ఆన్‌లైన్‌ నగదు బదిలీ ద్వారా రూ.1.38లక్షలకు టోకరా

ABN , First Publish Date - 2021-01-24T06:25:45+05:30 IST

గుర్తు తెలియని వ్యక్తి లక్కీడ్రాలో కారు వచ్చిందని చెప్పి ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయించుకున్న ఘటన తూప్రాన్‌ పట్టణ పరిధిలోని అల్లాపూర్‌లో చోటు చేసుకుంది.

ఆన్‌లైన్‌ నగదు బదిలీ ద్వారా రూ.1.38లక్షలకు టోకరా

లక్కీ డ్రాలో కారొచ్చిందని గుర్తుతెలియని వ్యక్తి మోసం

తూప్రాన్‌, జనవరి 23: గుర్తు తెలియని వ్యక్తి లక్కీడ్రాలో కారు వచ్చిందని చెప్పి ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయించుకున్న ఘటన తూప్రాన్‌ పట్టణ పరిధిలోని అల్లాపూర్‌లో చోటు చేసుకుంది. పన్నులు, జీఎస్టీ పేరిట బాధితుడు పలుమార్లు ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం రూ.1,38,200 నగదు బదిలీ చేసి మొదటికే మోసం తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. తూప్రాన్‌ పట్టణ పరిధిలోని అల్లాపూర్‌కు చెందిన మానుక నర్సింహులు, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయ్‌ మొబైల్‌ ఫోన్‌కు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి శుక్రవారం ఓ కాల్‌ వచ్చింది. నీకు లక్కీడ్రాలో కారు వచ్చిందని, అయితే కారును పొందేందుకు ముందు ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుందని సూచించాడు. విజయ్‌ ఫోన్‌లో గూగుల్‌ పే అకౌంట్‌కు తండ్రి నర్సింహులు బ్యాంకు ఖాతాతో లింక్‌ ఉంది. దీంతో ఫోన్‌లో సూచించినట్లుగా తండ్రి బ్యాంకు ఖాతా నుంచి జీఎస్టీ, ఇతర పన్నుల పేరిట రూ. 99,700 వారికి బదిలీ చేశాడు. ఖాతాలోని డబ్బులన్నీ అయిపోవడంతో ఆందోళనకు గురైన విజయ్‌ తండ్రికి తెలిస్తే ఇబ్బంది ఉంటుందని ఫోన్‌ చేసిన వ్యక్తికి చెప్పాడు. మరో రూ. 40 వేలు చెల్లిస్తే కారును రద్దు చేస్తామని, దీంతో చెల్లించిన మొత్తం డబ్బు ఖాతాలోకి వాపస్‌ వస్తుందని ఆ వ్యక్తి తెలపడంతో విజయ్‌ మరో 38,500 తీసుకెళ్లి బ్యాంకులో జమ చేశాడు.  అయితే ఖాతా నుంచి చెల్లించిన మొత్తం డబ్బు తిరిగి జమ కాలేదు. కాగా డబ్బు బదిలీల సందర్భంగా తండ్రి నర్సింహులు ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో అనుమానించిన తండ్రి కొడుకును ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టాడు. దీంతో కారు డ్రా పేరిట  మోసపోయామంటూ బాధితుడు  శనివారం తూప్రాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2021-01-24T06:25:45+05:30 IST