నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

ABN , First Publish Date - 2022-09-24T07:08:24+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం శనివారం జరగనుంది.

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

తిరుమల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం శనివారం జరగనుంది. స్థానిక అన్నమయ్య భవనంలో చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఈసమావేశంలో పాల్గొననున్నారు. ప్రధానంగా ఈనెల 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించనున్నారు. భక్తులు భారీగా వస్తారని అంచనా వేస్తుండటంతో రద్దీకి తగినట్టు చేయాల్సిన ఏర్పాట్లపై కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక తిరుమలలో అదనపు గదులు నిర్మించే అవకాశం లేకపోవడంతో భక్తుల సౌకర్యార్థం రూ.వంద కోట్లతో ఐదో యాత్రికుల వసతి సముదాయం(పీఏసీ) నిర్మించే అంశంపై చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. రూ.33కోట్లతో సర్వదర్శనం భక్తుల కోసం అదనపు క్యూలైన్‌ నిర్మాణం, ఇంజనీరింగ్‌ విభాగంలో ఖాళీల భర్తీ, వకుళమాత ఆలయాన్ని టీటీడీ పరిఽధిలోకి తీసుకునే అంశాలపై సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు. హుండీ ద్వారా వచ్చిన విదేశీ కరెన్సీ మార్పిడి అంశం చర్చకు రానుంది.  తిరుపతిలో టీటీడీకి ఉన్న 396 ఆస్తుల్లో 1999 నుంచి పెండింగ్‌లో ఉన్న 21కి ప్రాపర్టీట్యాక్స్‌ చెల్లించే అంశం చర్చించనున్నట్టు సమాచారం.  


Updated Date - 2022-09-24T07:08:24+05:30 IST