలోనే పిల్లలను ఆరుబయట ఆడనివ్వాలి. శరీరాన్ని తాకి చూస్తూ, ఒళ్లు వేడెక్కుతుందేమో గమనించాలి. తరచుగా నీళ్లు తాగిస్తూ ఉండాలి. పళ్ల రసాలను బదులుగా పండ్లను తినిపించాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు అందిస్తూ ఉండాలి. ఎండదెబ్బకు గురవకుండా చక్కెర, ఉప్పు కలిపిన నీళ్లు తాగిస్తూ ఉండాలి.  ఎసిలు 27 లేదా 28 డిగ్రీలకే సెట్‌ చేసి వాడుకుంటూ ఉండాలి.


డాక్టర్‌ టి. ఉషారాణి, పొఫ్రెసర్‌ - హెచ్‌.ఒ.డి పీడియాట్రిక్స్‌, 

నీలోఫర్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌.


Updated Date - 2022-03-15T19:09:18+05:30 IST