లారీ పరిశ్రమకు గడ్డుకాలం

ABN , First Publish Date - 2022-08-08T06:09:39+05:30 IST

లారీ పరిశ్రమకు గడ్డుకాలం దాపురించింది. డ్రైవర్ల కొరతతోపాటు పెరిగిన డీజిలు ధరలు, టోల్‌ఫ్రీ ధరలతో పాటు అదేస్థాయిలో వాటి బాడుగల ధరలు పెరగకపోవడంతో లారీ యజమానులను కుంగదీస్తోంది.

లారీ పరిశ్రమకు గడ్డుకాలం

పెరిగిన డీజిల్‌, టైర్ల ధరలు, టోల్‌ రుసుం

గ్రీనట్యాక్స్‌తో దోపిడీ

ఆర్థికంగా చితికిపోతున్న యజమానులు

4 వేలకుపైగా లారీలు

తాడిపత్రి, ఆగస్టు 7: లారీ పరిశ్రమకు గడ్డుకాలం దాపురించింది. డ్రైవర్ల కొరతతోపాటు పెరిగిన డీజిలు ధరలు, టోల్‌ఫ్రీ ధరలతో పాటు అదేస్థాయిలో వాటి  బాడుగల ధరలు పెరగకపోవడంతో లారీ యజమానులను కుంగదీస్తోంది. డీజిలు ధరలు పెరిగిన స్థాయిలో బాడుగలు పెరగడంలేదు. లక్షలు పెట్టుబడి పెట్టి వాటికి తెచ్చిన వడ్డీలకు కూడా వస్తున్న ఆదా యం గిట్టుబాటు కావడంలేదు. ఆస్తు లు, భూములు, ఇతర వాటిని బ్యాంకు లు, ప్రైవేట్‌ ఫైనాన్సల్లో తెచ్చిన అప్పులు పెరిగిపోతుండడంతో భయంతో యజమానులు లారీలను నష్టాలకు అమ్ముకుంటున్నారు. ఒకప్పుడు నాలుగైదు లారీలతో దర్జాగా బతికిన వారు సైతం వాటిని తెగనమ్మి తెచ్చిన అప్పులు తీరక బ్యాంకులు, ప్రైవేట్‌ ఫైనాన్సలు వేసిన  కేసులతో కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతున్నారు. పెద్దఎత్తున లారీలను తెగనమ్ముకోవడంతో ఈ పరిశ్రమ ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు లారీలతో కళకళలాడిన తాడిపత్రి నేడు వెలవెలబోతోంది. రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో లారీ పరిశ్రమ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది.


నాలుగు వేలకు పైగా లారీలు 

తాడిపత్రి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. వందలాది గ్రానైట్‌, బండల పాలిష్‌ యూనిట్లతో పాటు అలా్ట్రటెక్‌, ఆర్జాస్‌ వంటి సిమెంట్‌, స్టీల్‌ తయారు చేసే భారీ పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు విస్తరించాయి. వాటి అనుబంధంగా అదేస్థాయిలో లారీ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. గతంలో  తాడిపత్రి పట్టణ, రూరల్‌ మండలాల్లో దా దాపు నాలుగు వేల లారీలు ఉన్నాయి. లారీల ద్వారా ఆంధ్రప్రదేశ, తెలంగాణ, జార్ఖండ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ, ఉత్తరప్రదేశ, కేరళ తదితర రాష్ట్రాలకు గ్రానైట్‌, కడప స్లాబ్‌ తదితరవాటిని రవాణా చేస్తూ వచ్చారు. భారీ పరిశ్రమల నుంచి సిమెంటు, స్టీల్‌ను ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అప్పట్లోతాడిపత్రి ప్రాంతంలో లారీ పరిశ్రమ విస్తృతస్థాయిలో అభివృ ద్ధి చెందింది. జిల్లాలో లారీ పరిశ్రమలో తాడిపత్రికి ప్రముఖ స్థానం ఉండేది. 


