ఎస్పీ చొరవతో ఆ ఇద్దరూ ఇంటికి

ABN , First Publish Date - 2021-05-09T06:42:40+05:30 IST

తిరుపతి అర్బన్‌ ఎస్పీ చొరవతో శ్రీకాళహస్తి పట్టణం శక్తివీధికి చెందిన అశోక్‌, సాయం క్షేమంగా ఇంటికి చేరారు.

ఎస్పీ చొరవతో ఆ ఇద్దరూ ఇంటికి

ఏర్పేడు, మే 8: తన భర్తను రక్షించాలంటూ ఓ మహిళ ఫిర్యాదుపై తిరుపతి అర్బన్‌ ఎస్పీ స్పందించారు. ఆయన ఆదేశాలతో ఏర్పేడు పోలీసులు శనివారం రాత్రి ఆ మహిళ భర్త, తమ్ముడిని క్షేమంగా ఇంటికి చేర్చారు. బాధితురాలి వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ప్రోడక్ట్స్‌ కంపెనీ వేధింపుల నుంచి తన భర్తను రక్షించాలని శ్రీకాళహస్తి పట్టణం శ్రీరామ్‌నగర్‌కాలనీ శక్తివీధికి చెందిన దేవి కోరారు. తన భర్త పెద్దిరెడ్ల అశోక్‌కుమార్‌ 2006 నుంచి ఆ కంపెనీలో సైట్‌ కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్నారన్నారు. ఏర్పేడు మండలం జంగాలపల్లెలోని కేంద్రీయ విద్యాసంస్థ అయిన ఐఐఎ్‌సఈఆర్‌ నిర్మాణ పనులను కంపెనీ చేపడుతోందన్నారు. ఈ పనుల్లో వినియోగిస్తున్న ఇనుప కమ్మీల దొంగతనం జరిగిందంటూ ఆ కంపెనీలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులతో పాటు తన భర్తపైనా కంపెనీ అకౌంటెంట్‌ రాంబాబు ఏర్పేడు పోలీసులకు మార్చి 9న ఫిర్యాదు చేశారని చెప్పారు. అప్పటి నుంచి తన భర్తను నేరం ఒప్పుకోమని కంపెనీ ఉద్యోగులే వేధిస్తున్నారని వాపోయారు. గతనెల 30వతేదీ ఇంటి వద్ద ఉన్న తన భర్తను సైట్‌ వద్దకు రమ్మని కంపెనీలో పనిచేసే సాయి, షాబాజ్‌ పిలవడంతో వెళ్లాడన్నారు. అయితే ఇప్పటి దాకా తిరిగి ఇంటికి రాలేదన్నారు. దీంతో మే 1న తన తమ్ముడు సాయిని సైట్‌ వద్దకు పంపించానన్నారు. అక్కడ తన తమ్ముడిని, భర్తను బలవంతంగా ఓ గదిలో బంధించి కొడుతూ నేరాన్ని ఒప్పుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారి వేధింపుల నుంచి తన భర్తను కాపాడాలని పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె శనివారం తెలిపారు. 

తిరుపతి అర్బన్‌ ఎస్పీ చొరవ... 

డీఈసీ ఇన్‌ఫ్రా యాజమాన్యం ఫిర్యాదు మేరకు అశోక్‌ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఏర్పేడు సీఐ శివకుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన భార్య దేవి నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. ప్రస్తుతం ఈ కేసును తిరుపతి క్రైం పోలీసులు విచారిస్తున్నారని ఆయ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో డీఈసీ ఇన్‌ఫ్రా యాజమాన్యం తన భర్త, తమ్ముడిని రక్షించాలంటూ శనివారం రాత్రి దేవి వాట్సప్‌ ద్వారా తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన ఏర్పేడు పోలీసులతో వివరాలు ఆరా తీశారు. అనంతరం ఎస్పీ ఆదేశాలతో ఏర్పేడు సీఐ శివకుమార్‌రెడ్డి రాత్రి పది గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తిలోని దేవి ఇంటికి వెళ్లి అశోక్‌, సాయిని అప్పగించారు. 

Updated Date - 2021-05-09T06:42:40+05:30 IST