యజమానులవుతున్న డ్రైవర్లు, క్లీనర్లు

లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా ఉన్నవారు  ఈ మధ్యకాలంలో యజమానులుగా మారుతు న్నారు. ఇలాంటివారు తాడిపత్రి ప్రాంతంలో ఎక్కువమంది ఉన్నారు. లారీ డ్రైవర్లు యజమానులుగా మారడం వల్ల డ్రైవర్ల కొరత విపరీతంగా పెరిగింది. లారీల నిర్వహణ వల్ల కలిగే లాభనష్టాలు వారికి తెలుస్తుండడంతో పలువురు యజమానులుగా మారేం దుకు మొగ్గుచూపుతున్నారు. వీరికి చేయూతనిచ్చేందుకు బ్యాంకులు, పలు ప్రైవేటు ఫైనాన్స కంపెనీలు ముందుకొస్తున్నాయి. దీనివల్ల అనేకమంది లారీలను కొనుగోలు చేస్తూ వాటికి డ్రైవర్లుగా వెళుతున్నారు. వీరి కారణంగా డ్రైవర్ల కొరత అధికమవుతోంది. డ్రైవర్లు చిక్కకపోవడంతో పలువురు యజమానులు లారీలను నిలుపుకోవాల్సి వస్తోంది. మరికొం దరు లారీలను తెగనమ్ముకుంటున్నారు. కేవలం ఆరు నెలల కాలంలో తాడిపత్రి ప్రాంతంలో దాదాపు 500 లారీల అమ్మకాలు జరిగాయంటే డ్రైవర్ల కొరత ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. 


 పెరగని బాడుగ

2016లో డీజిల్‌ ఽధర రూ. 52.28, బాడుగ టన్నుకు 1300 నేడు డీజిల్‌ 99.58 బాడుగ 1350 ఉంది. అంటే ఆరు సంవత్సారాల కాలంలో డీజిల్‌ ధర రూ47.30 పెరగగా బాడుగ ధర మాత్రం టన్నుకు 50 రూపాయలు మాత్రమే పెరిగింది. తరచుగా పెరుగుతున్న డీజిలు ధరలతో ఒక్కో లారీ యజమాని నెలకు వేలకు వేలు అదనంగా నష్టపోతున్నాడు. సాధారణంగా ఒక్కో లారీ నెలకు 3 వేల కిలోమీటర్లు తిరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే పెరిగిన డీజిల్‌ ధరలకు పెరగని బాడుగల వల్ల  నెలకు లారీపై రూ.50 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. 


పెరిగిన ధరలు 

ఈ మధ్యకాలంలో టోల్‌ఫ్రీ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. గతంలో ఉన్న టోల్‌ఫ్రీ ధరలకు అదనంగా రూ.60 నుంచి రూ.200 వరకు పెరిగాయి. రోడ్లను బట్టి టోల్‌ ధరలు కూడా ఉంటున్నాయి. పెరిగిన టోల్‌ ధరలు లారీ యజమానులకు భారంగా పరిణమిస్తున్నాయి. ధరలు తగ్గించాలని ఆందోళనలు జరిగినా ఫలితం లేదు.  ఏడాదికి టోల్‌ల సంఖ్యకూడా పెరుగుతోంది. పదుల సంఖ్యలో పెరుగుతున్న టోల్‌వల్ల నెలకు  ఒక్కొక్క లారీకి 10నుంచి 15వేల రూపాయల వరకు భారం పడుతోంది. మరోవైపు టైర్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. నెలరోజుల క్రితం జత టైర్లు రూ.42 వేలు ఉండగా ప్రస్తుతం రూ.48 వేలు దాటాయి. సాధారణంగా టైర్ల జీవిత కాలం 80వేల కిలోమీటర్లు. కానీ రోడ్డు దెబ్బతినడం వల్ల ఏప్పుడు పగిలిపోతాయోననే భయం యజమానుల్లో ఏర్పడుతోంది. 


గ్రీనట్యాక్స్‌తో దోపిడీ

గ్రీన ట్యాక్స్‌ పేరుతో ప్రభుత్వం లారీ యజమానులను నిలువుదోపిడీ చేస్తోంది. ఇప్పటికే పెరిగిన డీజల్‌ ధరలు, పెరగని బాడుగలతో సతమతమవుతుంటే అదనంగా గ్రీన ట్యాక్స్‌ను వసులు చేస్తుండటంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలకు ఒకసారి 12, 14 టైర్ల లారీలకు 12,500 రూపాయలు, 16 టైర్ల లారీలకు 15వేల రూ పాయల చొప్పున చెల్లించాల్సి వస్తోంది. 


బ్యాంకు కంతులు కట్టలేకపోతున్నాం..

 వివిధ సంస్థలనుంచి అప్పులు తెచ్చి నాలుగు లారీలను నడుపుతున్నాను. అప్పట్లో ఉన్నా బాడుగలు ఇప్పుడు లేవు. పెరిగిన డీజిల్‌ ధరలకు అనుగుణంగా బాడుగలు పెంచడం లేదు. బాడుగలకు డిమాండ్‌ చేస్తే సరుకు ఇవ్వడం లేదు. లారీలను అ మ్ముకోలేక అరకొర బాడులకు నడుపుకోలేక తెచ్చిన అప్పులు తీర్చలేక ఆందోళన చెందుతున్నాను. 

- గుర్రప్ప, లారీ యజమాని, రాయలచెరువు, యాడికి మండలం


రెండు లారీల్లో ఒకటి అమ్మేశా..

సరైన బాడుగలు లేక తనకున్న రెండు లారీల్లో ఒక లారీని అమ్మాను. బాడుగలు పెరగకపోవడంతోపాటు పెద్దఎత్తున డీజిల్‌, టైర్ల ధరలు పెరిగాయి. గతంలో మాదిరిగా అనుకున్న స్థాయిలో లాభాలు రావడంలేదు. అరకొర లాభాలు చేతి ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. అప్పట్లో మాదిరిగా అనుభవం ఉన్న డ్రైవర్లు దొరకడం లేదు. ఉన్నవారికి వేలకు వేలు అడ్వాన్సుల రూపంలో ఇవ్వాల్సివస్తోంది. అయినా వారికున్న డిమాండ్‌ వల్ల సక్రమంగా డ్యూటీలకు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాను.

- రవీంద్రనాయుడు, లారీ యజమాని కోమటికుంట్ల, పుట్లూరు మండలం


ప్రభుత్వం పట్టించుకోవట్లేదు..

ప్రభుత్వం లారీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదు. లారీలను నమ్ముకొని లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాం. లారీ పరిశ్రమకు రాయితీలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రభుత్వం స్పందించకపోవడంతో అనేక మంది లారీలను నడపలేక అమ్ముకుంటున్నారు.

-  షెక్షావలి,  లారీ యజమాని, తాడిపత్రి


లారీ యజమానులకు ఆర్థిక కష్టాలు..

బాడుగలు పెరగకపోవడంతో లారీ యజమానులు అర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికితోడు  డ్రైవర్ల కొరత విపరీతంగా ఉంది. అనేకమంది డ్రైవర్లు, క్లీనర్లు లారీ ఓనర్లు అవుతున్నారు. ఈ మధ్యకాలంలో లారీ డ్రైవింగ్‌ నేర్చుకునేవారు కూడా తక్కు వయ్యారు. డ్రైవర్ల కొరత ఎక్కువగా ఉండడంతో ఉన్నవారికి పెద్దఎత్తున అడ్వాన్సులు ఇస్తున్నారు. వారు డ్యూటీలకు రాకుంటే వారి ఇళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొందరు డ్రైవర్లను భరించలేక లారీలను అమ్ముకుంటున్నారు.

- నదీం, లారీ అసోసియేషన కార్యదర్శి, తాడిపత్రి

Updated Date - 2022-08-08T06:09:39+05:30 IST